Take a fresh look at your lifestyle.

ఉగాదినాడు ‘డబుల్‌’ ‌పండుగ!: హరీష్‌రావు 

double bedrooms on ugadi festival
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీష్‌రావు
  • పట్టణాన్ని శుభ్రంగా ఉంచాలి
  • తడి, పొడి చెత్త వేరుచేయాలి
  • ఖాళీ స్థలాల్లో చెత్త వేయొద్దు
  • లేదంటే రూ. 500జరిమాన
  • ఆర్థ్ధిక మంత్రి తన్నీరు హరీష్‌రావు 

సిద్ధిపేట నర్సాపూర్‌లో దేశానికే ఆదర్శంగా నిర్మించిన గేటెడ్‌ ‌కమ్యూనిటీ డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్లను అర్హులైన పేదలకు ఉగాది పండుగ రోజున పంపిణీ చేయనున్నట్లు అర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఎవ్వరికీ లంచాలు ఇవ్వొద్దని, పైరవీలు చేయొద్దని దశల వారీగా పేదలకు డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్లు అందజేస్తామని తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా సిద్ధిపేట స్పెషల్‌ ‌గ్రేడ్‌ ‌మున్సిపాలిటీ పరిధిలో బుధవారం అడిషనల్‌ ‌కలెక్టర్‌ ‌ముజంబీల్‌ ‌ఖాన్‌, ‌మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌రాజనర్సు, ఆయా వార్డు కౌన్సిలర్లతో కలిసి 30వ, 20వ వార్డుల్లో మంత్రి పర్యటించారు. వార్డులోని పలు కాలనీ, వీధులు కలియ తిరుగుతూ వార్డు ప్రజలతో మమేకమై మాట్లాడుతూ.. ఆయా వార్డు సమస్యలపై మంత్రి ఆరా తీశారు. 30వ వార్డులో ప్రతి వీధిలో ఉన్న ఓపెన్‌ ‌ప్లాట్లలో చెత్త చెదారం వేయడంతో డంప్‌ ‌యార్డు తరహాలో తయారైందని, అడుగడుగునా చెత్త కనిపించడంతో మున్సిపల్‌ అధికారుల తీరుపై మంత్రి అగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశారు. అండర్‌ ‌గ్రౌండ్‌ ‌డ్రైనేజీ కనెక్షన్‌ ఇవ్వడం లేదని, దోమల వల్ల ఇబ్బంది పడుతున్నామని కాలనీ వాసులు మంత్రికి విన్నవించారు. ఈ మేరకు మంత్రి ప్రతి స్పందిస్తూ పది రోజుల్లో అండర్‌ ‌గ్రౌండ్‌ ‌డ్రైనేజీ కనెక్షన్లు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ..ప్రతి ఖాళీ ప్లాట్‌ ‌డంప్‌ ‌యార్డుగా మారింది.! మన ఇళ్లు శుభ్రంగా ఉంచుకున్నట్లుగానే మన గల్లీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మనిషి మారాలంటే.. భయం, భక్తి, అంకిత భావం ఉండాలి. జరిమానా వేయకపోతే భయం ఉండదన్నారు. ప్రతి ఇంటింటికీ తడి, పొడి రెండు చెత్త బుట్టలు ఇస్తున్నాం ఇంట్లోనే తడి, పొడి చెత్తను వేర్వేరు చేసి ఇవ్వకపోతే జరిమానా వేయక తప్పదని, ఖాళీ ప్లాట్‌ ‌స్థలంలో చెత్త వేస్తే రూ.500 జరిమానా విధిస్తామన్నారు. ప్రజల సహకారం లేనిదే సిద్ధిపేట పట్టణం ప్రగతి సాధించదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ ‌రావు స్పష్టం చేశారు. నిషేధిత గుట్కా ప్యాకెట్లు అమ్మడం పై మీరేం చేస్తున్నారని పోలీసు అధికారులను మంత్రి ప్రశ్నించారు. అపరిశుభ్ర వాతావరణం వల్ల మలేరియా, డెంగ్యూ వంటి రోగాలు వస్తాయని, అండర్‌ ‌గ్రౌండ్‌ ‌డ్రైనేజీ కనెక్షన్‌ ఇస్తే మోరీలు ఎండిపోయి దోమలు పుట్టవని, రానున్న పది రోజుల్లో అండర్‌ ‌గ్రౌండ్‌ ‌డ్రైనేజీ కనెక్షన్‌ ‌పూర్తి చేయిస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు. భూగర్భ మురికి కాల్వల ఇంటింటికీ కనెక్షన్లు పూర్తి చేసి రోడ్లు వేస్తే ఇక 30 ఏళ్ల వరకు ఎలాంటి బాధలు ఉండవని మంత్రి చెప్పుకొచ్చారు.

