Take a fresh look at your lifestyle.

‌ప్రపంచంలో..‘డ్రాగన్‌’ ఆధిపత్యం..!

Dragon's dominance in the world

“ఆసియాలో చైనా ఇలా ఆధిపత్యాన్ని సాధించడానికి ప్రధాన కారణం చైనా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రజల మద్దతు చైనాకు ఉంది. తన సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న చైనా ప్రజల మద్దతు కూడగట్టుకోవడానికి చైనా సరిహద్దుల్లో ఐడెంటిటీ పాలిటిక్స్ ‌చేయలేదు. తమ దేశాన్ని ఒక ప్రొడక్షన్‌ ‌హబ్‌ ‌గా మలచి, తమ దేశంలో ఉన్న ప్రజలకు చేతినిండా పని ఇచ్చి ఆదాయాన్ని సమకూర్చింది. ఇలా చేయటం ద్వారా ముందుగా తమ దేశాలలో ఉన్న సరిహద్దు ప్రజలను తనవైపు చైనా తిప్పుకుంది. అంతేకాకుండా పొరుగు దేశాల సరిహద్దు ప్రాంత ప్రజలకు తమ అభివృద్ధి కనిపించేలాగ చేస్తున్నది. మన దేశ ప్రభుత్వాలు సరిహద్దు ప్రాంతాలలో ఐడెంటిటీ పాలిటిక్స్ ‌చేసి, తద్వారా ఎన్నికలలో లాభం పొందడానికి ప్రయత్నించి సొంత సరిహద్దు ప్రాంతాలలో ఉండే ప్రజల ఆగ్రహాన్ని మూటగట్టుకుంటున్నయి. చైనా చూపిస్తున్న దూర దృష్టి వలన ఆసియాలో బలమైన దేశంగా చైనా ఎదగడానికి మార్గం సుగమం అయ్యింది. సహజ వనరులు, జన సంపద, భూభాగం అధికంగా ఉండి.. హిందూ ముస్లిం రాజకీయాల వలన ఆసియాలో బలమైన దేశంగా ఎదిగే అవకాశం భారతదేశం రోజురోజుకు పోగొట్టుకుంటున్నది.”

భావోద్వేగాలతో సరిహద్దుల వార్తలు ఎప్పుడూ చదవకూడదు. ఇంగ్లీష్‌లో ఒక సామెత ఉంది. ‘‘ Put oneself in another persons shoes’’ ఎదుటి వ్యక్తి స్థానంలో ఉండి ఆలోచించు. ఈ సామెత సరిహద్దు వార్తలు రాసే వారు, చదివే వారు గుర్తు పెట్టుకోవాలి. అలా కాకుండా సరిహద్దు వార్తలు రాసినా, చదివినా.. భారతీయులమైతే భారతదేశ వాదన, భూటాన్‌ ‌వాసులమైతే భూటాన్‌ ‌వాదన, చైనీయులం అయితే చైనా వాదన కరెక్ట్ అనిపిస్తుంది. అంచేత సరిహద్దు వార్తలను రాసేటప్పుడు.. చదివేటప్పుడు సరిహద్దుల్లో నివసించే ప్రజలు ఎంత వేదన పడుతున్నారో అన్న ఆలోచనతో సరిహద్దులకు సంబంధించిన వార్తలను రాయాలి..అలాగే చదవాలి. అప్పుడే మనకు కాశ్మీర్‌ ‌సమస్య సరిగ్గా అర్థం అవుతుంది. నార్త్ ఈస్ట్ ‌సమస్య సరిగ్గా అర్థం అవుతుంది. నా ఈ ముందుమాట మీ ముందు ఉంచి..భారత్‌, ‌చైనా, భూటాన్‌ ‌కి సంబంధం ఉన్న సరిహద్దు సమస్య గురించి కొన్ని అంశాలు మీ ముందు ఉంచుతాను భారతదేశానికి చైనాకి మధ్య మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల పొడవు సరిహద్దు రేఖ ఉంది. అంచేత భారతదేశం చైనా మధ్య చాలా సరిహద్దు వివాదాలు ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన వివాదాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

