Take a fresh look at your lifestyle.

దోస్త్ ‌మేరా దోస్త్

“లోక్‌సభలో కమలదళానికి పూర్తి స్థాయి మెజార్టీ ఉండటంతో బిల్లు తేలిగ్గా ఆమోద ముద్ర వేసుకుంది. అయితే రాజ్యసభకు వచ్చే సరికి బీజేపీకి తగినంత బలం లేదు. ఇక్కడ బిల్లు గట్టెక్కటం అంత తేలిక కాదు. కేంద్రమంత్రి నరేంద్ర సింగ్‌ ‌తోమర్‌ ‌సభలోబిల్లులను ప్రవేశ పెట్టినప్పుడు విపక్షాలు రాజ్యసభలో రచ్చ రచ్చ చేశాయి. నినాదాలతో సభ హోరెత్తింది. రైతులకు నష్టం చేకూర్చి కార్పొరేట్లకు లాభం కలిగించే ఈ బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. కొందరు వెల్‌లోకి దూసుకువెళ్లారు. ఒక ఎమ్‌పీ ఏకంగా రూల్‌ ‌బుక్‌ను డిప్యూటి ఛైర్మన్‌ ‌పై విసిరేసే ప్రయత్నం చేశారు.”

pendrive rehana senior journalistరాజ్యసభలో వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంలో ఆసక్తికర రాజకీయ దృశ్యాలు ఆవిష్కృతం అయ్యాయి. బీజేపీ మిత్రపక్షాలు కూడా కొన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తే…బయటి నుంచి అనధికార స్నేహాన్ని కొనసాగిస్తున్న వైసీపీ మాత్రం బేషరతుగా, బీజేపీ అంత గట్టిగా ఆ బిల్లులను సమర్థించు కువచ్చింది. పైగా ప్రతిపక్ష కాంగ్రెస్‌ ‌పై విరుచుకు పడింది. బిల్లులు రైతుల ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నాయా లేదా అనే చర్చలోకి ఇక్కడ వెళ్ళటం లేదు. రాజకీయ ఈక్వేషన్లు వరకు చూద్దాం.

పెద్దల సభలో రగడ:
వ్యవసాయ రంగంలో సంస్కరణ పేరుతో కేంద్రం మూడు బిల్లులు- రైతుల ఉత్పత్తుల వర్తక, వాణిజ్యం (ప్రోత్సాహం, సదుపాయకల్పన) బిల్లు-2020, ధరల హామీ, పంట సేవల అంగీకార బిల్లు-2020, తృణధాన్యాలు, పప్పులు, ఉల్లిపై నియంత్రణ ఎత్తివేసే.. నిత్యవసర ఉత్పత్తుల (సవరణ) బిల్లు-2020లను తీసుకువచ్చింది. వీటి పై ముందు నుంచీ వివాదం రగుతూనే ఉంది. అయితే లోక్‌సభలో కమలదళానికి పూర్తి స్థాయి మెజార్టీ ఉండటంతో బిల్లు తేలిగ్గా ఆమోద ముద్ర వేసుకుంది. అయితే రాజ్యసభకు వచ్చే సరికి బీజేపీకి తగినంత బలం లేదు. ఇక్కడ బిల్లు గట్టెక్కటం అంత తేలిక కాదు. కేంద్రమంత్రి నరేంద్ర సింగ్‌ ‌తోమర్‌ ‌సభలోబిల్లులను ప్రవేశ పెట్టినప్పుడు విపక్షాలు రాజ్యసభలో రచ్చ రచ్చ చేశాయి. నినాదాలతో సభ హోరెత్తింది. రైతులకు నష్టం చేకూర్చి కార్పొరేట్లకు లాభం కలిగించే ఈ బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. కొందరు వెల్‌లోకి దూసుకువెళ్లారు. ఒక ఎమ్‌పీ ఏకంగా రూల్‌ ‌బుక్‌ను డిప్యూటి ఛైర్మన్‌ ‌పై విసిరేసే ప్రయత్నం చేశారు. మరికొందరు సభ్యులు బిల్లు ప్రతులను చింపేసి విసిరేశారు. కొందరు డిప్యూటీ ఛైర్మన్‌ ‌మైక్‌లను లాగేందుకు ప్రయత్నించారు. విపక్షాలు ఓటింగ్‌ ‌కోసం పట్టుబట్టినా ఈ రభస మధ్యే మూజువాణి ఓటుతో డిప్యూటి ఛైర్మన్‌ ‌బిల్లులు ఆమోద పొందినట్లు ప్రకటించారు. దీనితో విపక్షాల నిరసనలు, ఆందోళనలు సభ బయట కూడా కొనసాగాయి. పంజాబ్‌, ‌ఛత్తీస్‌ఘడ్‌, ఉత్తరప్రదేశ్‌, ‌హర్యానా వంటి రాష్ట్రాల్లో రైతులు రోడ్డెక్కారు.