30వ వార్డులో 16 గల్లీలు తిరిగానని, ఈ వార్డు పర్యటనలో రెండు విషయాలు తన దృష్టి వచ్చాయని, ప్రతి ఖాళీ ప్లాట్‌ ‌డంప్‌ ‌యార్డుగా మార్చారని, ఖాళీ ప్లాట్‌ ‌చూసి చుట్టు పక్కల ఇళ్ల వారు అందరూ చెత్త వేస్తున్నారని, ఖాళీ ప్లాట్లలో చెత్త వేస్తే అందరికీ ఇబ్బంది ఉంటుందని, ఇంటిని శుభ్రంగా ఉంచినట్లే.. గల్లీ, పట్టణాన్ని శుభ్రంగా ఉంచాలని ప్రజలను కోరారు. ఖాళీ ప్లాట్‌ ‌స్థలంలో చెత్త వేస్తే రూ.500 జరిమానా విధిస్తామని, అలాగే ఇంటింటికీ చెత్త సేకరణలో భాగంగా మున్సిపాలిటీకి తడి, పొడి చెత్త వేర్వేరుగా చేసి సహకరించని వారికి కూడా రూ.500 జరిమానా విధించే యోచనలో మున్సిపాలిటీ ఉన్నదని చెప్పారు. చెత్త అనేది దేశానికి పెద్ద సమస్యగా మారిందని, ప్రజలు సహకరిస్తే చెత్త దూరం చేయడం సులభమని, దేశంలో ప్రతిరోజూ 20 వేల టన్నుల చెత్త సేకరిస్తున్నారని, టన్నుల కొద్దీ పేరుకుపోతున్న చెత్తను కంట్రోల్‌ ‌చేసే బాధ్యత మనపైన ఉందని వివరిస్తూ.. ఒకనాడు సిద్ధిపేటకు నీళ్ల బాధను చూసి పిల్లను ఇచ్చేవారు కాదని, కానీ ఇవాళ నీళ్ల బాధ లేకుండా చేసుకున్నట్లుగానే., మీరంతా సహకరిస్తే.. చెత్త లేకుండా ఉండే సిద్ధిపేటను బంగారం తరహాలో చేస్తానని దీమావ్యక్తం చేశారు. పట్టణంలో మున్సిపాలిటీ తరపున వారంలో రెండు రోజులు పొడి చెత్త సేకరిస్తామని, తడి చెత్త ప్రతి రోజూ సేకరిస్తామని స్పష్టం చేశారు. ఆకుపచ్చ బుట్టలో తడి చెత్త వేయాలని, ఈ చెత్త మళ్లీ ఎరువుగా మారి మట్టిలో కలిసి పోతుందని, నీలం రంగు బుట్టలో పొడి చెత్త వేయాలని కోరారు. చెత్త బండి వస్తున్నా.. ఖాళీ స్థలంలో, మోరీల్లో చెత్తను ఎందుకు వేస్తున్నారని, దీని వల్ల డెంగీ, విష జ్వరాలు సోకుతాయని ప్రజల్లో అవగాహన కల్పించారు. ప్రజల భాగస్వామ్యం లేకపోతే ఏమీ చేయలేమని, మీ భాగస్వామ్యంతోనే పట్టణం అభివృద్ధి చేయగలుగుతామని చెప్పారు. ప్లాస్టిక్‌ను అందరూ నివారించాలని, ఇందు కోసం త్వరలోనే పట్టణంలోని 39వేల ఇళ్లకు జూట్‌ ‌బ్యాగులు పంపిణీ చేయనున్నామని పేర్కొన్నారు. త్వరలోనే 57 ఏండ్ల వారికి పింఛన్లు అందిస్తామని, ఇళ్లు లేని వారికి ఉగాది పండుగకు డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్లు అందిస్తామని వెల్లడించారు. భవిష్యత్‌ ‌లో తమ సొంత ప్లాట్లలో ఇళ్లు కట్టుకునే వారికి ప్రభుత్వం నుంచి డబ్బులు ఇప్పిస్తామని పేర్కొన్నారు. పుట్టిన రోజు, మరణించిన రోజు మొక్కలు నాటాలని, స్మశాన వాటికలను పార్క్ ‌తరహాలో చేశామని, కోమటి చెరువు సుందరీకరణ, ఎర్ర చెరువును కోమటి చెరువు తరహాలో చేయనున్నామని పట్టణ అభివృద్ధి పనులను మంత్రి వివరించారు.

