Take a fresh look at your lifestyle.

స్వాతంత్ర్య పోరాట స్పూర్తే ఆధునిక భారతానికి పునాది

  • 2020లో కోవిడ్‌తో కఠినమైన పాఠాలను నేర్చుకున్నాం
  • మానవాళి విభేదాలను విడనాడి సామరస్యంగా మెలగాలి
  • కోవిడ్‌ ‌యోధులకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది
  • సార్వత్రిక సంక్షేమమే ప్రపంచానికి భారత్‌ ఇచ్చే విలక్షణ బహుమతి
  • 74వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో రాష్ట్రపతి రామ్‌నాద్‌ ‌కోవింద్‌

భారత దేశాన్ని బ్రిటీష్‌ ‌పాలకుల కబంధ హస్తాల నుంచి విముక్తం చేయడానికి జరిపిన స్వాతంత్య్రపు పోరాటపు స్ఫూర్తే ఆధునిక భారతానికి పునాది అనీ, అదే స్ఫూర్తితో దేశ ప్రజలు ముందుకు సాగాలని భారత రాష్ట్రపతి రామ్‌నాద్‌ ‌కోవింద్‌ ‌పిలుపునిచ్చారు. 2020లో కొరోనా దేశ ప్రజలకు ఎన్నో కఠినమైన పాఠాలను నేర్పిందనీ, దీంతో ప్రజల జీవన స్థితిగతులే మారిపోయాయని పేర్కొన్నారు. కొరోనాపై పోరాటంలో అలుపెరుగకుండా శ్రమిస్తున్న యోధులకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందనీ, భవిష్యత్తులో ప్రజారోగ్య వ్యవస్థను మరింతగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిన విషయాన్ని ఇది గుర్తు చేసిందన్నారు. 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం రాష్ట్రపతి రామ్‌నాద్‌ ‌కోవింద్‌ ‌దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కొరోనా కష్టకాలంలో కేంద్రం అనేక పథకాల ద్వారా దేశ ప్రజలకు సాయం చేసిందన్నారు. వందేభారత్‌ ‌కార్యక్రమం ద్వారా విదేశాల్లోని దాదాపు 10 లక్షల మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారని తెలిపారు. కొరోనా వేళ ఇంటి నుంచి పని, ఈ లెర్నింగ్‌, ‌బాగా పెరిగాయనీ, ప్రతీ ఒక్కరూ ప్రకృతితో అనుసంధానమై జీవించడం నేర్చుకోవాలని సూచించారు. అయోధ్యపై సుప్రీం తీర్పును దేశ ప్రజలంతా స్వాగతించారనీ, మందిర నిర్మాణం కూడా ప్రారంభం కావడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఈ స్వాతంత్య్ర దినోత్సవాలు అనేక పరిమితుల మధ్య జరుగుతున్నాయనీ, యావత్‌ ‌ప్రపంచం అన్ని కార్యకలాపాలను స్థంభింపజేసి అనేక ప్రాణాలను బలికొన్న ప్రమాదకర వైరస్‌ను ఎదుర్కొంటున్నదనీ, అయినప్పటికీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పరిస్థితుల మేర చర్యలు తీసుకుని దీని తీవ్రతను తగ్గించడంలోనూ ప్రాణనష్టాన్ని తగ్గించడంలోనూ సఫలమయ్యామనీ, ఇది ప్రపంచానికి అనుసరణీయమని అభిప్రాయపడ్డారు.

దేశంలో ఈ సంక్షోభం కొనసాగుతుండగానే, అంఫన్‌ ‌తుఫాను పశ్చిమ బెంగాల్‌, ఒడిషాలను తాకిందనీ, విపత్తు నిర్వహణ బృందాలు, కేంద్ర, రాష్ట్ర సంస్థలు జాగ్రత్తతతో ప్రజల ప్రాణనష్టాన్ని తగ్గించగలిగామన్నారు. కొరోనా కారణంగా చిన్నాభిన్నమైన దేశంలోని నిరుపేదలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్‌ ‌కల్యాణ యోజనను ప్రవేశపెట్టి కోట్లాది మందికి జీవనోపాధి కలిగేలా చేసిందని గుర్తు చేశారు. మన కోసం మాత్రమే కాకుండా ప్రపంచ సంక్షేమం కోసం జీవించడం భారతీయుల సంస్కృతి అనీ, స్వావలంబన అంటే ఎవరినీ దూరం చేసుకోకుండా అభివృద్ది అనే విషయాన్ని మన దేశం ప్రపంచానికి చాటి చెప్పిందని పేర్కొన్నారు. కోవిడ్‌ ‌మహమ్మారిని తట్టుకునే విధంగా ప్రాంతీయ, ప్రపంచ స్థాయి వ్యూహాలను రూపొందించడంలో మనం ముందున్నామనీ, అంతర్జాతీయంగా మన పట్ల ఉన్న సోదర భావానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వం విషయంలో మనం పొందిన అద్భుత మద్దతే ఇందుకు తార్కాణమని అభిప్రాయపడ్డారు.  కొరోనాను ఎదుర్కోవడమనే మానవాళి ముందున్న అతి పెద్ద సవాలును విస్మరించి ఇరుగు పొరుగులో ఉన్న కొందరు విస్తరణ వాదంతో దుస్సాహసానికి ఒడిగట్టే ప్రయత్నం చేశారనీ, మన వీర జవాన్లు దేశ సరిహద్దులను కాపాడేందుకు ప్రాణాలను అర్పించారని పరోక్షంగా గాల్వాన్‌ ‌వద్ద చైనా దురాక్రమణను గుర్తు చేశారు. జాతి యావత్తూ గాల్వాన్‌ ‌లోయలోని అమర జవాన్లకు జోహార్లు అర్పిస్తోందనీ, వారి కుటుంబాలకు ప్రతీ భారతీయుడూ ఎల్లప్పుడూ కృతజ్ఞుడై ఉంటాడని స్పష్టం చేశారు. కోవిడ్‌ ‌మహమ్మారి కారణంగా భారత ప్రభుత్వ కార్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు తమ విధుల నిర్వహణలో వర్చువల్‌ ఇం‌టర్‌ఫేస్‌ను విస్తృతంగా వినియోగిస్తున్నాయన్నారు. న్యాయ వ్యవస్థ కూడా న్యాయం చెప్పడంలో ఆన్‌లైన్‌ ‌కోర్టు కార్యకలాపాలను నిర్వహిస్తోందనీ, రాష్ట్రపతి భవన్‌లోనూ తాము సాంకేతికతను ఉపయోగించి వర్చువల్‌ ‌సదస్సులు ఇతర కార్యక్రమాలను నిర్వహించినట్లు చెప్పారు. 74వ భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మనం ప్రపంచానికి ఇవ్వగలిగేది చాలా ఉందనీ, మేధోపరమైన, ఆధ్యాత్మికమైన సంపన్నత విషయంలో శాంతిని పెంపొందించే విషయంలో మనం ప్రపంచానికి ఇవ్వగలిగేది చాలా ఉందనీ, ఈ భావనతో అందరి సంక్షేమం కోసం ప్రార్థిస్తున్నట్లు రాష్ట్రపతి కోవింద్‌ ‌తన ప్రసంగంలో పేర్కొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!