Ethnic pride: జాతి గొప్పతనాన్ని, మూలాలను మరువొద్దు

– ఆదివాసీ బిడ్డలకు మంత్రి సీతక్క ఉద్బోధ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 9: ఎంత ఎత్తుకు ఎదిగినా మన జాతి గొప్పతనాన్ని, మూలాలను, మన సంస్కృతి, జీవన విధానాలను ఎప్పుడూ మరవకూడదని ఆదివాసీ విద్యార్థులకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఉద్బోధించారు. మన మూలాలు ఉంటేనే మనకు అస్తిత్వం.. అందుకే మన మూలాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఉస్మానియా వర్సిటీ క్యాంపస్‌లో ఆదివాసీ ఉద్యోగుల సంక్షేమ సాంస్కృతిక సంఘం, ఆదివాసీ స్టూడెంట్స్‌ ఫోరం, ఆదివాసీ మహిళా చైతన్య శక్తి ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు జరగగా ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదివాసీల హక్కులు, అస్తిత్వం కోసం, ఆదివాసీలకు జరుగుతున్న మంచి చెడులను చర్చించుకునేందుకు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ఒక మంచి వేదిక అని పేర్కొన్నారు. మన మూలాలు జల్‌ జంగల్‌ జమీన్‌తో, ఆటపాటలతో ముడిపడి ఉన్నప్పటికీ ఉన్నత విద్య కోసం అనేక కష్టాలకోర్చి ఇంత దూరం వచ్చిన మీరు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఇంత పెద్ద ఎత్తున మన హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా కార్పొరేట్‌ కంపెనీలు అటవీ ప్రాంతాల్లో నీళ్లు, నిధులు, అడవులను ఆక్రమిస్తున్నాయని, దాన్ని ప్రశ్నిస్తే అనేక రూపాల్లో ఆదివాసీ బిడ్డలను చంపుతున్నారని పేర్కొన్నారు. రాజ్యాంగంలో మనకు కల్పించిన హక్కులు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారని, వారికి వారి హక్కులను తెలియజేయాల్సిన బాధ్యత ఆదివాసీ విద్యార్థి, ఉద్యోగ సంఘాలదేనని అన్నారు. విద్య ద్వారానే విముక్తి సాధ్యమవుతుంది.. అందుకే విద్యా రంగంలో ఆదివాసీలు రాణించాలని, ఎదిగి వచ్చిన ఆదివాసీ బిడ్డలు తోటి సమాజం కోసం కొంత సమయాన్ని వెచ్చించాలని సూచించారు. మన జాతులు అంతరించిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదేనన్నారు. జై ఆదివాసి.. ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి అని సీతక్క అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *