Take a fresh look at your lifestyle.

డ్రగ్స్ ‌భూతాన్ని తరిమికొట్టాలి

‘‘‌నేటి ప్రపంచం అపసవ్య దిశలో పయనిస్తున్నది. సకల అవలక్షణాలతో, వ్యసనాలతో మానవ వనరులు నిర్వీర్యమై, అభివృద్ధి అడుగంటుతున్నది. ఏ దేశమైనా ప్రగతి పథంలో ముందుకు సాగాలంటే ఆ దేశంలోని యువత చక్కని క్రమశిక్షణతో,సద్వర్తనంతో మెలగాలి.యువశక్తి దేశానికి ఆయువుపట్టు. అలాంటి యువత వ్యసనాలకు అలవాటుపడి,సంఘవిద్రోహులుగా మారితే ఏ దేశమైనా అభివృద్ధి ఎలా సాధిస్తుంది?’’

దేశాన్ని, దేశ ఔన్నత్యాన్ని నిలబెట్టగల శక్తి సామర్థ్యాలు  యువత స్వంతం. మార్పురావలసింది యువతలో…మార్పు తేవలసింది కూడా యువత. దురదృష్టవశాత్తూ నేటి యువత తమ కర్తవ్యాన్ని విస్మరించి, మత్తులో తేలియాడి, జ్ఞానాన్ని, విచక్షణను, శక్తిసామర్ధ్యాలను కోల్పోయి, నిర్వీర్యమై, నిస్తేజంగా మారడమే కాకుండా సమాజానికి భారంగా తయారవడం అత్యంత దురదృష్టకరం.  మద్యపానం, మాదక ద్రవ్యాల వినియోగం వలన యువశక్తి పెడదారి పడుతున్నది. మద్యాన్ని,మాదక ద్రవ్యాలను సమాజం నుండి దూరం చేయకుండా పటిష్ఠమైన భారత నిర్మాణం సాధ్యమా? యువతను మత్తులో ముంచి, చిత్తు చేసే మద్య ప్రవాహానికి  డ్రగ్స్ అ‌క్రమ వినియోగానికి, అడ్డుకట్ట వేయాలి. సకల అనర్ధాలకు, ఆరాచకాలకు,హత్యలకు ప్రేరణగా నిలిచే తాగుడు ,డ్రగ్స్ ‌వాడకం  వంటి  దరిద్ర వ్యసనాలను దూరం చేయకుండా సమాజం బాగుపడదు.మాదకద్రవ్యాల వినియోగం పెను శాపంలా దాపురించింది. డ్రగ్స్ ‌మాఫియా సర్వత్రా శీఘ్రంగా వ్యాప్తి చెందడం అత్యంత ఆందోళన కలిగించే విషయం.

మాదక ద్రవ్యాల వినియోగం,అక్రమ రవాణా వలన కలిగే విపరీత పరిణామాలను అవగతం చేసుకున్న అంతర్జాతీయ సమాజం డ్రగ్స్ ‌కు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించు కున్నప్పటికీ, డ్రగ్స్ ‌మహమ్మారి ఇంకా విస్తృతంగా వ్యాప్తి చెందు తున్నదే తప్ప, సమసి పోవడం లేదు. 1987 వ సంవత్సరంలో వియన్నా లో అంతర్జాతీయ  డ్రగ్స్ ‌వ్యతిరేక సదస్సు జరిగింది. క్రమేపీ ప్రపంచంలోని అన్నిదేశాలు డ్రగ్స్ ‌మహమ్మారి ని అరికట్టడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తూ చట్టాలకు పదును పెడుతున్నాయి.1987 లో ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ డ్రగ్స్ ‌లేని అంతర్జాతీయ సమాజానికై పిలుపునిచ్చింది .1989 లో జరిగిన ఐ.రా.స సదస్సు మత్తు పదార్ధాలకు వ్యతిరేకంగా పొరాడాలని, ప్రజలకు వీటి వినియోగం వలన కలిగే దుష్ఫలితాలపై అవగాహన కలిగించాలని నిర్ణయించుకుని కార్యాచరణ ప్రణాళిక రచించినా, ఫలితం మాత్రం  ఆశించిన రీతిలో లేదు. 1998 లో ఐ రా.స జనరల్‌ అసెంబ్లీ ‘‘గ్లోబల్‌ ‌డ్రగ్స్’’ ‌సమస్యపై ఒక తీర్మానం ఆమోదించింది.మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఎన్ని ప్రచారోద్యమాలు జరిగినా, వీటి అక్రమ రవాణా పై ఉక్కుపాదం మోపాలని అంతర్జాతీయ సమాజానికి మార్గనిర్ధేశనం చేసినా, డ్రగ్స్ ‌వినియోగం ఏ మాత్రం తగ్గడం లేదు.

తాగుడు  వ్యసనంతో పాటు డ్రగ్స్ ‌వ్యసనం కూడా సమాంతరంగా అభివృద్ధి చెందుతున్నది.ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ‘‘యున్‌.ఓ.‌డి.సి’’ సంవత్సరాల తరబడి ఇతర అంతర్జాతీయ సంస్థలతో కలిసి, డ్రగ్స్ ‌పై పోరాటానికి, ప్రజల్లో చైతన్యం కలిగించడానికి కృషి చేస్తున్నది. మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రరిణామాల వలన  వివిధ దేశాల ప్రభుత్వాలు ఎన్నో సమస్యలను  ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 200 మిలియన్ల మందికి పైగా డ్రగ్స్ ‌కు  బానిసలని కొకైన్‌,‌మార్జువానా, మార్ఫిన్‌, ‌చరస్‌,‌హెరాయిన్‌ ‌వంటి మాదకద్రవ్యాలు విచ్చలవిడిగా వినియోగించడం జరుగుతున్నదని గణాంకాలు తెలియచేస్తున్నాయి. ఇతర దేశాల విషయం ప్రక్కన బెడితే భారత ప్రభుత్వం 1985 లోనే మాదక ద్రవ్యాల వ్యతిరేక చట్టం ‘‘ఎన్‌.‌డి.పి.ఎస్‌’’ ‌తీసుకురావడం, తర్వాత పలు సవరణలతో ఈ చట్టాన్ని పటిష్ఠం చేసింది. అయితే చట్టాలెన్ని చేసినా ప్రజల దృక్పథంలో మార్పు రానంతకాలం ఇవి కేవలం కాగితాలకే పరిమితం కాక తప్పదు. ప్రజల్లో వివేచన కలగాలి.

నేటి ప్రపంచం అపసవ్య దిశలో పయనిస్తున్నది. సకల అవలక్షణాలతో, వ్యసనాలతో మానవ వనరులు నిర్వీర్యమై, అభివృద్ధి అడుగంటుతున్నది. ఏ దేశమైనా ప్రగతి పథంలో ముందుకు సాగాలంటే ఆ దేశంలోని యువత చక్కని క్రమశిక్షణతో, సద్వర్తనంతో మెలగాలి.యువశక్తి దేశానికి ఆయువుపట్టు. అలాంటి యువత  వ్యసనాలకు అలవాటుపడి,సంఘవిద్రోహులుగా మారితే ఏ దేశమైనా అభివృద్ధి ఎలా సాధిస్తుంది?ఆనందకరమైన జీవితం  కేవలం మంచి నడవడిక, క్రమశిక్షణ  వలనే ప్రాప్తిస్తుంది కాని దురలవాట్ల వలన కాదు. నైతికత, మానవీయత లేకుండా గొప్పలకోసం చేసే ప్రచార పటోటాపాలవల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరదు. మంచి లక్షణాలతో, రుజువర్తనంతో, మంచి వ్యక్తుల స్నేహాలతో వ్యక్తిత్వ వికాసం కలుగుతుంది.సకల దురవాట్లతో సహజీవనం చేస్తూ, పైకి ఢాంబికం ప్రదర్శిస్తూ గొప్పల కోసం ప్రాకులాడడం వలన ఛీత్కారమే తప్ప నిజమైన సత్కారానికి తావుండదు.

పాతకాలం నాటి విద్యావిధానంలో  చిరుప్రాయం నుండే విలువలతో కూడిన విద్యను నేర్పేవారు. నీతి కథలతో, సందేశాలతో కూడిన విద్య వలన బాలలు యువకులు గా మారిన తర్వాత వారిలో మంచి లక్షణాలు అలవడేవి. యుక్తాయుక్త విచక్షణ కలిగి వివేచనతో ప్రవర్తించేవారు. దేశం పట్ల,కుటుంబం పట్ల వారికి ఒక అవగాహన ఏర్పడేది. అందుకే  సమాజంలో ఎలాంటి అలజడులు లేకుండా ప్రతీ ఒక్కరూ ప్రశాంతంగా జీవించే వారు. అయితే నేడు ఆ పరిస్థితులు మృగ్యమైనాయి. యువత చెడుదారిలో పయనిస్తున్నది. మంచి చెడులను బోధించే విద్యావిధానం రావాలి. నూతన విద్యావిధానం లో మరికొన్ని మార్పులు చేసి, విలువలకు అగ్రతాంబూలమివ్వాలి. కేవలం చదువంటే మార్కుల మాయ, గ్రేడులగోలలా ఉండరాదు.మానసిక పరిపక్వత లేని చదువుల వలన వివేకం అబ్బడం లేదు. చిన్నవయసునుండే పెద్దలను ఎదురించడం, యుక్త వయసు వచ్చాక వ్యసనాలకు అలవాటుపడి, వ్యసనాలకోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చుచేయడం, డబ్బు లేక పోతే సంఘవిద్రోహులుగా మారి దేశానికి భారంగా మారడం మనం చూస్తున్నాం.

ప్రపంచం మారింది.మారిన కాలానికి అనుగణంగా మనం కూడా మార్పుకు సిద్ధం కావాలి. అయితే ఈ మార్పు సవ్యంగా ఉండాలి. సంఘాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా ఉండరాదు. అయితే నేటి ప్రపంచంలోని అనేక దేశాల్లో బాలలనుండి, యువకులు,వృద్దుల వరకు వ్యసనాలకు బానిసలై అభివృద్ధి కి ఆటంకంగా తయారౌతున్నారు.నాగరికత వెర్రి తలలు వేస్తున్నది. అసహజమైన రీతిలో వికృతంగా మారే వ్యక్తుల వలన సమాజంలో శాంతి భద్రతలు కరువై ఆటవిక ప్రవర్తన వ్రేళ్ళూనుకుంటున్నది.ఎక్కడ చూసినా మద్యపానం..ధూమపానం చతుర్ముఖపారాయణం…అత్యాచారాలు...లైంగిక వేధింపులు. సంపాదనంతా వ్యసనాలకే సరిపోతుంటే ఇక పిల్లల బాధ్యత పడుతుందా? వ్యసనపరులై, భ్రష్టులైన పెద్దలు తమ పిల్లలను ఏ రకంగా పెంచగలరు? అలాంటి వారి వలన,అలాంటి వాతావ రణంలో పెరిగే పిల్లలు ఎలా తయారౌతారో వేరే చెప్పనక్కరలేదు. బాధ్యత లేని తల్లిదండ్రుల వలన, విలువలు నేర్పని విద్యల వలన ప్రపంచమే నైతికంగా పతనమైపోతున్నది.యువశక్తి నిర్వీర్యమై పోతున్నది. ఆల్కహాలిజం వలన యువత అనునిత్యం మత్తులో తూలుతున్నది. ఇది చాలదన్నట్టు మాదక ద్రవ్యాల వ్యసనం ఒక మహమ్మారిలా మానవ సమాజంలో ప్రవేశించింది. అతి భయంకరమైన డ్రగ్స్ ‌భూతానికి మానవ వనరులన్నీ నిర్వీర్యమై పోతున్నాయి. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన యువత చేయలేని దుర్మార్గమంటూ ఏదీ లేదు. మత్తులో చిత్తయి, వారి అలవాట్లకు, అవసరాలకు సంఘ విద్రోహుల వలలో చిక్కి యువత అసాంఘిక కార్యకాలాపాల వైపు పయనించడం ఆందోళన కలిగించే విషయం.

భ్రమల్లో తేలియాడించి ఊహల పల్లకీలో ఊరేగించి, రంగుల ప్రపంచం చుట్టూ పరిభ్రమించేలా చేయగల శక్తి మాదక ద్రవ్యాలకుంది.ఈ డ్రగ్స్ ‌కు  అలవాటు పడిన వారికి మానవ ప్రపంచంతో సంబంధాలుండవు. మంచి-చెడు విచక్షణ కనిపించదు. స్వప్నలోకాల్లో విహరిస్తూ,మత్తు వదలిన తర్వాత అనేక శారీరక,మానసిక బలహీనతలకు గురై, మళ్ళీ అదే మత్తుకోసం చేయకూడని అకృత్యాలన్నీ చేస్తారు. డ్రగ్స్ ‌మాఫియా వలలో చిక్కి, డ్రగ్స్ అ‌క్రమ వినియోగానికి, చట్టవిరుద్దమైన డ్రగ్స్ ‌రవాణాకు పాల్పడతారు. డ్రగ్స్ ‌కు బానిసలై ఉగ్రవాదులుగా మారుతున్న వారెంతో మంది సమాజానికి చీడపురుగుల్లా తయారౌతున్నారు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటూ, అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటున్నారు. వీరి వలన అభివృద్ధి ఆగిపోతున్నది. విద్య, వైద్య, ఆరోగ్యం, అభివృద్ధి వంటి వాటిపై దృష్టి పెట్టవలసిన ప్రభుత్వాలు సింహభాగం నిధులను  అరాచకశక్తుల అణచివేతకోసం, బాహ్య,ఆంతరంగిక అసాంఘిక శక్తులను అడ్డుకోవడానికే వెచ్చించవలసి వస్తున్నది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలకు ప్రజోపయోగకరమైన కూడు,గూడు,గుడ్డ  విద్య,వైద్య, ఆరోగ్యం వంటి అంశాలపై అధిక నిధులు వెచ్చించలేకపోవడం జరుగుతున్నది.

ఈ పరిస్థితులు మారాలి. ప్రజల్లో మార్పు రావాలి. మత్తులో తూలుతున్న యువతను ఆ మత్తు నుండి బయటకు తీసుకురావాలి. సకల అనర్ధాలకు,సమాజంలో చోటుచే సుకుంటున్న అరాచకాలకు, అమానుషత్వ ధోరణులకు ‘‘మత్తు’’ ప్రధాన కారణంగా అనేక సర్వేలు సూచిస్తున్నాయి. ఆధునిక ప్రపంచంలో  మాదక ద్రవ్యాల ప్రభావం గురించి ప్రత్యేకంగా విశ్లేషించనక్కరలేదు. మానసిక ప్రవర్తనలో విపరీతమైన ధోరణులను ప్రేరేపించి, అరాచకత్వానికి నాంది పలుకుతున్న డ్రగ్స్ ‌ను యువత నుండి దూరం చేయాలి. డ్రగ్స్ ‌లేని సమాజాన్ని రూపొందించడానికి అంతర్జాతీయ సమాజం మరింత కృషి చేయాలి. డ్రగ్స్ ‌మహమ్మారి ని పారద్రోలి వివేకవంతమైన సమాజ స్థాపనకు ప్రతీ ఒక్కరూ నడుంబిగించాలి. ఖండాం తరాలకు విస్తరించిన డ్రగ్స్ ‌దందా ను అరికట్టాలి. నగరాలను దాటి, పల్లెల్లోకి ప్రవేశించిన డ్రగ్స్ ‌మహమ్మారిని కూకటి వ్రేళ్ళతో పెకలించాలి.

sunkapalli satti
సుంకవల్లి సత్తిరాజు
(సామాజిక విశ్లేషకులు) సంగాయగూడెం,తూ.గో.జిల్లా,
ఆంధ్రప్రదేశ్‌. 9704903463

Leave a Reply