Take a fresh look at your lifestyle.

బిజెపి వ్యూహాత్మక అడుగులు

అభ్యర్థుల ఎంపిక విషయంలో భారతీయ  జనతాపార్టీ వ్వూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా దేశంలోని అత్యున్నత రాజకీయ పదవుల విషయంలో చాలా కసరత్తు చేస్తున్నట్లే కనిపిస్తున్నది. దేశంలో అత్యధికంగా జనభా కలిగిన బిసిలు, ఆ తర్వాత అణగారిన వర్గాలుగా పేర్కొనబడుతున్న ఎస్సీ, ఎస్టీలను ఆకట్టుకునే విషయంలో ఆచీతూచి ఆ పార్టీ అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతున్నది. వెనుకబడిన వర్గాలకు చెందిన వాడిగా ప్రధాని మోదీని ఎంపిక చేయడంలోనైతేనేమీ, ఆ తర్వాత భారత రాష్ట్రపతి పదవికి రాంనాథ్‌ ‌కోవిద్‌ను నిబెట్టి గెలిపించుకున్న తీరు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నది. ఇప్పుడు తాజాగా మళ్ళీ రాష్ట్రపతి ఎన్నికలు రావడంతో ఎవరూ ఊహించని విధంగా ద్రౌపది ముర్మును తెరపైకి తీసుకురావడమన్నది ఆ పార్టీ వ్యూవహాత్మక ఎత్తుగడగానే కనిపిస్తున్నది. ప్రధానంగా ఆదివాసీ గిరిజనులకు తమ పార్టీ అత్యంత ప్రాధాన్యతనిస్తుందని చెప్పడం ఒకటికాక, అత్యున్నత స్థానంలో ఒక మహిళను  కూర్చోబెడుతున్నామన్నది దేశ ప్రజలకు అర్థమయ్యే విధంగా ఎంపిక ప్రక్రియను కొనసాగించినట్లు స్పష్టమవుతున్నది. వాస్తవంగా గత రాష్ట్రపతి ఎన్నికలప్పుడే ఆమె పేరు ప్రస్తావనకు వొచ్చినప్పటికీ  ఆనాటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రామ్‌నాథ్‌కోవిద్‌కు అవకాశం లభించింది. కాగా ఈసారికూడా ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడికే తప్పకుండా అవకాశం వొస్తుందని దాదాపు అందరూ ఊహించారు.

ఎందుకంటే చాలాకాలంగా బిజెపి దక్షిణాదిలో విస్తరించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. వెంకయ్యనాయుడు దక్షిణాదిలో ఆ పార్టీకి బలమైన నాయకుడు కూడా. అంతేకాకుండా వివిధ పార్టీల నాయకులతో ఆయన సత్‌సంబంధాలు కలిగిన వ్యక్తి. రాజకీయాల్లో చురుకైన వ్యక్తికూడా. మంచి వక్త. ఇన్ని లక్షణాలున్న వ్యక్తికి తప్పకుండా ప్రాధాన్యం లభిస్తుందనుకున్నారు. కాని, అనూహ్యంగా బిజెపి ద్రౌపది ముర్మును ఎంపిక చేసింది. వాస్తవంగా ద్రౌపది ముర్ముకుకూడా వివాదరహితురాలిగా మంచిపేరుంది. ఒడిశాలోని మయూర్‌భంజ్‌ ‌జిల్లాలో జన్మించిన ద్రౌపది ముర్ము గ్రామ సర్పంచ్‌నుండి ఎదిగిన వ్యక్తి. ఎంఎల్‌ఏగా, మంత్రిగా, గవర్నర్‌గా ఎంతో చక్కగా తన బాధ్యతలను నిర్వహించారామె. ఈమెను రాష్ట్రపతి అభ్యర్థినిగా ఎంపిక చేసే విషయంలో ఒక విధంగా బిజెపి బాగానే కసరత్తు చేసినట్లు కనిపిస్తున్నది. ఎందుకంటే ఎవరు అవునన్నా, కాదన్నా దేశంలో ఇప్పటివరకు జరుగుతూ వొస్తున్న ఎన్నికల వోటింగ్‌ ‌సరళిని పరిశీలించినప్పుడు గిరిజన ఆదివాసీల వోట్లు అధికంగా బిజెపికే పడుతున్నట్లు కొన్ని సర్వేలద్వారా తెలుస్తున్న విషయాన్ని ఇటీవల కాలంలో రాజకీయ విశ్లేషకులు విషదీకరిస్తున్న నేపథ్యంలో ఆ సామాజిక వర్గ వోట్లను ఆ••ట్టుకునేందుకు బిజెపి ద్రౌపది ముర్మును ఎంచుకున్నట్లు తెలుస్తున్నది.

