Take a fresh look at your lifestyle.

సమర్థ రాజకీయ నాయకత్వం తెలంగాణకు లేదా?

‘‘రాష్ట్రాన్ని పరిపాలించేంత సమర్థమైన నాయకులెవరూ తెలంగాణలో లేరు..వారికి పాలన గురించి ఏమాత్రం అవగాహనగాని, అనుభవంకాని లేదు.. ప్రత్యేక రాష్ట్రాన్ని ఎందుకు తెచ్చుకున్నామా అని తర్వాత బాధపడుతారంటూ’’ తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న రోజుల్లో సీమాంధ్ర నాయకులు అన్నమాటలివి. నాటి హైదరాబాద్‌ ‌రాష్ట్రానికి, ఆ తర్వాత ఏర్పడిన సమైక్య ఆంధప్రదేశ్‌కు రాజధాని అయిన హైదరాబాద్‌ అడ్డాగా గత డెబ్బై ఏళ్ళుగా సీమాంధ్ర పాలకులు తమ ఇష్టారాజ్యంగా ఏలి, ఎన్ని విధాలుగా తెలంగాణ ప్రాంతాన్ని, ప్రజలను అణచివేశారనడానికి యాభై ఏండ్లకు పైగా ఇక్కడ జరిగిన పోరాటాలే సాక్ష్యం. ఈ పాలకుల కబంధ హస్తాల నుండి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి ఏడేళ్లైనా పూర్తికాలేదు. అప్పుడే ఈ ప్రాంతంపై మరోసారి ఆధిపత్యాన్ని సంతరించుకోవడం కోసం రాజకీయ ఎత్తుగడలు మొదలైనాయి. తెలంగాణ అన్నమాట ఇక్కడి ప్రజ నరనరాల్లో జీర్ణించుకుపోయింది. ఆమాట వినగానే ఇక్కడి ప్రాంతీయులకు రక్తం ఉప్పొంగిపోతుంది. ఎక్కడిలేని అభిమానం పుట్టుకొస్తుంది. ఆరేళ్ళక్రితం, దాదాపు పదేళ్ళకు పైగా ఏకధాటిగా ఉద్యమాలు చేసి, రక్తమోడ్చి, ప్రాణాలను బలిపెట్టి తెచ్చుకున్న తెలంగాణపై ఇంకో ప్రాంతానికి చెందిన వారు పెత్తనానికి రంగం సిద్ధం చేస్తున్నారన్న మాటను ఇక్కడి ప్రజలెవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఒకటి రెండు సాధారణ ఎన్నికల్లోనే ప్రాంతేతర పార్టీలను ఇక్కడి ప్రజలు శంకరగిరి మాన్యాలను పట్టించిన విషయం తెలియంది కాదు. సీమాంధ్రకు చెందిన వైఎస్‌ఆర్‌, ‌టిడిపి పార్టీలు నేటికీ ఇక్కడ ఎదగలేకపోతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఆ ప్రాంతానికి చెందినవారి నాయకత్వంలో ఇక్కడ ఒక కొత్తపార్టీని ఏర్పాటు చేసే ప్రయత్నాలు ముమ్మురంగా మొదలవుతున్నాయంటే అందుకు తెలంగాణ నాయకత్వ లోపమైనా అయిఉండాలి లేదా అధికారపార్టీ అసమర్థతైనా అయిఉండాలన్న చర్చ జరుగుతుంది. తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డంపెట్టుకుని రాజకీయ రంగ ప్రవేశంచేసేందుకు దివంగత వైఎస్‌ ‌రాజశేఖర్‌రెడ్డి కూతురు, ఏపి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చెల్లెలు షర్మిల జై తెలంగాణ నినాదంతో ప్రజను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. తాను పెట్టబోయే రాజకీయ పార్టీకి తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలను పొందేందుకు తనను తాను తెలంగాణ కోడలిగా చెప్పుకుంటుంది. వైఎస్‌ ‌ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణను వ్యతిరేకించినప్పుడు గాని, ఆ తర్వాత అన్న జగన్‌మోహన్‌రెడ్డి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించినప్పుడు గాని జ్ఞాపకం రాని కోడలితనం ఇప్పుడామెకు గుర్తుకు వొచ్చినట్లుంది. జగనన్న విడిచిన బాణంగా తెలంగాణలో పర్యటనలు చేసినప్పుడు కూడా ఆమెకు ఆ విషయం గుర్తుకు రాలేదు. కాని, ఇప్పుడే ఎందుకు గుర్తుకు వొచ్చింది?  ఇప్పుడు కూడా ఆమె జగనన్న విడిచిన బాణంగానే ఇక్కడ పార్టీ పెట్టేందుకు వొచ్చిందా? జగనే స్వయంగా ఇక్కడ పార్టీ ఏర్పాటు చేయాలనుకున్నాడా? అలా చేస్తే తెలంగాణ సిఎం కెసిఆర్‌తో ఉన్న స్నేహబంధానికి ఇబ్బంది ఏర్పడుతుందని చెల్లెలిని పావుగా వాడుకుంటున్నాడా? రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రచారంలో ఉన్నట్లు నిజంగానే అన్నా చెల్లెలి మధ్య పొరపొచ్చాలున్నాయా? ఒకవేళ అలాంటిదే ఉంటే ఏపిలోనే పార్టీకి ఎందుకు శ్రీకారం చుట్టలేదు లాంటి పలు ప్రశ్నలు ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా తాను తెలంగాణలో చేస్తున్న ఈ హల్‌చెల్‌కు అన్న జగన్‌మోహన్‌రెడ్డి మద్దతులేదని ఎవరు చెప్పారంటూ వేసిన ఎదురు ప్రశ్నలోనే జగన్‌ ‌కనుసన్నల్లోనే పార్టీ ఏర్పాట్లు జరుగుతున్నాయన్నది స్పష్టమవుతోంది. అయితే నేటికీ సోనియాగాంధీని ఇటలీ దేశస్తురాలిగానే బావిస్తున్నారు. గతంలో ప్రధాని పదవి చేపట్టే విషయంలో ఎంత రభస జరిగిందన్నది తెలియంది కాదు.

