రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం కృషి చేస్తూ దేశం లోనే నెంబర్ వన్ పోలీసింగ్ గా నిలిచిన తెలంగాణా పోలీస్ శాఖ ప్రతిష్ట ను దెబ్బతీసే విధంగా ఒక పత్రికలో వచ్చిన వార్తను పోలీస్ సీనియర్ అధికారులు తీవ్రంగా ఖండించారు. ఒక ప్రధాన పత్రికలో దొంగలతో దోస్తీ అనే శీర్షికతో నేడు వచ్చిన వార్తను ఖండిస్తూ శాంతి భద్రతల విభాగం అడిషనల్ డీజీ జితేందర్, ఐ.జీ. ప్రమోద్ కుమార్, డీ.ఐ.జీ.శివశంకర్ రెడ్డి నేడు డీ.జీ.పీ. కార్యాలయంలో నేడు విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఈ వార్తలో ఏమాత్రం వాస్తవం లేదని, ఇది పూర్తిగా సత్య దూరంగా ఉందని పేర్కొన్నారు. ఈవార్త తో పోలీస్ శాఖలోని దాదాపు లక్ష మంది పోలీస్ అధికారులు, సిబ్బంది ఆత్మ స్తైర్యం దెబ్బతినడంతో పాటు ఇది మొత్తం రాష్ట్ర ప్రజలకు నష్టం కలిగించేవిధంగా ఉందని జితేందర్ అన్నారు.
రాష్ట్రంలో పోలీస్ శాఖ అత్యంత పారదర్శకంగా పని చేస్తోందని, పోలీస్ అధికారుల పోస్టింగుల్లో పూర్తిగా నిబంధనలను అనుసరించి, అధికారుల పనితీరు ఆధారంగా, ఇతర ఇండికేటర్ల ఆధారంగానే చేపట్టడం జరుగుతోందని స్పష్టం చేశారు. పోలీస్ శాఖ ఇమేజ్ కు తీవ్ర విఘాతంగా ఉన్న ఈ వార్త పై న్యాయ పరమైన చర్యకు ఉపక్రమించనున్నట్టు అడిషనల్ డీ.జీ.పీ తెలిపారు. పోలీస్ అధికారుల నియామకాల్లో రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధుల జోక్యం వున్నదని చేసిన ఆరోపణలు సరికాదన్నారు. విధి నిర్వహణలో విఫలమైన పోలీసులపై ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూనే ఉన్నామని చెప్పారు. గత ప్రభుత్వాలకన్నా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అనంతరమే ప్రభుత్వం పోలీస్ శాఖ పటిష్ఠతకు ప్రత్యేక నిధులు చర్యలు చేపట్టడంతో శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్ శాఖ ను దేశంలోనే నెంబర్ వన్ పోలీస్ గా తీర్చిదిద్దాం మని తెలిపారు.
ఏ రాష్ట్రంలో లేని విధంగా పోలీసింగ్ లో ఎన్నో విప్లవాత్మక, వినూత్న, పారదర్శక కార్యక్రమాలను ప్రవేశపెట్టి ప్రజలకు మరింత చేరువైన ఘనత తెలంగాణ రాష్ట్ర పోలీసులదే అన్నారు. ఈ వార్త రాష్ట్ర ప్రభుత్వ పరువు ప్రతిష్టలను పూర్తిగా దిగ జార్చే విధంగా వుందని, మొత్తం పోలీస్ యంత్రాంగం ఆత్మ స్తైర్యాన్ని దెబ్బ తీసే విధంగాఉందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ఇరవై నాలుగు గంటలు పనిచేసే పోలీస్ శాఖ పై వచ్చిన ఈ తప్పుడు వార్త మొత్తం పోలీస్ వ్యవస్థకే మచ్చ వచ్చే విధంగా ఉందని తెలిపారు. ఈ వార్త పై పోలీస్ శాఖ న్యాయ పరమైన చర్యను చేపడుతోందన్నారు.