Take a fresh look at your lifestyle.

కొరోనా ప్రభావం కూలీల పై పడొద్దు

  • నియోజక వర్గ ప్రజాప్రతినిధులు, అధికారులతో..
  • మంత్రి హరీశ్ రావు వీడియో కాన్ఫరెన్సు

జిల్లా కేంద్రమైన సిద్ధిపేట నియోజక వర్గంలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో కరోనా నివారణ చర్యలు, ఉపాధి హామీ పథకం, పెండింగులో ఉన్న సీసీ రోడ్లు, నర్సరీల నిర్వహణ, డంప్ యార్డుల నిర్మాణం, స్మశాన వాటికల నిర్మాణం, వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు వాటి నిర్వహణపై 160 మందితో హైదరాబాదులోని తన నివాసం నుంచి ఆదివారం ఉదయం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు టెలి కాన్ఫరెన్స్ సమీక్ష నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ సమీక్షలో జిల్లా జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, జెడ్పీ సీఈఓ శ్రవణ్, డీఆర్డీఏ పీడీ గోపాల్ రావు, డీపీఓ సురేశ్ బాబు, ఏంపీడీఓలు, నియోజక వర్గ పరిధిలోని అన్నీ గ్రామాల సర్పంచ్ లు, ఏంపీటీసీలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, పీఏసీఎస్ చైర్మన్లు, ఏంపీపీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా టెలి కాన్ఫరెన్స్ లో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. కరోనా వ్యాధి నేపథ్యంలో ఉపాధి హామీ పథకం, పెండింగులో ఉన్న సీసీ రోడ్లు, నర్సరీల నిర్వహణ, డంప్ యార్డుల నిర్మాణం, స్మశాన వాటికల నిర్మాణం, వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు వాటి నిర్వహణపై అధికారులకు ఆదేశాలు, ప్రజా ప్రతినిధులకు సూచనలతో కూడిన దిశానిర్దేశం చేశారు.

ఈజీఎస్ కూలీలకు పని కల్పించే క్రమంలో ప్రతి కూలీ ఒకటిన్నర మీటరు దూరం ఉంటూ పని చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కరోనా ప్రభావం వల్ల ఉపాధి హామీ కూలీల సంఖ్య తగ్గిందని, కూలీలకు పని దినాలు కల్పిస్తూ వారి సంఖ్యను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని అందుకు కావాల్సిన చర్యలు చేపట్టి పని ప్రదేశంలో కూలీలు తప్పనిసరిగా దూరం దూరంగా పని కేటాయించి సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కరోనా ప్రభావం దృష్ట్యా కూలీలకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పనికి వచ్చే ముందు, పని పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వెళ్లే ముందు కూలీలు వారి చేతులు శుభ్రంగా కడుక్కునే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. వేసవి కాల దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లోని నర్సరీ నిర్వహణ పై అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి సూచించారు. నర్సరీలలోని మొక్కలను వంద శాతం కాపాడే విధంగా ఎండ వేడిమి నుంచి తట్టుకునే విధంగా షేడ్ నెట్ ఏర్పాటు చేసుకుని నర్సరీల్లోని మొక్కలు సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈజీఎస్ కింద మంజురైన అసంపూర్తి సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. పలు గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి సిమెంటు కొరత ఉన్నదని టెలి కాన్ఫరెన్స్ లో మంత్రి దృష్టికి తీసుకురాగా.., జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ఆ సిమెంట్ కొరత లేకుండా లభ్యమయ్యే విధంగా చర్యలు తీసుకుంటానని మంత్రి హామీనిచ్చారు. కరోనా ప్రభావంతో డంప్ యార్డు, స్మశాన వాటిక నిర్మాణ పనులు మందగించాయని, వాటిని వేగవంతం చేసి పనులు తొందరగా పూర్తి చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. గ్రామంలో పూర్తి అయిన డంప్ యార్డులను వాడకంలోకి తెచ్చి వర్మీ కంపోస్టు తయారీకి వాటిని వినియోగించేలా గ్రామ సర్పంచ్ లు, ఏంపీటీసీలు చొరవ చూపాలని, పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని ఏంపీడీఓలు పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేయాలని సూచించారు.

