- కాంట్రాక్టర్ల కోసమే కడుతున్నారు
- రాష్ట్రంలో మూర్ఖపు పాలన సాగుతుంది
- పాతబస్తీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు
- మూడో రోజూ యాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
తెలంగాణలో ప్రధాని ఆవాస్ యోజన పథకంను డబుల్ బెడ్రూమ్ ఇళ్లంటూ పేరు మార్చుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ప్రధాని మోదీకి పేరు వొస్తుందనే పథకం పేరు మార్చారని ఆరోపించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నాణ్యత లేదని, కాంట్రాక్టర్ల కోసమే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కడుతున్నారని విమర్శించారు. పేదల గురించి ప్రభుత్వం ఆలోచించడంలేదని, ఇప్పటి వరకు కేంద్రానికి లబ్దిదారుల జాబితా అందించలేదన్నారు. కేంద్రం ఎన్నిసార్లు అడిగినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ప్రభుత్వం ఇళ్లు కట్టకపోవడం వల్లే జాబితా పంపట్లేదన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను మాత్రం ప్రభుత్వం చక్కగా వాడుకుంటుందన్నారు. రాష్ట్రంలో ఒకే కుటుంబం మూర్ఖపు పాలన సాగుతుందని, ఎక్కడికి వెళ్లిన ప్రజలు సమస్యలు చెబుతున్నారని బండి సంజయ్ అన్నారు.
బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర సోమవారం రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆయనకు గుర్రాలు, ఒంటెలతో మైలార్ దేవ్పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి ఘన స్వాగతం పలికారు. బోనాలు, మంగళహారతులతో బండికి మహిళలు వీర తిలకం దిద్దారు. ఈ సందర్బంగా బండి మాట్ళాడుతూ పేదల గురించి ఆలోచించే పరిస్థితిలో ప్రభుత్వం లేదని, టీఆర్ఎస్ సర్కార్ మెడలు వంచేది బీజేపీ మాత్రమేనని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. మజ్లీస్ చేసే మతవిద్వేషాలు కావాలా? లేక ఓల్డ్ సిటీ అభివృద్ధి కావాలో పాతబస్తీ ప్రజలు ఆలోచించు కోవాలన్నారు. పాతబస్తీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు.
పాతబస్తీలో ఎంఐఎం గుండాల చేతిలో నలిగిపోయింన హిందువులకు అండగా ఉండడం కోసమే భాగ్యలక్ష్మి ఆలయం నుంచి పాతయాత్ర ప్రారంభించామన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర మూడో రోజులో భాగంగా..బాపు ఘాట్ వద్ద మాట్లాడిన బండి సంజయ్.. పాతబస్తీని వదిలిన హిందువులు మళ్లీ తిరిగి వొచ్చేలా చేస్తామన్నారు. పాతబస్తీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. టీఆర్ఎస్ మజ్లీస్ రెండూ ఒక్కటేనన్నారు. పార్ట్నర్ షిప్ లతో పేద ప్రజలను టీఆర్ఎస్…మజ్లీస్లు మోసం చేస్తున్నాయన్నారు. ఉప ఎన్నిక సమయంలో మాత్రమే కేసీఆర్ బయటకు వొస్తున్నారన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇళ్లు కట్టిస్తామని చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు.. ఇక డబుల్ బెడ్ రూమ్లు ఏం కడతారని ప్రశ్నించారు. ఆయుష్మాన్ భారత్ పథకం రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో కనీస సౌకర్యాలు లేక, సిబ్బంది లేక పేద ప్రజలు ఇబ్బందిపడుతున్నారన్నారు. ప్రైవేట్ హాస్పిటళ్లకు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం భాకీ పడిందన్నారు. ఆరోగ్యశ్రీ కూడా రాష్ట్రంలో సరిగా పని చేస్తలేదన్నారు.