Take a fresh look at your lifestyle.

పన్నుల కోసం పీడించవొద్దు.,,, రుణాలు మాఫీ చేయాలి…

కొరోనా విజృంభణ నేపధ్యంలో ప్రభుత్వం ఇప్పటికి ఐదు సార్లు లాక్‌ ‌డౌన్‌ ‌విధించింది. లాక్‌ ‌డౌన్‌ అనేది మన దేశం లో ఎప్పుడూ అమలు కాలేదు.కొరోనా పుణ్యమా అని ఆ పేరు కూడా కొత్తగా వింటున్నాం. లాక్‌ ‌డౌన్‌ ‌విధిస్తే కొరోనా వ్యాప్తి అరికట్టవచ్చన్న ఉద్దేశ్యంతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రతిసారి సంప్రదించి విధించారు. అయితే, ప్రధాన ప్రతిపక్షాలను సంప్రదించలేదు. దీనిపై అందుకే భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. లాక్‌ ‌డౌన్‌ ‌సమయంలో ఇళ్ళల్లోనే ఉండాలనీ, వీలైతే ఇళ్ళ దగ్గర నుంచే పనులు చేసుకోవాలని ఆదేశించారు . వీలు కుదిరిన వారు అలాగే చేశారు. లాక్‌ ‌డౌన్‌ ‌సమయంలో కొన్ని సంస్థలు ఉద్యోగులకు వేతనాల్లో కోత విధించారు. ప్రైవేటు సంస్థలు, కార్పొరేట్‌ ‌సంస్థలు మూత పడటం వల్ల ఆ సంస్థల్లో పని చేసే వారికి వేతనాలు వొచ్చే మార్గాలు లేవు. యాజమాన్యాలు కొంతవరకూ సాయం చేసినా అది కడుపు నింపుకోవడానికి మాత్రమే ఉపయోగపడింది. అది కూడా కొందరికి మాత్రమే. మిగిలిన వారు దొరికిన చోటల్లా అప్పులు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆస్థి పన్నులు కట్టే పరిస్థితిలో లేరు.అందువ ల్ల పన్నులు మాఫీ చేయాలి. కిరాయి ఇళ్లలలో ఉంటున్న వారి ఇంటి అద్దెలను ప్రభుత్వమే చెల్లించాలి. నల్లా బిల్లులను కూడా రద్దు చేయాలి. కొరోనా వల్ల పేద కార్మికులు, మధ్యతరగతి వారు ఎక్కువ నష్టపోయారన్నది నిర్వివాదాంశం. ముఖ్యంగా అసంఘటిత రంగంలో ఉన్న వలస కార్మికులు తిండి లేక, గూడు లేక ఎండల్లో మాడిపోతూ గడపాల్సిన పరిస్థితిని మనం కళ్ళారా చూశాం. ప్రభుత్వం లాక్‌ ‌డౌన్‌ ‌విధించేటప్పుడు ఇతర రాజకీయ పార్టీలనూ, సామాజిక సంస్థల పెద్దలనూ సంప్రదించి ఉంటే సముచితంగా ఉండేది. అయితే, ఎవరినీ సంప్రదించకుండా తన ఆలోచనలకు ముఖ్యమంత్రుల చేత మమ అనిపించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ లాక్‌ ‌డౌన్‌ ‌ను దేశ ప్రజలపై రుద్దారని ఇప్పటికీ పలు రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రతి సారీ ప్యాకేజీలను ప్రకటించింది.

ఆ ప్యాకేజీల సాయం ఎవరికి చేరిందో ఆ దేవునికే తెలియాలి. మన వ్యవస్థలో తిష్ఠ వేసిన అవినీతి వల్ల ప్రభుత్వం అందించే సాయం, పథకాల ద్వారా అందించే సబ్సిడీలు అవినీతి పరుల జేబుల్లోకి పోతోందన్నది అందరికీ తెలిసిన వాస్తవం. అవినీతి అనేది రాజకీయ పార్టీల మధ్య పరస్పరం ఆరోపణలు చేసుకోవడానికి ఉపయోగ పడుతోంది తప్ప దాన్ని అంతమొందించే ప్రయత్నం ఏ కోశానా జరగడం లేదు. బిజినెస్‌ ‌వార్‌, ‌కార్పొరేట్‌ ‌వార్‌, ‌వాణిజ్య యుద్ధం మొదలైన వార్తలు ప్రజల చెవులను బద్దలు కొడుతున్నాయి తప్ప వారికి పట్టెడన్నం కూడా పెట్టడం లేదు. కుంభకోణాల పేరిట కోట్లాది రూపాయిలను స్వాహా చేసిన వారి నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేసిన ఖలేజా ఏ ప్రభుత్వానికీ లేదు. ఈ పరిస్థితుల్లో సామాన్యుల గురించి ఆలోచించే సమయం, సదుద్దేశ్యం ఏ పార్టీకీ లేదన్న విషయం జనానికి అర్ధం అయింది. ప్రభుత్వం ఐదు లాక్‌ ‌డౌన్‌ ‌లలో ప్రకటించిన ప్యాకేజీల ఫలితాలు వోటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని కాకుండా కొరోనా వల్ల వాస్తవంగా నష్టపోయినవారందరికీ అందించినప్పుడే ప్యాకేజీల సార్ధకత. అసలే ధరలు పెరిగి పోయి సామాన్యుల జీవితాలు దుర్భరమైన ప్రస్తుత పరిస్థితుల్లో కొరోనా లాక్‌ ‌డౌన్‌ ‌కారణంగా మరింత కుంగి పోయాయి. జనంలో అసహనం పెరిగిపోతోంది. ప్రభుత్వం వార్తా ప్రసార సాధనాల ద్వారా అదరగొట్టే ప్రచారం చేయిస్తోంది. ప్రైవేటు ప్రసార సాధనాల్లో కూడా ప్రభుత్వ ప్రకటనల జోరు పెరిగి పోయింది. సామాన్యులకు ఏం చేస్తే వారిని సంతుష్టి పర్చగలమన్న ఆలోచన ఏ ఒక్కరిలోనూ లేదు.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌ప్రధానమంత్రి కి విశ్వాస పాత్రురాలు. ఆయన వల్లించమన్న పాఠాన్ని టీవీ చానల్స్ ‌లో అప్పజెప్పేసి వెళ్ళిపోతారు. బ్యాంకులు, ఆర్థిక సహాయక సంస్థలు సామాన్యుల గురించి ఏనాడూ ఆలోచించిన దాఖలాలు లేవు. బ్యాంకులు ఇచ్చే రుణాలు, సబ్సిడీలు మొదలైన సదుపాయాలన్నీ పెద్ద కార్పొరేట్‌ ‌సంస్థలకే చెందుతాయన్నది జనాభి ప్రాయం. కిరాణా దుకాణం పెట్టుకునేందుకు రుణం తీసుకున్న సామాన్యుని వద్ద గోళ్ళూడగొట్టి వాయిదా సొమ్ము వసూలుచేసే బ్యాంకుల యాజమాన్యాలు బడా కార్పొరేట్‌ ‌దిగ్గజాలు, పారిశ్రామిక వేత్తల జోలికి వెళ్ళవన్న విషయం బహిరంగ వాస్తవం. ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్య, అసంఘటిత రంగ కార్మికులు, దారిద్య్ర రేఖకు దిగువన జీవించే వారిని ప్రభుత్వమే ఆదుకోవాలి, హామీలను అమలు జేయడం కోసం మొక్కు బడి ప్రకటనలు చేయడం కన్నా, సామాన్యుల జీవనం సాఫీగా సాగేందుకు తోడ్పడినప్పుడే జనానికి నమ్మకం కలుగుతుంది. కార్పొరేట్‌ ‌సంస్థలు వందలు, వేల కోట్లు రూపాయిలు బకాయి పడితే మాఫీ చేస్తున్న ప్రభుత్వంకొరోనా రక్కసి కోరల్లో చిక్కిన సామాన్యులు కట్టాల్సిన పన్నులు, రుణాల వాయిదా సొమ్ము కోసం పీడించకూడదు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ సామాన్య కుటుంబం నుంచి వొచ్చిన చాయ్‌ ‌వాలా కనుక ఆయనకు సామాన్యుల కష్టాల గురించి క్షుణ్ణంగా తెలుసు. ఈ సమయంలో ప్రధానమంత్రి స్వయంగా స్పందించి, తాను ప్రకటించిన ప్యాకేజీ సొమ్ము క్షేత్రస్థాయిలో అసలైన లబ్దిదారులకు అందేట్టు ప్రత్యేక యంత్రాంగం ద్వారా పర్యవేక్షణ చేయించాలి.

Leave a Reply