- పలు గ్రామాల్లో ‘డబుల్’ ఇళ్లను ప్రారంభించిన మంత్రి కెటిఆర్
- ఎన్నికలప్పుడే డబుల్ ఇళ్ల ప్రతిపాదన చేసిన కెసిఆర్ : మంత్రి వేముల
సిఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం పేదోడి ప్రభుత్వమని మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన సందర్భంగా మంత్రి కేటీఆర్ ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్, గొల్లపల్లి ఎల్లారెడ్డిపేట గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించి ఇచ్చామని అన్నారు. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వమే పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కట్టించి ఇస్తున్నదని, పారదర్శకంగా ఇండ్లను పంపిణీ చేస్తున్నామని, నిరుపేదల మొహాల్లో సంతోషం చూడడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇలా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించి పేదలకు ఇవ్వడం లేదన్నారు. పేదలకు గూడు కల్పించాలన్న లక్ష్యంతో గతంలో లాగా కాకుండా డబుల్ ఇళ్లను నిర్మించి ఇస్తున్నామని పేర్కొన్నారు. పేదలు ఆత్మగౌరవంగా ఉండాలన్నదే సర్కార్ సంకల్పమని అన్నారు. త్వరలో అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు చేస్తామని కూడా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో రోడ్డు-భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ తదితరులు ఉన్నారు.
ఎన్నికలప్పుడే డబుల్ ఇళ్ల ప్రతిపాదన చేసిన కెసిఆర్ : మంత్రి వేముల
పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టివ్వాలని తెలంగాణ ఉద్యమ సమయంలోనే కేసీఆర్ ప్రకటించారని మంత్రులు కెటిఆర్, వేముల ప్రశాంతరెడ్డిలు గుర్తు చేశారు. అన్నమాట ప్రకారమే అధికారంలోకి వొచ్చాక సీఎం కేసీఆర్ పేదల ఆత్మగౌరవం నిలబడేలా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించి ఇస్తున్నారని, పట్టిన పట్టు, చెప్పిన మాట తప్పనోడు కేసీఆర్ అని మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రూ. 10.56 కోట్లతో నిర్మించిన 168 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్‌కుమార్, ఎంపీ సంతోష్‌కుమార్‌తో కలిసి మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి వేముల మాట్లాడుతూ.. దేశంలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టివ్వాలని దేశంలో ఏ నాయకుడికైనా తోచిందా అని ప్రశ్నించారు. తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తామంటే ఇతర రాష్ట్రాల సీఎంలు, మంత్రులు నమ్మలేదన్నారు. కానీ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ 2 లక్షల 67 వేల ఇళ్లను మంజూరు చేసి రూ. 19 వేల కోట్లతో ఇళ్ల నిర్మాణం చేపట్టారన్నారు. ఇప్పటికే లక్ష 67 ఇళ్ళు పూర్త్తైనట్లు తెలిపారు. కేటీఆర్ ఎమ్మెల్యే కావడం సిరిసిల్ల వాసుల అదృష్టం అన్నారు. పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపన కోసం తెలంగాణ వైపు చూస్తున్నట్లు చెప్పారు. ఉపాధి కల్పన కోసం పరిశ్రమల కోసం మంత్రి కేటీఆర్ పని చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.