  1. అక్సాయ్‌ ‌చిన్‌ ‌వివాదం. ఇది భారత భూభాగం అని భారత్‌ అం‌టున్నది. లడఖ్‌ ‌భూభాగంగా దీన్ని భారతదేశం చెబుతున్నది. ఈ వివాదం 1962లో భారత, చైనా యుద్ధానికి కూడా దారితీసింది. చైనా ఈ ప్రాంతాన్ని జిన్జియాంగ్‌, ‌టిబెట్‌ ‌ప్రాంతాల భూభాగంగా పరిగణిస్తున్నది. ప్రస్తుతం ఈ ప్రాంతం చైనా అధీనంలో ఉంది.
  2. మొత్తం అరుణాచల్‌ ‌ప్రదేశ్‌ ‌తమది అని చైనా భావిస్తున్నది. అరుణాచల్‌ ‌ప్రదేశ్‌ ‌ని చైనా సౌత్‌ ‌టిబెట్‌ ‌గా పిలుస్తుంది. ఈ వాదనను చైనా తన పురాతన మ్యాప్‌ ‌ల ఆధారంగా వినిపిస్తున్నది. (ఎలా అయితే ఆర్‌ఎస్‌ఎస్‌ అఖండ భారత్‌ ‌వాదన పురాతన మ్యాప్‌ ‌ల ఆధారంగా వినిపిస్తోందో అలానే చైనా ఈ వాదన వినిపిస్తున్నది). అయితే ఈ వివాదాన్ని కేవలం మ్యాప్‌ల వలన వచ్చిన వివాదం గానే చూడటం కరెక్ట్ ‌కాదు. ఈ వివాదాన్ని పెంచి పోషించటంలో బ్రిటిష్‌ ‌వారి పాత్ర కూడా ఉంది. అక్సాయ్‌ ‌చిన్‌ ‌వివాదాస్పద ప్రాంతంపై 1899లో భారత దేశాన్ని పరిపాలిస్తున్న అప్పటి బ్రిటిష్‌ ‌ప్రభుత్వం తమ ప్రతిపాదిత సరిహద్దుగా మాకార్ట్నీ-మెక్‌డొనాల్డ్ ‌లైన్‌ అనే సరిహద్దు రేఖను భారత్‌, ‌చైనాల మధ్య ప్రతిపాదించింది. ఇందు కోసం గానూ భారత్‌ ‌ను పరిపాలిస్తున్న బ్రిటిష్‌ ‌ప్రభుత్వం 1899లో చైనాకు తన ప్రతినిధి సర్‌ ‌క్లాడ్‌ ‌మెక్‌డొనాల్డ్ ‌కు చైనాకు పంపి సంప్రదింపులు జరపమని చెప్పింది. అయితే ఈ ప్రతిపాదనపై చైనా ప్రభుత్వం ఎప్పుడూ స్పందించలేదు. అప్పటి నుండి ఈ వివాదం అలాగే కొనసాగుతున్నది. సాంప్రదాయ సరిహద్దు అయిన జాన్సన్‌-అర్డాగ్‌ ‌సరిహద్దే.. సరిహద్దు అన్నట్లు చలామణి అవుతున్నా భారత్‌ ‌ను పరిపాలిస్తున్న అప్పటి బ్రిటిష్‌ ‌ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. ఫలితంగా ఈ వివాదం అలా కొనసాగుతూనే ఉంది. ఈ వివాదంపైన పలు సంప్రదింపులు జరిగాయి. ఇలా జరుగుతున్న సంప్రదింపుల్లో కీలక ఘట్టంగా 1913-14లో భారత్‌, ‌చైనా, టిబెట్‌ ‌సిమ్లా సమావేశం అని చెబుతారు. సిమ్లాలో సమావేశమై ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి భారత్‌, ‌చైనా, టిబెట్‌ ‌ప్రయత్నం చేశాయి.
  3. డోక్లాం వివాదం.. డోక్లాం పీఠభూమి లోయతో కూడిన ప్రాంతం,దీనికి ఉత్తరాన చైనా చుంబి లోయ, తూర్పున భూటాన్‌ ‌హా లోయ, పశ్చిమాన భారతదేశ సిక్కిం రాష్ట్రం ఉంది. ఇది 1961 నుండి భూటాన్‌ ‌మ్యాప్‌ ‌లో భూటాన్‌లో భాగంగా చిత్రీకరించి ఉందని భూటాన్‌ ‌వాదన. అయితే డోక్లాం మా భూభాగం అని చైనా అంటున్నది. ఈ రోజు వరకు, భూటాన్‌, ‌చైనా మధ్య అనేక రౌండ్ల సరిహద్దు చర్చలు జరిగినప్పటికీ ఈ వివాదానికి పరిష్కారం దొరకలేదు. ఈ వివాదంలో భూటాన్‌ ‌కి అండగా భారతదేశం నిలుస్తూ, డోక్లాం భూటాన్‌ ‌లోని భూభాగమని భారతదేశం చెబుతున్నది. డోక్లాం ప్రాంతం వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగి ఉంది. అంచేత మూడు దేశాలకు ఈ ప్రాంతంపైన గురి ఉంది. భారత్‌ ‌భూటాన్‌ ‌కి మద్దతు ఇవ్వడానికి కారణం డోక్లాం పీఠభూమి మీదుగా చైనా ఒక రోడ్డు వేయడానికి ప్రయత్నం చేస్తున్నది. చైనా ఈ రోడ్డు గనుక వేసినట్లయితే, భారత భూభాగంలో ఉన్న నార్త్ ఈస్ట్ ‌రాష్ట్రాలకి చైనాకి కనెక్టివిటీ పెరుగుతుంది. దీనివలన నార్త్ ఈస్ట్ ‌రాష్ట్రాలలో చైనాకు ప్రాబల్యం పెరిగే అవకాశం ఉంది. ఇది కాకుండా పాక్‌ ఆ‌క్రమిత కాశ్మీర్లో.. ‘వన్‌ ‌బెల్ట్ ‌వన్‌ ‌రోడ్డు అన్న నినాదంతో చైనా ఒక రోడ్డు నిర్మాణం చేస్తున్నది. దీనివలన చైనా పాకిస్థాన్ల మధ్య స్నేహ బంధం మరింత పెరిగే అవకాశం ఉన్నది. దీని వలన రానున్న కాలంలో భారతదేశానికి ఇబ్బందులు వస్తాయి అని భారత్‌ ‌భావిస్తున్నది.

