Take a fresh look at your lifestyle.

తెరుచుకుంటున్న పరిశ్రమలకు కార్మికుల కరువు..

దేశవ్యాప్తంగా నెలన్నర రోజులుగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ ‌సడలింపులలో భాగంగా ఇప్పుడిప్పుడే ప్రజలు తమ నిత్య జీవన శైలికి చేరుకుంటున్నారు. ఇంతకాలంగా మూసివేసిన దుకాణాలు ఇతర వ్యాపారాలన్ని క్రమేణ తెరుచుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దశలవారీగా అనుమతులివ్వడంతో నగరాలు, పట్టణాల్లో జనసందడి కనిపిస్తున్నది. లక్షలాది మందికి ఉపాధిని కల్పించే పరిశ్రమలు నెలన్నర రోజుల తర్వాత ఇప్పుడిప్పుడే దుమ్ముదులుపుకుంటున్నాయి. స్థంబించిపోయిన ఆర్థిక ప్రగతి చక్రాలు మళ్ళీ తిరగనున్న సమయంలో ఈ రంగానికి మానవవనరుల సమస్య వచ్చిపడింది. దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లోని పరిశ్రమల్లో పనిచేసేందుకు వివిధ రాష్ట్రాల నుండి వచ్చే కూలీలు కొరోనా లాక్‌డౌన్‌కు విలవిలలాడిపోయారు. బతికుంటే బలుసాకైనా తినవచ్చన్నట్లు తమ గ్రామాలకు దారితీశారు. లాక్‌డౌన్‌ ‌నిర్బంధాన్ని కూడా లెక్కచేయకుండా కాలినడకన వందలు, వేల కిలోమీటర్లదూరమైన నడవడానికి సిద్ధపడిన ఈ వలస కార్మికుల ప్రయాణాన్ని నియంత్రించడం దేశంలోని ఏ రాష్ట్రానికి సాధ్యపడలేదు. వారిని కేవలం కూలీలుగానే చూడట్లేదని, తమ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు లాంటివారు ఎంత నచ్చచెప్పినా వినే పరిస్థితి లేకుండా పోయింది. అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఏర్పడడంతో ఇంచుమించు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం విధిలేని పరిస్థితిలో వీరిని తరలించేందుకు ప్రత్యేక రైళ్ళను ఏర్పాటు చేసిందంటే దేశ వ్యాప్తంగా వలస కూలీల సంఖ్యను అర్థం చేసుకోవచ్చు. కేంద్రం లెక్కల ప్రకారం మే ఒకటవ తేదీ నుండి బుధవారం ఏడవ తేదీవరకు దాదాపు 115 వలస కార్మికులకోసం శ్రామిక స్పెషల్స్‌ను నడిపి, సుమారు లక్షమందిని వారివారి ప్రాంతాలకు పంపించారు. ప్రతీ బొగీలో 72 మంది కూర్చునే అవకాశం ఉన్నప్పటికీ సామాజిక దూరాన్ని పాటించడంలో భాగంగా బోగీ ఒక్కంటికి కేవలం 54 మందిని మాత్రమే తరలిస్తున్నారు. దీనివల్ల బతుకుదెరువు కోసం వివిధ రాష్ట్రాకు వలస వెళ్ళినవారంతా తమతమ రాష్ట్రాలకు చేరుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్ళను నడుపాల్సిన పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే నలభై నాలుగు రోజులుగా మూతపడిన అన్ని రంగాలు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్న తరుణంలో వలస కార్మికులు లేకపోవడమన్నది ఇబ్బందికరంగా మారబోతున్నది. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రాన్ని పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రంలో పలు రాష్ట్రాల నుండి వచ్చి వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు పొందుతున్నవారు ఎంతలేదన్నా పది నుండి పదిహేను లక్షల వరకుంటారన్నది ఒక అంచనా. ప్రధానంగా పక్క రాష్ట్రమైన ఏపి, బీహార్‌ ‌రాష్ట్రాల నుండి వేల సంఖ్యలోవచ్చి ఇక్కడ స్థిరపడ్డవారున్నారు. అలాగే ఒడిషా, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుండి కూడా అధిక సంఖ్యలో ఇక్కడికి వలస వచ్చారు. వీరంతా భవననిర్మాణ రంగంలో, సాగునీటి ప్రాజెక్టులు, ఇటుక బట్టీలు, సిమెంట్‌, ‌కాగితం తయారి పరిశ్రమలతోపాటు ఇతర అనేక రంగాల్లో పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఉపాధి కరువై ఇతర దేశాలకు, రాష్ట్రాలకు మనరాష్ట్రం నుండి వేల సంఖ్యలో వెళ్ళిన వారూ ఉన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వారందరిని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఆహ్వానించినప్పటికీ తిరిగి రాకపోవడంతో ఇతర రాష్ట్రాల వారికిక్కడ ఉపాధి లభ్యమైంది.

