పేదలకు డబుల్ ఇండ్లు పైసా అప్పు లేకుండా.. మంత్రి తన్నీరు హరీష్‌రావు
పైసా అప్పులేకుండా పేదలందరికీ ప్రభుత్వమే డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. బుధవరం సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాలలో నిర్మించిన 24 డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… అన్ని వర్గాలు ఆనందంగా ఉండాలన్నదే టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఏకైక లక్ష్యమన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక తెలంగాణ రాష్ట్రంలోనే డబుల్ బెడ్ రూం ఇండ్లను కట్టిస్తున్నా మన్నారు. ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో బతకాలన్న ఉద్దేశంతోనే సిఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. అంతేకాకుండా, 5 లక్షల రూపాయలతో డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించిన ఘనత కూడా ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో ఇప్పటివరకు 364 ఇండ్లు ప్రారంభించామనీ, పొన్నాలకు మరో 20 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.
రాబోయే రోజుల్లో మిగిలిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పనులను పూర్తి చేస్తామనీ, పేదవారికి అప్పు లేకుండా రూపాయి ఖర్చు లేకుండా కేసీఆర్ సహకారంతో ఇండ్ల నిర్మాణం చేస్తున్నామన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అమ్మినా, ఎవరైనా కొన్నా వారిపై కేసులు నమోదు చేస్తామనీ హరీష్‌రావు హెచ్చరించారు. ట్యాంకు నిర్మాణం పూర్తి కాగానే త్రాగునీరు కనెక్షన్లు ఇస్తామనీ, అలాగే పొన్నాలలోని ఎస్సీలకు ప్రత్యేకంగా పాడిపశువులను అందిస్తామనీ, పొన్నాల గ్రామ శివారులో రాబోయే రోజుల్లో ఉమెన్స్ హాస్టల్ నిర్మించడంతో పాటు 3కోట్ల రూపాయలతో సిద్దిపేట నియోజకవర్గ ముదిరాజ్ ఫంక్షన్ హాల్‌ను కూడా నిర్మించనున్నట్లు హరీష్‌రావు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సూడా ఛైర్మన్ రవీందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాల సాయిరాం, ఎంపిపి, జడ్పిటిసి, సర్పంచి, పిఏసిఎస్ ఛైర్మన్, టిఆర్ఎస్ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.