దేశంలో జార్ఖండ్‌, ‌రాజస్తాన్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌ఛత్తీస్‌ఘడ్‌లలో అదివాసీ గిరిజనుల జనభా ఎక్కువగా ఉంటుంది. అందులో జార్ఖండ్‌ ‌రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పటినుండి పూర్తిగా అయిదేళ్ళపాటు ఆ రాష్ట్ర గవర్నర్‌గా ద్రౌపది ముర్ము పనిచేసింది. గవర్నర్‌గా ఉన్నకాలంలో ఆ రాష్ట్ర ప్రజలతో ఆమెకు మంచి అనుబంధమేర్పడిందికూడా. అంతేకాకుండా మరో రెండేళ్ళలో గుజరాత్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌ఛత్తీస్‌ఘడ్‌లలో ఎన్నికలు రాబోతున్నాయి. ఇక్కడ ఉన్న ఆదివాసీ, గిరిజన వోటర్లను ఆకట్టుకునే విషయంలోకూడా ద్రౌపది ముర్ము ఎంపిక దోహదపడుతుందన్న వ్యూహంకూడా బిజెపికి లేకపోలేదు.

రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి బలం 48 వోట్ల శాతం ఉన్నట్లుగా తెలుస్తున్నది. ఇతర ప్రాంతీయ పార్టీలు కలిసి ప్రతిపక్ష పార్టీల బలం 51 ఓటింగ్‌ ‌శాతంగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. దానివల్ల ఎన్డీయే నేరుగా తమ అభ్యర్థిని ఎన్నిక చేయించుకోవడం సాధ్యంకాదు. అందుకు ప్రాంతీయ పార్టీల మద్దతు తీసుకోవడం అనివార్యం. ఏపికి చెందిన వైఎస్‌ఆర్‌ ‌పార్టీ, ఒడిస్సాలోని బిజెడి పార్టీలు ఇప్పటివరకు కేంద్రానికి అంశాలవారిగా మద్దతునిస్తున్నాయి. ముఖ్యంగా వైఎస్‌ఆర్‌ ‌దాదాపు కేంద్రంకు అనుకూలంగానే వ్యవహరిస్తున్నది. ఒడిసా విషయానికొస్తే రాష్ట్రపతి అభ్యర్థిని ఆ రాష్ట్రానికి చెందినదే కావడంతో విధిలేని పరిస్తితి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడుతుందన్నది బిజెపి వ్యూహంగా కనిపిస్తున్నది. జార్ఖండ్‌ ‌గవర్నర్‌గా చేసిన అనుబంధంతో ఆ రాష్ట్ర మద్దతుకూడా లభించే అవకాశాలుంటాయన్నది బిజెపి వ్యూహం. ఆ విధంగా తమ అభ్యర్థి గెలుపు సులభమవుతుందన్నది బిజెపి ఆలోచనగా కనిపిస్తున్నది. జూలై పద్దెనిమిదిన జరిగే ఎన్నికల్లో బిజెపి వ్యూహం ఫలిస్తే ద్రౌపది ముర్ము పదహారవ రాష్ట్రపతిగానే కాకుండా, రెండవ మహిళా రాష్ట్రపతిగా గుర్తింపును తెచ్చుకుంటుంది. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంలో 2007 నుండి 2012 వరకు ప్రతిభ పాటిల్‌ ‌రాష్ట్రపతి పదవిలో కొనసాగిన విషయం తెలిసిందే. అంతకు ముందుకూడా ఈ పదవికోసం మనోహర్‌ ‌హోల్కర్‌ (1967), ‌మహారాణి గురుచరణ్‌ ‌కౌర్‌(1969), ‌లక్ష్మీ సెహగల్‌(2002),  ‌మీరాకుమారి(2017)లు పోటీ పడిన విషయం తెలియంది కాదు. కాంగ్రెస్‌తో సహా టిఆర్‌ఎస్‌, ‌సిపిఐ, సిపిఎం, ఎన్సీపి, ఎస్‌పి, డిఎంకె, ఆర్‌జెడి, ఆర్‌ఎల్డీ, టిఎంసీ తదితర  పార్టీలన్నీ కలిసి  మాజీ కేంద్ర మంత్రి యస్వంత్‌ ‌సిన్హాను ద్రౌపది ముర్ముకు ప్రత్యర్థిగా నిలబెట్టాయి. విజయం ఎవరిని వరిస్తుందో జూలై 21నగాని తేలనుంది.

Leave a Reply