Take a fresh look at your lifestyle.

పేద పిల్లలకు చదువు అక్కర్లేదా?

  • ప్రభుత్వ స్కూళ్లను మూసేయాలనుకుంటున్నారా?
  • 22 వేల మంది స్వచ్ఛ కార్మికులను తొలగించేశారు
  • 12 వేల మంది విద్యా వలంటీర్లను తీసేశారు
  • మెయింటెనెన్స్ ‌నిధులివ్వకుండా స్కూళ్లు నిర్వీర్యం
  • ప్రజా సంగ్రామ యాత్రలో టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ తీరుపై బండి సంజయ్‌ ‌ఫైర్‌
  • ‌రేపు హుస్నాబాద్‌లో లక్ష మందితో భారీ బహిరంగ సభ
  • చీఫ్‌ ‌గెస్టుగా కేంద్ర మంత్రి ఇరానీ హాజరు కానున్నట్లు వెల్లడి

‘ఇవేం స్కూళ్లు. శుభ్రం చేసే స్వచ్ఛ కార్మికులను తీసేసిండ్రు. చదువు చెప్పే విద్యా వలంటీర్లను తొలగించిండ్రు. మెయింటెనెన్స్ ‌నిధులను ఆపేసిండ్రు. ప్రభుత్వ స్కూళ్లను మూసేయాలనుకుంటున్నారా? పేద పిల్లలకు చదువును దూరం చేస్తారా’? అని బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎం‌పి బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 34వ రోజు పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్‌ ‌సిద్దిపేట జిల్లా కోహెడ సమీపంలోని శ్రీరాములపల్లెలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. కనీస సౌకర్యాల్లేక, పరిశుభ్రత లేక శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతున్న పాఠశాలను చూసి చలించిపోయారు. స్కూల్‌ ‌పిల్లలు, టీచర్లతో చాలాసేపు గడిపారు. అక్కడున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యా వలంటీర్లను తీసేయడంతో టీచర్ల కొరత ఉందని, స్వచ్ఛ కార్మికులను తొలగించడంతో పాఠశాల అపరిశుభ్రంగా తయారైందని, మెయింటెనెన్స్ ‌నిధులు కూడా రావడం లేదని గ్రామస్తులు, స్కూల్‌ ‌విద్యార్థులు బండి సంజయ్‌ ‌దృష్టికి తీసుకొచ్చారు. దీంతో తీవ్రంగా స్పందించిన బండి సంజయ్‌..‌నేను పాదయాత్ర చేసిన ప్రాంతాల్లోని దాదాపు అన్ని స్కూళ్లలో ఇదే దుస్థితి. అన్నీ శిథిలావస్థలోనే ఉన్నయ్‌. ‌స్కూల్‌ ‌డెవలప్‌మెంటు స్కీమ్‌ ‌కింద 2000 కోట్ల రూపాయలు ఖర్చుపెడతానని, ప్రత్యేక బృందం ఢిల్లీ, ఏపీకి పోయి ఒక నివేదిక సమర్పిస్తుంది. నివేదిక రాగానే పనులు మొదలు పెడతానని ప్రగల్భాలు పలికిన రాష్ట్ర ముఖ్యమంత్రి నివేదిక వొచ్చి నెలలు గడుస్తున్నా నిధులు మాత్రం పాఠశాలలకు ఇవ్వలేదనీ ఆరోపించారు. ప్రైమరీ స్కూలుకి రూ.12 వేల నుండి 1 లక్ష రూపాయాలు ఏటా మెయింటెనెన్స్ ‌గ్రాంట్‌ ఇవ్వాలి. కానీ ఇవ్వడం లేదు. హై స్కూల్‌కు ఏటా రూ.25 నుండి రూ.1 లక్ష వరకు మెయింటెనెన్స్ ‌గ్రాంట్‌ ఇవ్వాలి. అతీగతీ లేదు. అని మండిపడ్డారు. రాష్ట్రంలో పాఠశాలల్లో పనిచేస్తున్న 28 వేల మంది స్వచ్చ కార్మికులను కేసీఆర్‌ ‌తొలగించేసిండు. మాట్లాడితే రూ.2వేల పెన్షన్‌లు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకునే కేసీఆర్‌ ‌స్వచ్ఛ కార్మికులకు కనీసం రూ.2 వేల వేతనం ఇవ్వలేరా? వాళ్లు లేనందువల్ల పరిశుభ్రత లేక ఈరోజు పాఠశాలలన్నీ అత్యంత దయనీయమైన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రేపు హుస్నాబాద్‌లో లక్ష మందితో భారీ బహిరంగ సభ..చీఫ్‌ ‌గెస్టుగా కేంద్ర మంత్రి ఇరానీ
అక్టోబర్‌ 2‌న హుస్నాబాద్‌లో భారతీయ జనతా పార్టీ సుమారు లక్షమందితో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నది. బిజెపి రాష్ట్ర చీఫ్‌ ‌బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌చేపట్టిన తొలిదశ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ముగింపు సందర్భంగా గాంధీ జయంతిని పురస్కరించుకుని రేపు హుస్నాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. హుస్నాబాద్‌లో జరిగే రోడ్‌ ‌షో, బహిరంగ సభకు కేంద్ర మంత్రి స్మృతి ఇరాని రానున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర తొలి దశ పాదయాత్రను విజయవంతం చేసిన రాష్ట్ర ప్రజానీకానికి కృతజ్ఞతలు చెప్పనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12గంటలకు అంబేద్కర్‌ ‌సెంటర్‌లో బహిరంగ సభ జరగనున్నది. గురువారం సిద్ధిపేట జిల్లా కోహెడలో వివిధ జిల్లాల అధ్యక్షులు, ఇంఛార్జిలతో బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌సిద్దిపేట పాదయాత్ర శిబిరంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సిద్దిపేట జిల్లాకు 120 కిలో మీటర్ల పరిధిలోని పొరుగు జిల్లాల అధ్యక్షులు, జిల్లా ఇంఛార్జిలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆయా జిల్లాల నుండి భారీ ఎత్తున జనం, బిజెపి కార్యకర్తలు హుస్నాబాద్‌ ‌బహిరంగ సభకు హాజరయ్యే అవకాశం ఉన్నందున అక్టోబర్‌ 2‌న నిర్వహించే సభలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, జన సమీకరణ, రవాణా వంటి అంశాలపై చర్చించారు. హుస్నాబాద్‌ ‌సభకు తమ తమ జిల్లాల నుండి పెద్ద ఎత్తున బిజెపి కార్యకర్తలు, ప్రజలు తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని జిల్లాల అధ్యక్షులు ఈ సందర్బంగా బండి సంజయ్‌ ‌కుమార్‌కు వివరించారు. తొలిదశ పాదయాత్రకు ప్రజల నుండి విశేష స్పందన లభించడం…ఎక్కడికి వెళ్లినా ప్రజలు బిజెపికి బ్రహ్మరథం పడుతూనే టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ పాలనలో ఎదుర్కుంటున్న సమస్యలను ఏకరవు పెడుతుండటంతో రాష్ట్ర ప్రజల పక్షాన భవిష్యత్‌లో తీవ్ర స్థాయిలో పోరాటాలు చేసే అంశంపై బహిరంగ సభా వేదికగా వివరించనున్నారు.

ఈ విషయాలను ముగింపు సభలో వెల్లడించడంతోపాటు బిజెపి పట్ల ఇంతటి ఆదరణ చూపుతున్న రాష్ట్ర ప్రజానీకానికి సభా వేదికగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపేందుకు సిద్ధమైంది. ఒక్కో జిల్లా నుండి సగటున 5 వేల నుండి 10 వేల మందికిపైగా జనం, బిజెపి కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలివచ్చే అవకాశం ఉన్న విషయం తెలుసుకున్న బండి సంజయ్‌ ‌దాదాపు లక్ష మంది బహిరంగ సభకు హాజరయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. దీంతో ప్రజలకు, కార్యకర్తలకు ఏ మాత్రం ఇబ్బంది కలగని రీతిలో అవసరమైన రవాణా, ఇతర సౌకర్యాల కల్పించే అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌మాట్లాడుతూ..ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజల నుండి బ్రహ్మాండమైన ఆదరణ లభిస్తుందనీ, ఎక్కడికి వెళ్లినా ప్రజలు సమస్యలను వివరిస్తూ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకతను కనబరుస్తున్నారన్నారు. ప్రజల్లో టిఆర్‌ఎస్‌ ‌పట్ల ఇంతటి తీవ్రమైన వ్యతిరేకత నెలకొందనే విషయాన్ని తాను ఊహించలేదనీ పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాలను విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చే విధంగా ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతుందనీ, పాదయాత్రను విజయవంతం చేసేందుకు పార్టీలో అందరూ కష్టపడి పనిచేశారనీ, అందరికీ పేరుపేరునా అభినందనలన్నారు. మరింతగా కష్టపడి హుస్నాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జిలను బండి కోరారు. హుస్నాబాద్‌లో సభ నిర్వహించడానికి గల కారణాలపై స్పందిస్తూ ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ‌ప్రకారం ప్రజా సంగ్రామ యాత్ర తొలిదశ పాదయాత్రను అక్టోబర్‌ 2‌న ముగిస్తున్నాం. అయితే హుజూరాబాద్‌లో ముగింపు సభను భారీగా నిర్వహించాలని భావించినప్పటికీ ఎన్నికల షెడ్యూల్‌ ‌వెలువడటం, కోవిడ్‌ ‌నేపథ్యంలో భారీ బహిరంగ సభలకు, ర్యాలీలను నిషేధిస్తూ ఎన్నికల కమిషన్‌ ‌నిర్ణయం తీసుకోవడంతో ఈసీ నిర్ణయాన్ని గౌరవిస్తూ తప్పనిసరి పరిస్థితుల్లో భారీ బహిరంగ సభను హుస్నాబాద్‌లో నిర్వహించేందుకు సిద్ధమయ్యాం అని వివరించారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు ఎన్‌విఎస్‌ఎస్‌ ‌ప్రభాకర్‌, ‌డాక్టర్‌ ‌జి.మనోహర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్‌, ‌బంగారు శృతి, శాంతికుమార్‌, ఎస్‌.‌కుమార్‌, ‌రమేష్‌ ‌రథోడ్‌, ‌టి.వీరేందర్‌గౌడ్‌, ‌లంకల దీపక్‌రెడ్డి, దూది శ్రీకాంత్‌రెడ్డి, పడమటి జగన్‌మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply