వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

‌రెండు నాల్కల ట్రంప్‌తో జాగ్రత్త !

February 13, 2020

Donald Trump Holds Rally In Bethpage, New York

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ఈనెల 24, 25 తేదీలలో కొత్త ఢిల్లీ, అహ్బదాబాద్‌లలో జరపనున్న పర్యటన అనేక కారణాల వల్ల ప్రాధాన్యతను సంతరించుకుంది. ట్రంప్‌పై అభిశంసన తీర్మానం వీగిపోవడం, వొచ్చే నవంబర్‌లో జరిగే అధ్యక్ష పదవికి రిపబ్లికన్‌ ‌పార్టీ తరఫున మళ్ళీ ఆయనే పోటీ చేసే అవకాశాలు మెరుగు కావడంతో ఆయన ఎంతో జోష్‌లో ఉన్నారు. భారత్‌ ‌పర్యటనకు రావడానికి ముందే ఆయన బాంబు పేల్చారు. భారత్‌ అభివృద్ధి చెందిన దేశమేననీ అంటూ, జనరలైజ్‌డ్‌ ‌ప్రిఫరెన్స్(‌జిఎస్పీ) హోదా పొందే అర్హత లేదంటూ ఆయన చేసిన ప్రకటన భారత్‌ ఆశలపై నీళ్ళు జల్లినట్టు అయింది. ఆయన పర్యటన ప్రారంభానికి ముందే అమెరికా చేసిన ఈ కీలకమైన ప్రకటన అమెరికా ద్వంద్వ ప్రమాణాలను బహిర్గతం చేస్తోంది. భారత్‌ ‌తమకు బాగా నమ్మకమైన దేశమనీ, భారత ప్రధాని నరేంద్రమోడీతో చర్చలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నానని అంటూనే భారత్‌కు జీఎస్పీ హోదా అర్హత లేదనడం ట్రంప్‌ ‌రెండు నాల్కల ధోరణికి నిదర్శనం. ఆయన ఏ ప్రకటన చేసినా నిలకడగా ఉండదు. కాశ్మీర్‌ ‌సమస్యపై మధ్యవర్తిత్వం చేసుకోబోమని చెబుతూనే పాకిస్తాన్‌ ‌కోరిందని ఒక సారి, ప్రధాని మోడీయే కోరారని మరోసారి ప్రకటించి గందరగోళ పర్చారు. పైగా జిఎస్పీ హోదా కింద 2018లో భారత్‌ 260 ‌మిలియన్‌ ‌డాలర్ల సాయం అందుకుందని అమెరికన్‌ ‌ప్రభుత్వం ప్రకటించింది. జిఎస్పీ హోదా కోసం భారత్‌ ‌పట్టుపడు తుందేమోనని ముందరకాళ్ళకు బంధంగా అమెరి కన్‌ ‌ప్రభుత్వం ఈ ప్రకటన చేసి ఉండవచ్చు. 2018-19లో ఇరుదేశాల మధ్య 6.35 బిలియన్‌ ‌డాలర్ల వాణిజ్యం జరిగింది. భారత్‌ ఎగుమతి చేస్తున్న మొత్తంలో ఇది చాలా తక్కువ. అయితే, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ ‌గోయెల్‌ ఎటువంటి మొహమాటం లేకుండా వాణిజ్యం విషయంలోనే స్వంతంగానే పోటీ పడగలదని స్పష్టం చేశారు. తక్కువ ధరతో మార్కెట్‌ ‌లోకి వస్తున్న దేశాల కారణంగానే భారత్‌ ఇబ్బందులను ఎదుర్కొంటోందని ఆయన వెల్లడించారు.

