- కెసిఆర్ విజన్ కారణంగానే సాకారం
- కేంద్ర జలశక్తి శాఖ గణాంకాల్లో ముందున్న తెలంగాణ
- ట్విట్టర్ ద్వారా ఆనందం పంచుకున్న మంత్రి కెటిఆర్
ఇంటింటికీ నల్లా కనెక్షన్ల ద్వారా సురక్షిత మంచినీటిని సరఫరా చేయడంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలవడంపై రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్, ఆర్డబ్ల్యూఎస్ కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని కేటీఆర్ ట్వీట్ చేశారు. 98.31 శాతం ఆవాసాలకు నల్లాలతో తాగునీటిని అందిస్తూ దేశంలోనే తెలంగాణ మొదటిస్థానంలో నిలిచిందని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు. ఏ ఇతర రాష్ట్రం కూడా తెలంగాణకు దరిదాపుల్లో లేకపోయింది. మిషన్ భగీరథతో ఈ ఘనకార్యం నెరవేరిందని అన్నారు. ఈ విషయాన్ని బుధవారం కేంద్రజల్‌శక్తి మంత్రిత్వశాఖకు చెందిన జల్ జీవన్ మిషన్ వెల్లడించిన గణాంకాలు స్పష్టం చేశాయి. నల్లా కనెక్షన్లలో దేశసగటు 27.28 శాతం ఉండగా.. 2.05 శాతంతో పశ్చిమ బెంగాల్ చివరి స్థానంలో ఉన్నది. రాష్ట్రంలో మొత్తం 54.38 లక్షల ఆవాసాలు ఉండగా 53.46 లక్షల ఆవాసాలకు మిషన్ భగీరథ పథకం ద్వారా సురక్షిత తాగునీటిని అందిస్తున్నది. కేంద్రజల్‌శక్తి మంత్రిత్వశాఖకు చెందిన జైజీవన్ మిషన్ బుధవారం వెల్లడించిన గణాంకాల్లో ఈ విషయాన్ని స్పష్టంచేసింది.
దేశవ్యాప్తంగా 1,897.93 లక్షల ఆవాసాలు ఉండగా 517.97 లక్షల ఆవాసాలకు నల్లాల ద్వారా తాగునీరు అందుతున్నదని, ఇది సరాసరి 27.28 శాతం మాత్రమేనని కేంద్ర జల్‌శక్తిశాఖ వెల్లడించింది. నల్లాలతో తాగునీరందించడంలో ఇతర ఏ రాష్ట్రం కూడా తెలంగాణకు దరిదాపుల్లో లేదు. తెలంగాణ తర్వాత 89.05 శాతంతో గోవా రెండోస్థానంలో, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి 87.02తో మూడు, 79.78 తో హర్యానా నాలుగోస్థానంలో నిలిచాయి. కాగా, ప్రధాని మోదీ సొంతరాష్ట్రం గుజరాత్ 74.16? ఆవాసాలకు మాత్రమే నల్లాల ద్వారా తాగునీటిని అందిస్తూ ఐదోస్థానానికి పరిమితమయింది. 2.05 శాతంతో చివరిస్థానంలో పశ్చిమబెంగాల్ ఉన్నది.ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం సురక్షితమైన తాగునీటికి కూడా నోచుకోలేదు. నల్లగొండ ప్లోరైడ్ సమస్య అంతర్జాతీయంగా చర్చనీయాంశమైనా ఉమ్మడి పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ తాగునీటి సమస్యను మొదటి ప్రాధాన్యంగా తీసుకున్నారు.
ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ’మిషన్ భగీరథ’ పథకానికి రూపకల్పన చేశారు. దీనికోసం ప్రత్యేకంగా కార్పొరేషన్‌ను ఏర్పాటుచేశారు. 10 టీఎంసీల నదీజలాలను తాగునీటికి కేటాయించి రిజర్వాయర్ల నుంచి అన్నిగ్రామాలకు ప్రత్యేకంగా పైప్లైన్లు వేశారు. ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 54.38 ఆవాసాల్లో 53.46 లక్షల ఆవాసాలకు స్వచ్ఛమైన తాగునీరు అందుతున్నది. ప్రధాని మోదీ చేతులదుగా ప్రారంభమైన ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. పలు రాష్ట్రాల అధికారులు తెలంగాణకు వచ్చి మిషన్‌భగీరథ పథకాన్ని అధ్యయనం చేసి వెళుతున్నారు.