అర్హులకు ఇండ్లు ఇచ్చే వరకు పోరాటం చేస్తాం…కలెక్టరేట్ ఎదుట ప్రజలతో కలిసి కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు
సిద్ధిపేట పట్టణంలోని నర్సాపూర్‌లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపులలో టిఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పినోళ్లకే అధికారులు ఇండ్లను కేటాయించారనీ, నిజమైన అర్హులకు ఇల్లు వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామనీ సిద్ధిపేట పట్ణణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్కరసు ప్రభాకర్‌వర్మ, ఎస్సీసెల్ రాష్ట్ర కన్వీనర్ బొమ్మల యాదగిరి హెచ్చరించారు. సోమవారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఎదుట సిద్ధిపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లను ఇవ్వాలంటూ బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వర్మ, యాదగిరి మాట్లాడుతూ..డబుల్ బెడ్ రూం ఇండ్లను నిజమైన, నిరుపేదలకు మాత్రమే డబుల్ బెడ్ రూం ఇంటిని కేటాయిస్తామని మంత్రి హరీష్‌రావు, జిల్లా కలెక్టర్ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనీ, ఇందిరమ్మ ఇళ్లలో పట్టాలు ఇచ్చిన వారికి న్యాయం చేయాలని డిమాండు చేశారు. అన్ని వర్గాలకు చెందిన పేద ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇండ్లను ఇచ్చి న్యాయం చేయాలన్నారు.
డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపులో భాగంగా అధికారులు చేసిన సర్వే, విచారణ వల్ల నిజమైన నిరుపేదలకు న్యాయం జరగలేదన్నారు. స్థానికంగా ఉన్న టిఆర్ఎస్ నేతలు చెప్పిన వారినే అధికారులు అర్హులుగా ప్రకటించారన్నారు. సర్వే పేరిట సంబంధిత అధికారులు, సిబ్బంది చేసిన సర్వే వల్ల నిజమైన లబ్దిదారులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి నిజమైన, నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లను అందేలా చూడాలన్నారు. నిజమైన, అర్హులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు దక్కే వరకు కాంగ్రెస్ పార్టీ వారి పక్షాన నిలబడుతుందనీ, అవసరమైతే మరిన్ని ఆందోళనలు చేపడుతామనీ వర్మ, యాదగిరి హెచ్చరించారు. నిరసన అనంతరం అర్హులకే డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయించాలంటూ వినతి పత్రాన్ని కలెక్టరేట్ అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో నేతలు జీవన్‌రెడ్డి, వహీద్‌ఖాన్, కలీమొద్దీన్, షాబుద్దీన్, రమేష్, శ్రీనివాస్‌గౌడ్, అజ్మత్, చందు, సత్యనారాయణ, భాను, ప్రశాంత్‌రెడ్డి, నర్సింగ్‌యాదవ్, మహిళలు పాల్గొన్నారు.