ఇందుకు పరోక్షంగా అమెరికా నెరుపుతన్న తంత్రాంగమే కారణం. అభివృద్ధి చెందుతున్న దేశాల వాణిజ్యానికి గండి కొట్టడంలో అమెరికా అనుసరిస్తున్న వైఖరి వల్లనే అమెరికాను ప్రపంచంలో ఏ దేశమూ నమ్మడం లేదు. పాకిస్తాన్‌ ఉ‌గ్రవాదులను ప్రోత్సహిస్తున్న దృష్ట్యా ఆ దేశానికి ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం లేదంటూనే పాకిస్తాన్‌ను ఆదుకోవాలని అంటారు. ట్రంప్‌ అధ్యక్ష పదవిని చేపట్టడానకి ముందు దేశాధ్యక్షుని బాధ్యతల గురించి సరైన అవగాహన లేకపోవడం వల్లనే ఆయన మాట నిలకడ లేకుండా మాట్లాడుతున్నారు. అమెరికా అగ్రరాజ్యం కనుక దేశాధ్యక్షుని నోటంట వొచ్చే ప్రతి మాటకూ విలువ ఉంటుంది. మరో వంక అమెరికా అధ్యక్షుడు భారత్‌ ‌పర్యటనకు వొచ్చినప్పుడు కీలకమైన ఒప్పందాలు జరగవచ్చని ఊహాగానాలు, కథనాలు వెలువడటం సహజం. వాణిజ్య ఒప్పందం కుదరవచ్చన్న ఊహాగానానలు వొచ్చాయి. ఇరుదేశాల మధ్య వాణిజ్య లోటు 2018-19లో 16.9 బిలియన్‌ ‌డాలర్లకు తగ్గింది. అయితే, ఇంకా తగ్గాలన్నది భారత్‌ ఆకాంక్ష. రెండు దేశాల వాణిజ్య చర్చల్లో జిఎస్పీ ప్రస్తావన రావడం అసంగతం. దానిని తీసుకుని రావడం ద్వారా భారత్‌కు మొండి చెయ్యి చూపించాలన్నది అమెరికా వ్యూహంగా కనిపిస్తోంది. చైనాతో కూడా అమెరికా ఇదే మాదిరిగా ఆంక్షల విషయంలో పట్టు పట్టి, చివరికి తగ్గింది. ఇప్పుడు అక్కడ కరోనా వైరస్‌ ‌కారణంగా ఈ విషయం మాట్లాడటం లేదు కానీ, అన్ని దేశాలనూ వాణిజ్యపరంగా తొక్కి పట్టి ఉంచాలన్నది అమెరికా లక్ష్యంగా కనిపిస్తోంది. ఇరాన్‌ ‌నుంచి చమురు దిగుమతుల విషయంలో ట్రంప్‌ ఆదేశాలు జారీచేసిన రీతిలో ప్రకటనలు చేయడం భారత సార్వభౌమాధికారానికి భంగకరం. ఇరాన్‌కు, అమెరికాకు ఉన్న గొడవలకు ఇతర దేశాల ప్రయోజనాలను పణంగా పెట్టడం సమంజసం కాదు. కిందటి సంవత్సరం మోడీ అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు టెక్సాస్‌లో మోడీ హౌడీ కార్యక్రమాన్ని నిర్వహించినట్టుగానే మన దేశంలో మొదటి సారి పర్యటిస్తున్న ట్రంప్‌కు అదే రీతిలో ఘనమైన స్వాగతం ఇచ్చేందుకు మోడీ ఆదేశాలు జారీ చేశారు. అగ్రరాజ్యంతో మైత్రి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. పూర్వపు ప్రధానమంత్రులు అమెరికాతో సమాన దూరంలో ఉండేవారు. కానీ, మోడీ మాత్రం అమెరికాకు అతి దగ్గరవుతున్నారన్న విమర్శలు ఇప్పటికే వొచ్చాయి. దీని వల్ల నెహ్రూ హయాం నుంచి మన దేశం అనుసరిస్తున్న అలీన విధానం దెబ్బతినే ప్రమాదం ఉంది. భారత ప్రతిష్టకు భంగకరం అవుతుంది. రష్యాతో పోలిస్తే అమెరికా మన దేశానికి ఎప్పుడూ పెద్దగా సాయం చేయలేదు.