జియాగూడ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రి కెటిఆర్
కేటాయింపులు సరిగా లేవంటూ మహిళల ఆందోళన
పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్నదని మంత్రి కెటిఆర్ తెలిపారు. పేదలు గౌరవంగా బతకాలని సిఎం కెసిఆర్ వీటిని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారని అన్నారు. పేదల సొంత ఇంటి కలను ప్రభుత్వం విజయదశమి కానుకగా సాకారం చేసిందని కేటీఆర్ అన్నారు. హైదరాబార్ నగరంలోని జియగూడలో డిగ్నిటీ హౌసింగ్ కాలనీని ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ క్రమంలో గోషామహల్ నియోజకవర్గంలోని గోడె కీ కబర్‌లో నూతనంగా నిర్మించిన 192 డబుల్ బెడ్ రూం ఇండ్లను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఇండ్ల నిర్మాణానికి రూ. 14.88 కోట్లు ఖర్చు చేశారు. హైదరాబాద్ నగరంలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, దఫాలుగా వాటిని ప్రజలకు అందిస్తామని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా అన్నారు. సోమవారం ఉదయం జియాగూడలోని 840 ఇండ్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన వారందరికీ ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వస్తాయని.. ఇళ్ల కోసం ఎవ్వరికీ డబ్బులు ఇవ్వవలసిన పని లేదన్నారు. జియాగూడను అభివృద్ధి చేస్తామని, ఒక బస్తీ దవాఖాన కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు.
మంత్రి సభలో మహిళల ఆందోళన
కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతుండగానే సభా ప్రాంగణం వద్ద మహిళలు ఆందోళనకు దిగారు. కేసీఆర్ సర్కార్‌కు వ్యతిరేకంగా మహిళలు నినాదాలతో హోరెత్తించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీని పారదర్శకంగా చేయడం లేదంటూ మహిళ ఆరోపించారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలకే ఇళ్లను కేటాయిస్తు న్నారని మిగిలిన వాళ్లను పట్టించుకోవట్లేదంటూ మహిళలు మండిపడ్డారు. అయితే మంత్రి కేటీఆర్ మాత్రం మహిళలు ఆందోళనపై మాట్లాడలేదు. అక్కడ ఏర్పాటు చేసిన బస్తీ దవఖానాను ప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.