- కరోనా కట్టడిలో జగన్ పూర్తిగా విఫలం
- మండిపడ్డ మాజీ సిఎం చంద్రబాబు నాయుడు
అమరావతి : ఎపిలో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే ప్రభుత్వం ఉందా అని అనిపిస్తోందని, కోర్టుతీర్పు ఘటనలు సిగ్గుచేటని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. కరోనా కట్టడిలో కూడా ప్రభుత్వం విఫలమయ్యిందన్నారు. ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యను వైసీపీ ప్రభుత్వం బెదిరింపులకు గురిచేసిందని ఆరోపించారు. శనివారం చంద్రబాబు డియాతో మాట్లాడుతూ.. ఆయుర్వేద మందుపై ప్రభుత్వం అధ్యయనం చేయాలని కానీ తక్షణమే ఆయుర్వేద మందును నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చిందన్నారు. వైసీపీ ఎమ్మెల్యే పిలుపుతో కృష్ణపట్నంలో ప్రజలు గుమిగూడారన్నారు. ఏపీలో కరోనా విజృంభణ ఆందోళన కలిగిస్తోందన్నారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందక ప్రజలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టించుకోవాల్సిన సీఎం జగన్ కక్షసాధింపులకే పరిమితమయ్యారని ధ్వజమెత్తారు.
కరోనాకు తోడు బ్లాక్ ఫంగస్ కేసులు కూడా ఎక్కువగా వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్‌ను వేధించి చంపేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే ఎదురు దాడులకు పాల్పడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. నిబంధనలు ఉల్లంఘించిన అన్ని అంశాలపై కోర్టుల్లో వైసీపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగిలాయని అన్నారు. కొత్త ఎస్ఈసీని తీసుకువచ్చి ఆగమేఘాల ద పోలింగ్ నిర్వహించారని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించకుండా పరిషత్ ఎన్నికలను జరిపారన్నారు.
నామినేషన్లు సరిగా ఉన్నవాళ్లవి కూడా తిరిస్కరించారని చంద్రబాబు తప్పుబట్టారు. సీఎం జగన్ అహంభావంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారన్నారు. కోర్టుల ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇష్టమొచ్చినట్లు చేసేందుకైన రాజ్యాంగం ఉన్నది అని చంద్రబాబు నిలదీశారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యంగం కాదు.. అంబేద్కర్ రాజ్యంగం అమలు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై దేశద్రోహం కేసు పెట్టారని ధ్వజమెత్తారు. గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలు దేశద్రోహం కిందకు రావా? అని ప్రశ్నించారు.