వైసీపీ బేషరతు మద్దతు…
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వ్యవసాయ రంగాల సంస్కరణ బిల్లుల పై పెద్దల సభలో ఇంత రాద్ధాంతం జరిగిందంటే విపక్షాలు ఏ స్థాయిలో వీటిని వ్యతిరేకించాయో అర్ధం అవుతుంది. విపక్షాలే కాదు ఎన్డీయే ప్రధాన మిత్రపక్షం శిరోమణీ అకాలిదళ్‌ ‌కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. ఆయా బిల్లులకు పార్లమెంట్‌ ‌లో వ్యతిరేకంగా ఓటు వేయటమే కాదు ..మోదీ కేబినెట్‌ ‌లో ఆ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్‌ ‌కౌర్‌ ‌బాదల్‌ ‌తన పదవికి రాజీనామా చేశారు. బీజేపీతో శిరోమణి అకాలీదళ్‌ ‌బంధం ఈనాటిది కాదు. అనేక ఆటోపోట్లను తట్టుకుని వీరు ప్రయాణం కొనసాగింది. అయినా కేవలం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని రైతుల ప్రయోజనాల దృష్య్టా వ్యతిరేకిస్తున్నామని ఆ పార్టీ తీసుకున్న నిర్ణయం పొలిటికల్‌ ‌సినారియోలో కీలకమైంది. అదే విధంగా బీజేపీతో దశాబ్దాలుగా మిత్రపక్షంగా కొనసాగి ఆ రాష్ట్ర గత ఎన్నికల సమయంలోనే తెగతెంపులు చేసుకున్న శివసేన కూడా చివరి నిమిషంలో హ్యాండ్‌ ఇచ్చింది. అటు అనధికార స్నేహితుడు బిజూ జనతాదళ్‌ ‌కూడా రాజ్యసభలో చర్చ సందర్భంగా బిల్లులను సెలక్ట్ ‌కమిటికి పంపించాలని డిమాండ్‌ ‌చేసింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే టీఆర్‌ఎస్‌ ‌పూర్తి స్థాయిలో వ్యతిరేకించింది. బీజేపీ, అకాలిదళ్‌ ‌మినహా ఆ పార్టీ మిత్రపక్షాలు, వైసీపీ మాత్రమే మద్దతు తెలిపాయి. కాంగ్రెస్‌, ‌బీజేపీ మిత్రపక్షమైన అకాలీదళ్‌, ‌శివసేన, టీఆర్‌ఎస్‌, అన్నాడీఎంకే, డీఎంకే, తృణమూల్‌ ‌కాంగ్రెస్‌, ‌బీఎస్పీ, ఎస్పీ, ఆమాద్మీ పార్టీలు తీవ్రంగా తప్పుబట్టాయి. ఈ ఈక్వేషన్లో చూసినప్పుడు వైఎస్‌ఆర్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ ఏ స్థాయిలో బీజేపీకి బాసటగా నిలబడిందో, బిల్లులు పాస్‌ అయ్యేందుకు ఎంత గట్టిగా సహకరంచిందో అర్ధం అవుతుంది. అంతకు ముందు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికలోనూ వైసీపీ ఎన్డీయే అభ్యర్థి హరివంశ్‌ ‌నారాయణకే మద్దతు ఇచ్చింది. బీజేపీ కోణంలో చూస్తే వైసీపీ ఒక నమ్మదగిన స్నేహితుడు అయి ఉండొచ్చు. అయినా రాజకీయ క్షేత్రంలో అప్పటి అవసరాలు, సమీకరణలను బట్టే స్నేహాలుంటాయి. అవి తెర ముందు స్నేహం అయినా, తెర వెనుక దోస్తీ అయినా.

Leave a Reply