రాష్ట్రంలో ఉన్న 60 వేల మందికి పైగా ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందికి నేటి నుండి నాలుగు రోజుల పాటు కోవిద్ వాక్సినేషన్ ఇచ్చే కార్యక్రమం ప్రారంభమైందని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ ఎం. మహేందర్ రెడ్డి తెలిపారు. నేడు తిలక్ నగర్ లోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో డిజిపి మహేందర్ రెడ్డి నేడు కోవిషిల్డ్ వాక్సిన్ ను వేసుకున్నారు. ఈ సందర్బంగా డిజిపి మాట్లాడుతూ, కోవిడ్ వాక్సినేషన్ పై ఏవిధమైన అపోహలకు గురికాకుండా అందరూ ముందుకువచ్చి వాక్సిన్ వేసుకోవాలని కోరారు.
వ్యాక్సినేషన్ అనేది పూర్తిగా స్వచ్ఛంద పక్రియ అని, వంద శాతం సురక్షితమైన ఈ కోవిడ్ వాక్సిన్ ను ప్రతిఒక్కరూ వేసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో సీనియర్ పోలీసు అధికారుల నుండి అందరూ పోలీసు సిబ్బంది వ్యాక్సినేషన్ ను వేసుకుంటున్నారని, ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ ను అందరూ వేసుకుంటున్నందున, వ్యాక్సినేషన్ పై ఉన్న అపోహలను తొలగించాలని పోలీసు అధికారులందరికీ సూచించారు. కరోనా ప్రారంభంతో పాటు లాక్ డౌన్ సమయంలో ప్రజల వెంటే పోలీసులు ఉండి వారికి సేవలు అందించారని గుర్తుచేశారు. వైద్య, ఆరోగ్య శాఖతో పాటు ఇతర శాఖల సమన్వయంతో పోలీసులు లాక్ డౌన్ సమయంలో అందించిన సేవల ద్వారా ప్రజలకు భరోసా కల్పించామని, దీనికిగాను మంచి గుర్తింపు లభించిందని, అదేవిధంగా వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందికి కూడా ఉత్తమ సేవలు అందించారని మహేందర్ రెడ్డి అభినందించారు.
నేటి నుండి నాలుగు రోజుల పాటు పోలీసు శాఖకు కొనసాగే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అవసరమైతే మరిన్ని రోజులు పొడిగించాలని కోరుతామని తెలిపారు.తిలక్ నగర్ లోని అర్భన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో డి.జి.పి ఎం.మహేందర్ రెడ్డి కోవిడ్ వ్యాక్సిన్ ను వేసుకున్నారు. సాధారణ వ్యక్తిగా యు.పి.హెచ్.సి కి చేరుకున్న మహేందర్ రెడ్డికి వైద్యాధికారులు దీప్తి పటేల్, అర్శితారెడ్డి ఆద్వర్యంలో వ్యాక్సిన్ ను వేశారు. నాలుగు వారాల అనంతరం రెండవ డోస్ ను తీసుకోవాల్సి ఉంటుందని వైద్యాధికారులు తెలిపారు. వ్యాక్సిన్ వేసుకున్న అనంతరం వ్యాక్సినేషన్ జరుగుతున్న పక్రియను వైద్యాధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.