వీరంతా ఇప్పుడు కొరోనా ప్రభావంతో తమ ప్రాంతాలకు వెళ్ళడంతో లాక్‌డౌన్‌ ‌సడలింపులో తెరుచుకుంటున్న పరిశ్రమల్లో పనిచేసేవారి కరువేర్పడుతున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే కర్నాటకలోని బిజెపి ప్రభుత్వం వలసకార్మికులను వారి స్వస్థలాలకు పంపకుండా చేస్తున్న ప్రయత్నాలు పలు విమర్శలకు దారితీస్తున్నది. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బెంగుళూరులో ఉన్న వివిధ రాష్ట్రాల వలస కార్మికులను వారి రాష్ట్రాలకు తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన శ్రామిక్‌ ‌స్పెషల్స్‌ను కర్ణాటక ప్రభుత్వం రద్దుచేయాలనడమే ఈ విమర్శలకు కారణమైంది. నిలిచిపోయిన భవన నిర్మాణాలు ప్రారంభిస్తున్న నేపథ్యంలో కార్మికులు లేకుండాపోతే తిరిగి అభివృద్ధి కుంటుపడుతుందన్నది ఆ రాష్ట్ర ఉద్దేశ్యంకాగా, కార్మికులను బాండెడ్‌ ‌లేబర్‌గా చూస్తున్నారన్నది ఎచూరి ఆరోపణ. తెలంగాణలో కూడా ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడబోతున్నది. భవన నిర్మాణంలో ఏపి, బీహార్‌ ‌ప్రాంతాలవారు ఎక్కువగా పనిచేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న వలసకూలీలను తిరిగి పంపించడానికి ఎంతలేదన్న కనీసం నలభై ప్రత్యేక రైళ్లు అవసరమని ఇప్పటికే తెలంగాణ సర్కార్‌ ‌కేంద్రానికి తెలియజేసింది. అంతేకాకుండా ఇప్పటికే వేలసంఖ్యలో కూలీలు వెళ్ళారు కూడా. ఈ నేపథ్యంలో కూలీలంతా వెళ్ళిపోతే తిరిగి పరిశ్రమలన్నీ కుంటుపడే ప్రమాదమంది. ఈ విషయంలో దూరాలోచనతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి లాక్‌డౌన్‌ ‌ప్రారంభంలోనే వలస కూలీలను అనునయించే ప్రయత్నం చేశారు. వారంతా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములంటూ, వారిని కాపాడుకునే బాధ్యత తమదేనని చెప్పారు. ఏ పరిశ్రమలో పనిచేస్తున్నారో ఆ పరిశ్రమల యాజమాన్యం వారికి లాక్‌డౌన్‌ ‌రోజుల వేతనాలు చెల్లించాలని ఆదేశిస్తూనే అందరిలాగానే వారికి బియ్యం, నగదు రూపాయలను అందించే ఏర్పాటు చేసినప్పటికీ మూకుమ్మడిగా తమ గ్రామాలకు వెళ్ళడానికే వారు సిద్ధపడడం పారిశ్రామిక రంగానికి మరికొంతకాలం స్థబ్ధత ఏర్పడకతప్పని పరిస్థితి ఎదురుకానుంది.

Leave a Reply