ఇది కాకుండా చైనా తన పొరుగున ఉన్న చిన్నాచితకా దేశాలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ‌కు సంబంధించిన ప్రాజెక్టులకు అప్పులు ఇస్తూ.. ఆయా దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నది. ఇలా చేయటం ద్వారా ఆయా దేశాల మార్కెట్లలో చైనా దేశంలో తయారు అయిన వస్తువులను అమ్ముకోవటానికి అవకాశాన్ని కల్పించుకుంటున్నది. ప్రపంచానికే ప్రొడక్షన్‌ ‌హబ్‌ అయినా చైనా ఆసియాలో అతిపెద్ద దేశంగా ఎదగడానికి చేస్తున్న ప్రయత్నమిది. వనరుల పరంగా, భూభాగ పరంగా, చైనా కన్నా పెద్ద దేశమైన భారతదేశం తన ఆర్థిక వ్యవస్థను ప్రొడక్షన్‌ ‌చుట్టూ మలచుకోకుండా.. సర్వీస్‌ ఎకానమీ ఆధారంగా తన దేశ ఆర్థిక వ్యవస్థను నడుపుతున్నది. దీని కారణంగా ఆసియాలో కీలకమైన దేశంగా ఎదిగే అవకాశాన్ని భారత్‌ ‌సరిగా ఉపయోగించుకోలేక పోతున్నది.ఇటువంటి అననుకూల పరిస్థితుల్లో ఉన్న భారతదేశం తన ఆధిపత్యాన్ని కాపాడుకోవటానికి చేస్తున్న ప్రయత్నాలు ఏ విధంగా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం..చైనా భూటాన్ల మధ్య వివాదాస్పద ప్రాంతం డోక్లాం. భూటాన్‌ ‌చైనా రెండు దేశాలు డోక్లాం భూభాగం గురించి గొడవ పడుతున్నాయి. ఈ డోక్లాంకి ఒక వైపు సరిహద్దుగా భారతదేశం భూభాగం అయిన సిక్కిం ఉంది. అంచేత డోక్లాం ప్రాంతాన్ని త్రి-జంక్షన్‌ అని అంటారు. చైనా మాదిరిగా భారతదేశం డోక్లాంను మా భూభాగం అనడం లేదు. అయితే డోక్లాం భూభాగం మాది అని అంటున్న, భూటాన్‌ ‌వాదనకు భారత్‌ ‌మద్దతు ఇస్తుంది.

భారత్‌ ‌భూటాన్‌ ‌కు ఇస్తున్న ఈ మద్దతుపై చైనా వాదన ఏమిటంటే.. 1890లో చైనాకి భారతదేశాన్ని పాలిస్తున్న అప్పటి బ్రిటన్‌ ‌ప్రభుత్వానికి మధ్య కలకత్తా సమావేశంలో ఓ అవగాహన కుదిరింది. ఆ అవగాహన మేరకు భారత్‌ ‌నడుచుకోవాలి. కలకత్తా సమావేశం అవగాహన ఏమంటే, సిక్కిం-టిబెట్‌ ‌సరిహద్దు ప్రారంభ స్థానం భూటాన్‌ ‌సరిహద్దులో ఉన్న గిప్మోచి పర్వతం.దీన్నే త్రి-జంక్షన్‌ ‌పాయింట్‌గా చెబుతూ కలకత్తా సమావేశంలో అవగాహన కుదిరింది. కలకత్తా సమావేశం లోని ఈ అవగాహన ప్రకారం చైనీయుల వాదన డోక్లాం టిక్కెట్‌లోని జిగేజ్‌ ‌ప్రాంతంలో ఉంది. భారత్‌ ‌సిక్కిం రాష్ట్రానికి సరిహద్దులో డోక్లాం ఉంది. అయితే భూటాన్‌ 1890‌లో జరిగిన కలకత్తా కన్వెన్షన్‌లో పార్టీ కాదు. అంచేత భూటాన్‌ ‌చైనా చేస్తున్న వాదనను ఒప్పుకోవడం లేదు. అంతే కాకుండా 1949లో భూటాన్‌ ‌తన దౌత్య రక్షణ వ్యవహారాలకు మార్గనిర్దేశం చేసేలాగా భారతదేశంతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. 2007లో ఈ ఒప్పందాన్ని కొత్త స్నేహ ఒప్పందంతో మరింత పటిష్టం చేసుకుని కొత్త ఒప్పందాన్ని అమలులోకి తెచ్చుకున్నాయి భారత్‌, ‌భూటాన్‌ ‌లు. కొత్త ఒప్పందం ప్రకారం భూటాన్‌ ‌విదేశాంగ విధానంపై భారతదేశం మార్గదర్శకత్వం తీసుకోవడం తప్పనిసరి అనే క్లాజ్‌ ఉం‌ది.భూటాన్‌ ‌తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి భారత్‌ ‌తో ఇలా ఒప్పందం చేసుకుంది. చైనా నుంచి తమకు ప్రమాదం ఉంది అని భూటాన్‌ ‌భావించి, తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవటానికి భారత్‌ ‌తో భూటాన్‌ ఇలా ఒప్పందం చేసుకుంది. భూటాన్‌ ఇలా భయపడటానికి కారణం 1958 నుండి, చైనీస్‌ ‌మ్యాప్‌ ‌లలో భూటాన్‌ ‌భూభాగాన్ని చైనాలో భూభాగంగా చైనా చూపించడం ప్రారంభించిది. చైనా ఇలా చేయటం వలన 1960 లలో భూటాన్‌ ‌చైనా సరిహద్దుల్లో స్థానికీకరణ ఉద్రిక్తతలు తలెత్తాయి, అయితే 1970లలో చైనా, భూటాన్ల మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చలలో భారతదేశం కొన్నిసార్లు సహాయక పాత్ర పోషిస్తూ వచ్చింది.అయితే డోక్లామ్‌ ‌పీఠభూమి స్థితిపై ఏకాభిప్రాయాన్ని సృష్టించడంలో మూడు దేశాలు( భారత్‌, ‌చైనా, భూటాన్‌) ‌విఫలమయ్యాయి. భూటాన్‌, ‌చైనా 1984లో మొదలు పెట్టి ఇప్పటి వరకు 24 రౌండ్ల సరిహద్దు చర్చలు జరిపాయి. 1988, 1998లో గుర్తించదగిన ఒప్పందాలు జరిగాయి. ఆ ఒప్పందాలలో ప్రధానంగా బలప్రయోగాన్ని నిషేధించటం, శాంతియుత మార్గాలకు కట్టుబడి ఉండటం వంటి విషయాలపై చైనా భూటాన్‌ ‌లు ఒక అవగాహనకు వచ్చాయి.

