Take a fresh look at your lifestyle.

దు(ని)ర్భర భారతం

కాలాన్ని కొరోనా కాటేసిన తరువాత భారతదేశపు ముఖ చిత్రమే మారిపోయింది ! ఉపద్రవాల ఉధృతి మరింతగా పెరిగిపోయింది ! దాడి ఇప్పుడు ఎటు నుండైనా జరగవచ్చు ! ఎవరి నుండైనా జరగవచ్చు! క్రిముల నుండీ జరగవచ్చు ! రాజకీయ క్రిముల నుండి కూడా జరగవచ్చు! ఏది ఏమైనప్పటికీ దాడి జరగడం మాత్రం ఖాయం ! అది విసిరే పంజా నిజం !

పాల కులైనా, వైరస్‌ ‌లైనా మొదట బలహీనుల మీదనే దాడి చేస్తారు ! లాక్‌ ‌డౌన్‌ ఎత్తివేసి, పాలకులు ‘చేతులెత్తేసి’న తర్వాత పరిస్థితి ప్రశాంతంగా ఎందుకు ఉంటుంది ? పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లు వీళ్ళ బతుకులు మరింత దయనీయంగా మారిపోయాయి ! వైరస్‌ ‌దాడి చేస్తే క్వారంటైన్‌ ‌లో పడ్డారు ! పాలకులు వదిలివేస్తే వచ్చి ఇప్పుడు రోడ్ల మీద పడ్డారు ! మనిషి రోడ్డున పడడాన్ని మించిన దౌర్భాగ్యం ఇంకొకటి ఏమి ఉంటుంది చెప్పండి ! మనిషి రోడ్డున పడడం అంటే దేశం రోడ్డున పడడమే! దేశపు పరువూ రోడ్డున పడడమే ! ప్రపంచం ముందు మనం దోషులుగా తలవంచుకుని నిలబడడమే !

సంక్షోభాలు మనిషికి కొత్త కాదు! సంక్షోభాల తో సమరమూ కొత్త కాదు ! కానీ సంక్షేమ జపం చేస్తున్న చోట సంక్షోభాలు వెల్లువెత్తడమే కొత్త ! స్వదేశీ నామస్మరణ నిత్య పారాయణ మవుతున్న చోట దేశ సంపదను విదేశీ శక్తులకు అప్పగించడమే కొత్త ! పెట్టుబడుల పేరిట పెట్టుబడిదారుల దోపిడీకి రహదారులు నిర్మించడమే కొత్త ! పాలకుల దేముంది? వాళ్లు ఎంతకైనా సాగిల పడతారు! అలాంటప్పుడు ఇంక అడ్డేముంటుంది ? ఫలితం , తలుపులు బార్లా తెరుచుకుంటాయి! వనరుల తరలింపు సాఫీగా సాగి పోతూ ఉంటుంది ! కార్పొరేట్ల కు గంపగుత్తగా దేశ సంపదను సంతర్పణ చేసుకుంటూ పోయిన తరువాత దేశ ప్రజలకు ఇక మిగలేది ఏమిటి ? ఇక్కడ మేత కార్పొరేట్‌ ‌లది ! మోత (బరువు) బడుగు ప్రజలది ! రక్షణ, స్పేస్‌ ‌లాంటి రంగాలలో కూడా స్వీయ నియంత్రిత లక్ష్మణ రేఖలను చెరిపి వేసుకున్న తరువాత ,భద్రత ఇక్కడొక డొల్ల మాట ! బాధ్యత పనికిరాని గాలి కబురు! ఇక్కడ ఇప్పుడు మనిషికీ రక్షణ లేదు ! దేశానికీ రక్షణ లేదు !

యుద్ధం మనిషికి కొత్త కాదు! అనాదిగా యుద్ధం చేస్తూనే వున్నాడు ! చావూ మనిషికి కొత్త కాదు ! చావుతో సహజీవనం సాగిస్తూ వస్తున్నాడు ! కానీ ఇప్పుడు బతుకు మనిషిని తీవ్రంగా భయపెడుతోంది ! భవిష్యత్తే అతనికి ‘మహమ్మారి’లా కనిపిస్తున్నది ! ఉపద్రవాల ఉప్పెనలు అంతా ఊడ్చి పారేసి పోయిన తరువాత , మెల్లగా ఉద్దీపనల లేపనాలు ఊపందుకుంటున్నాయి ! ‘ఆత్మనిర్భ(బ్బ)ర ప్రకటన’ల తరువాత కూడా పేదవాని బతుకు మరింత దుర్భరంగా మారబోతున్నది ! ఎందుకంటే ఇప్పుడు దొరికితే కరోనా చంపేస్తుంది ! బయటపడితే రేపు కరువు చంపేస్తుంది ! చావుకీ – చావుకీ మధ్య చావడం ఎట్లా అన్నదే ఇప్పుడు అసలు సమస్య ! పేదవానికి ఇంతకు మించిన పెద్ద చావు ఇంకొకటి వేరే ఏమి వుంటుంది చెప్పండి !!?
– గుండెబోయిన శ్రీనివాస్‌, 9985194697

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!