ఈనెల 25న ఎంఐఎం తలపెట్టిన ర్యాలీకి అనుమతి ఇవ్వొద్దని బీజేపీ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌కు విజ్ఞప్తి చేసింది. సిఏఏ వ్యతిరేక ర్యాలీ పేరుతో ఎంఐఎం రాష్ట్రంలో మతకలహాలు రెచ్చగొట్టాలని చూస్తున్నదని ఆరోపించింది. ఈమేరకు గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్ నేతృత్వంలో శాసన మండలి పక్షనేత ఎన్.రాంచందర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం పోలీస్ కమిషనర్‌ను కలసి వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా బషీర్‌బాగ్‌లోని కమిషనర్ కార్యాలయం వద్ద లక్ష్మణ్ మాట్లాడుతూ చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి ఆలయంతో పాటు ర్యాలీ నిర్వహించనున్న ప్రాంతాలలో పలు ధార్మిక సంస్థలు ఉన్నాయని చెప్పారు. సున్నితమైన ఈ ప్రాంతాలలో ర్యాలీ నిర్వహించడం ద్వారా మత విధ్వేషాలు రెచ్చగొట్టే ప్రమాదం ఉందన్నారు. మత విధ్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పార్టీని విస్తరించుకునేందుకు ఎంఐఎం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.
హైదరాబాద్‌లోనూ భైంసా తరహా మత విధ్వేషాలు రెచ్చగొట్టాలన్నదే ఎంఐఎం లక్ష్యమనీ, అందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం వంతపాడటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. జాతీయ జెండాలు పట్టుకుని మత విధ్వేషాలు సృష్టించే కార్యక్రమాలకు అనుమతి ఇవ్వకూడదని విజ్ఞప్తి చేశారు. బీజేపీ చేపట్టే నిరసనలు,ర్యాలీలకు అనుమతివ్వని పోలీసులు ఎంఐఎం ముస్లిం సంస్థలకు మాత్రం అనుమతులు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని హోదాలో తాము పాల్గొనే కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వకపోవడంతో బీజేపీ జాతీయ నాయకత్వం పిలుపునిచ్చిన కార్యక్రమాలను సైతం నిర్వహించలేకపోతున్నామని చెప్పారు. ఇంతకు ముందు మౌలానా ముస్తాక్ మాలిక్ ఆధ్వర్యంలో సీఏఏ వ్యతిరేక మార్చ్ పేరుతో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా హైదరాబాద్ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు సృష్టించారనీ, పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాంకు గురి చేశారని గుర్తు చేశారు. ఇలాంటి ర్యాలీలకు అనుమతిస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం బీజేపీ కార్యక్రమాలకు అనుమతులు నిరాకరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ పిలుపునిచ్చే కార్యక్రమాలప్పుడు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల, నాయకులను గృహ నిర్బంధం చేసే పోలీసులు ఏంఐఎం నిర్వహించే కార్యక్రమాలకు మాత్రం అనుమతులు మంజూరు చేసి భద్రత కల్పించడం ఎంతవరకు సమంజసరమని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్ రూపొందించే ముందు హల్వా చేయడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ అనీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆర్శిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను తప్పు పట్టడం ద్వారా ఎంఐఎం నీచ రాజకీయాలకు పాల్పడుతున్నదని ఈ సందర్భంగా లక్ష్మణ్ విమర్శించారు.