ప్రస్తుత పరిస్థితి:

చైనా ఇండియా సరిహద్దు రేఖ లేదా డోక్లాం చెక్‌ ‌పోస్ట్ ‌వద్ద జూన్‌ 16, 2017‌న చైనా దళాలు డోక్లాంలో దక్షిణాన రహదారిని విస్తరించడం ప్రారంభించాయి. చైనా చేస్తున్న ఈ ప్రయత్నాన్ని భూటాన్‌ ‌మిత్ర దేశమైన భారతదేశం ఆపరేషన్‌ ‌జునిపెర్‌ అనే పేరుతో 18 జూన్‌ 2017‌న సుమారు 270 మంది భారత సైనిక సాయుధ దళాలను సిక్కిం సరిహద్దు మీదుగా పంపి రెండు బుల్డోజర్‌లతో డోక్లాం దాటి చైనా దళాలు నిర్మించ తలపెట్టిన రహదారిని నిర్మించకుండా అడ్డుకున్నాయి. ఆగస్టు 28న, భారతదేశం, చైనా రెండూ తమ దళాలను డోక్లామ్‌లోని చెక్‌ ‌పోస్టుల నుండి ఉపసంహరించుకున్నట్లు ప్రకటించాయి. ఆగష్టు 29న, భూటాన్‌.. ‌భారత్‌, ‌చైనాల నిర్ణయాన్ని స్వాగతించింది. శాంతి శాంతిని కాపాడుకోవటానికి సరిహద్దులలో యథాతథ స్థితి అవసరమని భూటాన్‌ ‌ప్రకటించింది. సెప్టెంబర్‌ 5‌న, బ్రిక్స్ ‌సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ ‌గంటసేపు చర్చలు జరిపారు. వారు ఇరుదేశాల మెరుగైన సంబంధాలే తమ విధానానమని అంగీకరించారు. డోక్లాంలో ఉద్రిక్త పరిస్థితులు పునరావృతం కాకుండా చూసేందుకు ప్రయత్నాలు చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. సరిహద్దు ప్రాంతాలలో శాంతి ప్రశాంతతను కొనసాగించడం ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు అవసరమని వారు పునరుద్ఘాటించారు. సెప్టెంబర్‌ 7‌న, కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు రెండు దేశాల దళాలు ఇరు దేశాల సరిహద్దుల వద్ద పెట్రోలింగ్‌ ‌చేస్తున్నాయని రిపోర్ట్ ‌చేశాయి. అంటే అంతర్జాతీయంగా కూడా డోక్లాంలో ప్రశాంత వాతావరణం ఉంది అని ఎస్టాబ్లిష్‌ అయ్యింది.

ఈ మొత్తం ప్రాసెస్‌ ‌గమనించినప్పుడు మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఆసియాలో చైనా ఆధిపత్యం.. ఆసియాలో చైనా ఇలా ఆధిపత్యాన్ని సాధించడానికి ప్రధాన కారణం చైనా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రజల మద్దతు చైనాకు ఉంది. తన సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న చైనా ప్రజల మద్దతు కూడగట్టుకోవడానికి చైనా సరిహద్దుల్లో ఐడెంటిటీ పాలిటిక్స్ ‌చేయలేదు. తమ దేశాన్ని ఒక ప్రొడక్షన్‌ ‌హబ్‌ ‌గా మలచి, తమ దేశంలో ఉన్న ప్రజలకు చేతినిండా పని ఇచ్చి ఆదాయాన్ని సమకూర్చింది. ఇలా చేయటం ద్వారా ముందుగా తమ దేశాలలో ఉన్న సరిహద్దు ప్రజలను తనవైపు చైనా తిప్పుకుంది. అంతేకాకుండా పొరుగు దేశాల సరిహద్దు ప్రాంత ప్రజలకు తమ అభివృద్ధి కనిపించేలాగ చేస్తున్నది. మన దేశ ప్రభుత్వాలు సరిహద్దు ప్రాంతాలలో ఐడెంటిటీ పాలిటిక్స్ ‌చేసి, తద్వారా ఎన్నికలలో లాభం పొందడానికి ప్రయత్నించి సొంత సరిహద్దు ప్రాంతాలలో ఉండే ప్రజల ఆగ్రహాన్ని మూటగట్టుకుంటున్నయి. చైనా చూపిస్తున్న దూర దృష్టి వలన ఆసియాలో బలమైన దేశంగా చైనా ఎదగడానికి మార్గం సుగమం అయ్యింది. సహజ వనరులు, జన సంపద, భూభాగం అధికంగా ఉండి.. హిందూ ముస్లిం రాజకీయాల వలన ఆసియాలో బలమైన దేశంగా ఎదిగే అవకాశం భారతదేశం రోజురోజుకు పోగొట్టుకుంటున్నది.

Aruna New Delhi
అరుణ, న్యూఢిల్లీ

Leave a Reply