- Advertisement -

ఈ నెల 6, 7వ తేదిల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపిన మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను, రైతులకు తెలిపి అప్రమత్తంగా ఉండేలా ప్రజా ప్రతినిధులు రైతులను సమన్వయం చేస్తూ సూచనలు చేయాలని మంత్రి కోరారు. రైతు వరి కోసిన సమాచారాన్ని కొనుగోలు కేంద్ర ఇంచార్జికి తెలిపితే.. రైతు పంట పొలాలకు వెళ్లి తేమ శాతాన్ని పరీక్షిస్తే తేమ శాతం ఎక్కువగా ఉంటే అక్కడే ఆరబెట్టుకునే వెసులుబాటు ఉంటుందని, ఈ క్రమంలో రైతు వరి కోయగానే కొనుగోలు కేంద్ర నిర్వాహకుడికి తెలిపేలా ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకుని రైతులను సమన్వయం చేసుకుంటూ వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ఆ తర్వాత రైతులకు టోకెన్లు ఇస్తే సులువుగా ఉంటుందని, కొనుగోలు కేంద్రాల్లో కూడా ఇబ్బందులు ఉండకుండా ఉంటాయని అటు అధికారులకు, ఇటు ప్రజాప్రతినిధులకు మంత్రి సూచించారు. చిన్న, సన్నకారు రైతులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, పెద్ద రైతులు ధాన్యాన్ని నిల్వ చేసుకునే వెసులుబాటు ఉంటుందని, ఈ విషయాన్ని ప్రజా ప్రతినిధులు, అధికారులు గమనించి ఎలాంటి సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తగా అవగాహన మెదలాలని మంత్రి ఆదేశించారు. వరి, మొక్కజొన్న కేంద్రాలను వీలైనంత తొందరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని, ఆయా ప్రాంతాలను బట్టి గ్రామానికి ఒకటి లేదా రెండు గ్రామాలకు ఒక్కటి చొప్పున్న వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రతి మండలానికి రెండు లేదా మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, పొద్దు తిరుగుడు పువ్వు కొనుగోలు కేంద్రాన్ని జిల్లాలో ఒక్కచోట మాత్రమే ఏర్పాటు చేయాలని ముందుగానే నిర్ణయించినట్లు ప్రజాప్రతినిధులకు మంత్రి వివరించారు. కరోనా నేపథ్యంలో ప్రతి కొనుగోలు కేంద్రంలో రైతులు వారి చేతులు శుభ్రం చేసుకునేందుకు సబ్బు, నీళ్లు, శానిటైజర్, తాగునీటి వసతి, అవసరమైన చోట షామియానా తదితర అవసరమైన సదుపాయాలు కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

మార్కెట్ యార్డులు బంద్ దృష్ట్యా అన్నీ మండలాల్లోని గ్రామాల్లో ధ్యాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కావాల్సిన సౌకర్యాల ఏర్పాట్లు చేయాలని ఏఏంసీ చైర్మన్లు, పీఏసీఎస్ చైర్మన్లు, అధికారులకు మంత్రి సూచించారు. ఈ విషయంలో ప్రతి మండల ఏంపీపీ, జెడ్పీటీసీ, మార్కెట్ కమిటీ చైర్మన్లు ఎప్పటికప్పుడు ఏర్పాట్ల పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరిని శుద్ధి చేసే యంత్రాలు, తేమ శాతం చూసే పరికరాలు, కరెంటు, వెయింగ్ మిషన్లు, హమాలీలు, లోడింగ్, అన్ లోడింగ్ వాహనాలు, రైతుల వద్ద ఉన్న టార్ఫాలిన్ కవర్లు తదితర కీలక అంశాలపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించారు. ప్రధానంగా సమీప పంట కేంద్రాలకు సమాచారం ఇచ్చేలా రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యతను స్థానిక గ్రామ ప్రజా ప్రతినిధులు తీసుకోవాలని ఆదేశిస్తూ., గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఏలాంటి ఇబ్బందులు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ధాన్యం పరిమాణాన్ని బట్టి రైతులకు టోకెన్లు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని, పంట కోత పూర్తి అయిన తర్వాత కల్లాలోనే ధాన్యాన్ని ఆరబెట్టి తేవాలని రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. రాబోయే రోజుల్లో ప్రజా ప్రతినిధులు ఈజీఎస్ కూలీలు, సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తి చేయడం, నర్సరీలను పక్కాగా నిర్వహించే తీరు తెన్నులు, డంప్ యార్డుల నిర్మాణం, స్మశాన వాటికల నిర్మాణం, వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు వాటి నిర్వహణ అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశాలు, సూచనలు చేశారు. అన్నీ గ్రామాల్లో హైపో క్లోరైడ్ స్ప్రే జరిగేలా చూడాలని, గ్రామాల్లో ఎక్కడా కూడా ప్రజలు గుమిగుడకుండా ఉండేలా చొరవ చూపాలని ప్రజా ప్రతినిధులను మంత్రి హరీష్ రావు ఆదేశించారు.

Leave a Reply