“తటస్థంగా ఉండే నీళ్లల్లో ఓ రాయి వేస్తే దాని తరంగాలు ఒడ్డు వరకు తాకుతుంటాయి. అలానే ఈ రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పంద ప్రభావం మన దేశానికీ తాకుతుందన్నదే అసలు అంశం. ఒకటి, పాకిస్తాన్‌లో చైనా నిర్మిస్తున్న గ్వాదర్ పోర్టుకు పోటీగా మన దేశం ఇరాన్‌లో చాబహార్ పోర్టును నిర్మిస్తోంది. ఈ పోర్టు భారత్‌కు వ్యూహాత్మకంగా, వాణిజ్యపరంగా చాలా ముఖ్యమైంది. చైనా పెట్టుబడులు పెరిగితే ఇరాన్ మనల్ని ఖాతరు చేయకపోవచ్చు. దీనికీ ఒక కారణం ఉంది. అమెరికా ఆంక్షలకు భయపడి మన దేశం ఇరాన్ నుంచి చమురు దిగుమతులు ఆపేశాం. వాస్తవంగా మన దేశానికి ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతిదారు. అంటే ఆ మేరకు ఇరాన్ చమురు వ్యాపారాన్ని మనం దెబ్బతీసినట్లే.”
కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయి అంటే…ఓ రెండు దేశాలు కలిసి ఒప్పందం చేసుకుంటే దాని ప్రభావం మిగిలిన ప్రపంచం మీద ముఖ్యంగా వాటితో సంబంధాలున్న ఇతర దేశాల మీద కూడా పడుతుంది. భౌగోళిక రాజకీయాల్లో మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ‘ప్రపంచీకరణ’ సూత్రం మీద ప్రపంచం నడుస్తోంది కనుక. ఈ మధ్య కాలంలో అలా ప్రపంచ దేశాల్లో ఆసక్తిని రేకిస్తున్న ఒప్పందం చైనా, ఇరాన్ దేశాల మధ్య కుదిరింది. ఓ వైపు కరోనా గుప్పిట్లో ప్రపంచం విలవిల్లాడుతున్న సందర్భంలోనే ఈ రహస్య ఒప్పందం జరగటంతో చర్చ మరింత వాడిగా వేడిగా సాగుతోంది.
ఏమిటా ఒప్పందం?
కొరోనా వైరస్ పుట్టుక, విజృంభణ విషయంలో చైనా చర్చనీయాంశంగా ఉండటమే కాకుండా ప్రపంచ దేశాల ముందు దోషిగా కూడా పరిగణించబడుతోంది. ఆ దేశ ఇమేజ్ గ్రాఫ్, విశ్వసనీయతా ఒక్కసారిగా పడిపోయాయి. దీని నుంచి బయటపడే మార్గం, ఆర్ధికంగా మరింత ఎదిగే ప్రయత్నం చైనాది. కొరోనా దెబ్బకు ఆర్ధిక వ్యవస్థ దెబ్బతినటం, అమెరికా కఠిన ఆంక్షల ఇబ్బందులు ఇరాన్ దేశానివి. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు వ్యూహాత్మక, వాణిజ్య ఒప్పందాన్ని చేసుకున్నాయి. ఈ ఒప్పందం విలువ 400 బిలియన్ డాలర్లు. ఈ ఓప్పందంలో భాగంగా వచ్చే 25ఏళ్ల పాటు ఇరాన్ చమురును చైనాకు చవగ్గా సరఫరా చేస్తుంది. చైనా ఏమో ఇరాన్‌లో నాలుగు వేల బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఇంధన, సాంకేతిక, మౌలిక సౌకర్యాలు వంటి రంగాల్లో పెడుతుంది. ఫలితంగా ఆ దేశ ఆర్ధిక వ్యవస్థ ఇంజన్ నడవటానికి ఊతమిస్తుంది. ఇది ఇక్కడితే ఆగదు. అమెరికా అధికారులు చెబుతున్న దాని ప్రకారం ఈ ఒప్పందం లోతు ఎక్కువగానే ఉంది. ఇరాన్- చైనా దేశాల మధ్య ఉమ్మడి సైనిక శిక్షణ, ఆయుధాల తయారీ, పరిశోధన, నిఘా వంటివి చోటు చేసుకోనున్నాయి. రెండు దేశాలు సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తాయి. కలిసి ఆయుధాలను తయారుచేస్తాయి. నిఘా సమాచారాన్నీ పంచుకుంటాయి. అయితే ఈ ఒప్పందం రాత్రికి రాత్రికి జరిగింది కాదు. నాలుగేళ్ళ క్రితం అంటే 2016లో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఇరాన్ దేశానికి వెళ్లిన సందర్భంలోనే ఈ ప్రతిపాదన ఇరాన్ ముందు పెట్టారట. పలు దఫాల చర్చల తర్వాత ఇప్పుడు ఒప్పందం కార్యరూపంలోకి వస్తోందన్నమాట. దీని వల్ల అమెరికా, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా లాంటి శక్తిమంతమైన దేశాలతో విభేదిస్తున్న ఇరాన్‌కు ప్రపంచంలోనే రెండో బలమైన ఆర్ధిక శక్తి అయిన చైనా స్నేహం దొరికినట్లు అవుతుంది. ఇరాన్‌తో ఒప్పందాలు చేసుకుంటే కళ్ళెర్ర చేస్తున్న ట్రంప్‌కు సవాలు విసిరినట్లు అవుతుంది చైనాకు. దీని కంటే ముఖ్యమైంది… చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్టుకు ఇరాన్ సహకారం చాలా కీలకం.