20వ వార్డు పట్టణ ప్రగతిలో వార్డు సమస్యలపై కమిటీ సభ్యులను ఆరా తీసిన మంత్రి 58, 59జీఓ కింద దరఖాస్తుకు గడువు పొడగింపు చేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తో మాట్లాడతానని, ఇదే చివరి అవకాశం పోగొట్టుకోవద్దని మంత్రి హరీశ్‌ ‌రావు సూచించారు. 58, 59జీఓ కింద దరఖాస్తు చేసుకున్న వారికి నాలుగు రోజుల్లో పట్టాలు ఇవ్వాలని అర్బన్‌ ‌తహశీల్దారును మంత్రి ఆదేశించారు. 20వ మున్సిపల్‌ ‌వార్డు పట్టణ ప్రగతిలో భాగంగా వార్డు కమిటీ సభ్యులతో మమేకమై మాట్లాడుతూ.. వార్డు సమస్యలు ఆరా తీశారు. శాఖల వారీగా అధికారుల ఉదాసీనత పై మంత్రి అగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు 59జీఓ కింద 40 ఇళ్లు ఉన్నాయని, వారికి ఈ శనివారం రోజులోపు పట్టాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. 58జీఓ ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారు ఎక్కువ స్థలంలో కడితే దాన్ని 59జీఓ కిందకు మార్పు చేసి సమస్య పరిష్కరించాలని అడిషనల్‌ ‌కలెక్టర్‌ ‌ముజంబీల్‌ ‌ఖాన్‌ ‌ను మంత్రి హరీశ్‌ ‌రావు సూచించారు. వార్డులో ఎస్సీలకు సంబంధించిన 18 మందికి స్థలం, ఇళ్ల పట్టాలు, పట్టణ ప్రగతిలో పరిష్కారమయ్యేలా చూడాలని సూచించారు. 59జీఓ కింద డబ్బులు కట్టిన వారికి పట్టాలని అందించడంతో పాటు కట్టని వారి పరిశీలించి వారిచే డబ్బులు కట్టించాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. సిద్ధిపేట నర్సాపూర్‌ ‌లో దేశానికే ఆదర్శంగా నిర్మించిన గేటెడ్‌ ‌కమ్యూనిటీ డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్ల పంపిణీ ఉగాది పండుగ రోజున పంపిణీ చేయనున్నట్లు, అర్హులైన పేద వారిని గుర్తించినట్లు మంత్రి వెల్లడించారు. ఎవ్వరికీ లంచాలు ఇవ్వొద్దని, పైరవీలు చేయొద్దని దశల వారీగా పేదలకు డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్లు అందజేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్‌ ‌రవీందర్‌ ‌రెడ్డి, ఏఏంసీ చైర్మన్‌ ‌పాల సాయిరాం, మున్సిపల్‌ ‌కమిషనర్‌ ‌శ్రీనివాస్‌ ‌రెడ్డి, డీఈ లక్ష్మణ్‌, ‌పబ్లిక్‌ ‌హెల్త్ ఈఈ ‌వీర ప్రతాప్‌, ‌డీఈ గోపాల్‌, ‌మున్సిపల్‌ ‌శాఖ వివిధ విభాగాల అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply