Take a fresh look at your lifestyle.

తమిళనాడుకు తాగునీరివ్వండి

  • సీఎం కేసీఆర్‌కు తమిళ మంత్రుల విజ్ఞప్తి
  • సీఎం అంగీకారం, ఏపీ సీఎం జగన్‌కు ఫోన్‌

‌తమిళనాడు రాష్ట్రానికి తాగునీరివ్వడానికి సీఎం కేసీఆర్‌ అం‌గీకరించారు. గురువారం ప్రగతిభవన్‌లో తమిళనాడు మంత్రులు ఎస్పీ వేలుమణి, జయకుమార్‌, ‌పబ్లిక్‌ ‌వర్క్ ‌శాఖ కార్యదర్శి కె.మణివాసన్‌, ‌సలహాదారు షీలా ప్రియ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, ‌వేముల ప్రశాంతరెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌, ‌నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌ ‌కుమార్‌ ‌సీఎంవో అధికారులు స్మితా సభర్వాల్‌, ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే పాల్గొన్నారు. తమిళనాడు మంత్రుల అభ్యర్థనపై సీఎం కేసీఆర్‌ ‌స్పందిస్తూ ఈ విషయంపై ఏపీ సీఎంతో కూడా చర్చలు జరపాల్సి ఉన్నందున తమిళనాడు ముఖ్యమంత్రి నుంచి అధికారికంగా తమ ఇరు రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాయాలని సూచించారు.

అనంతరం మూడు రాష్ట్రాల అధికారులు, నిపుణుల స్థాయిలో సమావేశం జరపాలనీ, ఆ సమావేశంలో చర్చించిన అంశాల ఆధారంగా ఒక నివేదిక తయారు చేయాలని కోరారు. తుది నిర్ణయం తీసుకోవడానికి అధికారులంతా ఏకాభిప్రాయానికి రావాలనీ, ఆ నివేదిక ఆధారంగా తాము నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యాచరణ సిద్ధమైతే మూడు రాష్ట్రాలు దేశానికి మార్గదర్శకంగా మారతాయని చెప్పారు. తాగునీటి సమస్యల పరిష్కారం విషయంలో రాష్ట్రాల మధ్య సహనపూరిత వాతావరణం ఉండాలనీ, పొరుగు రాష్ట్రాలు ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ఉండాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. తమిళనాడు తాగునీటి సమస్యను తాను నీతి ఆయోగ్‌ ‌సమావేశాలలో తాను పలుమార్లు లేవనెత్తాననీ, ఇదే విషయంపై తమ పార్టీ ఎంపీలు కూడా లోక్‌సభలో పలుమార్లు ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు.

వాస్తవానికి తమిళనాడు తాగునీటి సమస్యతో బాధపడుతున్నందున దేశమంతా సిగ్గుపడాలన్నారు.దేశంలో లభించే మొత్తం 70 వేల టీఎంసీల నీటిలో సాగునీటి అవసరాలు తీర్చగా, మరో 30 వేల టీఎంసీల నీరు మిగిలి ఉంటుందని చెప్పారు. ఇందులో కేవలం 10వేల టీఎంసీల నీరు మాత్రమే దేశం మొత్తం తాగునీటి అవసరాలకు సరిపోతుందని చెప్పారు. తమిళనాడు రాష్ట్రం తాగునీటి విషయంపై ఆ ప్రభుత్వం ప్రత్యేక వ్యూహం కలిగి ఉండాలని సీఎం సూచించారు. అత్యంత ప్రాధాన్యతా అంశమైన తమిళనాడు తాగునీటి అవసరాలపై దేశవ్యాప్త అవగాహన అవసరమనీ, అందరూ అర్థం చేసుకున్ననాడే ఈ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. పొరుగు రాష్ట్ర సీఎంగా భారతీయుడిగా తాను తమిళనాడు రాష్ట్రానికి సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు సీఎం కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. తమిళనాడుకు తాగునీటి కోసం ఆ రాష్ట్ర ప్రతినిధి బృందం అభ్యర్థలన గురించి ఏపీ సీఎం జగన్‌కు ఫోన్‌ ‌చేసి చెప్పారు. ఇందుకు తాను సూత్రప్రాయంగా అంగీకరించిన విషయాన్ని సమస్య పరిష్కారం కోసం ఆ రాష్ట్ర ప్రతినిధి బృందానికి ఇచ్చిన సూచనలను జగన్‌కు వివరించారు. తమిళనాడులో తాగునీటి కష్టాలు తెలిసిన విషయమే కాబట్టి ఆ రాష్ట్రానికి నీరు అందించాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్‌ ఈ ‌సందర్భంగా ఏపీ సీఎం జగన్‌కు తెలిపారు.

Tags:SP velumani Ministers of Tamil Nadu, Jayakumar, Secretary of the Department of Public Work

Leave a Reply