మనకేమిటి ఇబ్బంది?
తటస్థంగా ఉండే నీళ్లల్లో ఓ రాయి వేస్తే దాని తరంగాలు ఒడ్డు వరకు తాకుతుంటాయి. అలానే ఈ రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పంద ప్రభావం మన దేశానికీ తాకుతుందన్నదే అసలు అంశం. ఒకటి, పాకిస్తాన్‌లో చైనా నిర్మిస్తున్న గ్వాదర్ పోర్టుకు పోటీగా మన దేశం ఇరాన్‌లో చాబహార్ పోర్టును నిర్మిస్తోంది. ఈ పోర్టు భారత్‌కు వ్యూహాత్మకంగా, వాణిజ్యపరంగా చాలా ముఖ్యమైంది. చైనా పెట్టుబడులు పెరిగితే ఇరాన్ మనల్ని ఖాతరు చేయకపోవచ్చు. దీనికీ ఒక కారణం ఉంది. అమెరికా ఆంక్షలకు భయపడి మన దేశం ఇరాన్ నుంచి చమురు దిగుమతులు ఆపేశాం. వాస్తవంగా మన దేశానికి ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతిదారు. అంటే ఆ మేరకు ఇరాన్ చమురు వ్యాపారాన్ని మనం దెబ్బతీసినట్లే.
రెండు, అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లోని జాహెదాన్ నుంచి చాబహార్ వరకు రైలు మార్గం నిర్మాణం పై నాలుగేళ్ళ కిందటే భారత్, ఇరాన్‌లు ఒప్పందం చేసుకున్నాయి. తాజాగా ఇరాన్ ఈ ప్రాజెక్టు నుంచి భారత దేశాన్ని పక్కకు తప్పించిందని మీడియా కథనాలు వస్తున్నాయి. మన దేశ మీడియానే కాదు యురేషియా టైమ్స్ వంటి పత్రికలు కూడా ఇదే అంశాన్ని ప్రముఖంగా పేర్కోన్నాయి. అయితే ఇరాన్ అసలు మేము భారతదేశంతో రైలు మార్గం కోసం ఎటువంటి ఒప్పందమే చేసుకోలేదని చెప్పింది. అసలు విషయాన్ని మన విదేశాంగ శాఖ ప్రకటిస్తే కాని వాస్తవం ఏమిటనేది బయటికి రాదు. పశ్చిమాసియా ప్రాంతంలో కీలకమైన ఇరాన్‌తో చైనా చేతులు కలపటం వల్ల ఈ ప్రాంతంలో అమెరికా ప్రాబల్యం తగ్గే అవకాశం ఉంది. ఇరాన్ దగ్గర చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయి కనుక గల్ఫ్ ప్రాంతంలో చైనా ఒక కోత్త శక్తిగా అవతరించేందుకు మార్గం ఏర్పడినట్లు అవుతుంది. అదే జరిగితే భారత్ వ్యూహాత్మక, వాణిజ్య, సైనిక కోణంలో మరింత మెలుకువతో ఉండాల్సి వస్తుంది. అయితే ఇరాన్ పార్లమెంట్ ఈ బిల్లును ఇంకా ఆమోదించాల్సి ఉంది. డ్రాగన్ దేశం కూడా ఒప్పంద వివరాలను ఇప్పటి వరకు బహిర్గతం చేయకుండా గుంభనంగా ఉంటోంది. చివరగా … చైనా అంత నమ్మదగ్గ భాగస్వామి కాదు అన్న అభిప్రాయం చాలా దేశాల్లో ఉంది. ఈ కోణంలో చూస్తే ఇరాన్‌కు ఏ మేరకు ప్రయోజనం కలుగుతుందో వేచి చూడాల్సిందే.