అలాగే తెలంగాణలో రాయలసీమకు చెందిన షర్మిలను తమ భుజాలమీద మోయడానికి తెలంగాణ ప్రజలు ఇష్టపడుతున్నారా? సిద్ధపడుతున్నారా అన్న ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నలుగుతోంది. ఏమైనా తెలంగాణ రాజకీయాల్లోకి ఆమె దూకుడుగా రంగప్రవేశం చేసిందనే చెప్పాలి. రాజకీయ పార్టీ పెడుతున్నట్లు స్పష్టమైన ప్రకటన చేయకపోయినా ఆమె మాటలు, కార్యకలాపాలు ఆ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి.

ఇప్పటికే రాష్ట్ర రాజధానిలోని పలువురు వైఎస్‌ అభిమానులతో ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తూనే ఉన్నారు. వైఎస్‌ ‌హయాంలో ఒక వెలుగు వెలిగినవారు, ఆయనంటే ఆభిమానం ఉన్న వారందరిని ఆమె ప్రోగుచేస్తూనేఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి ధాటికి తట్టుకోలేక పోతున్న కొందరు, కొడిగడుతున్న కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన వారు, మరుగైపోయిన తెలుగుదేశం పార్టీకి చెందినవారు ఒక్కొక్కరుగా హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లోని ఆమె ఇంటిబాట పడుతున్నారు.

పూర్వం నుండి రాష్ట్ర రాజకీయాల్లో రెడ్డి, రావుల మధ్య కొనసాగుతున్న వైరం టిఆర్‌ఎస్‌ అధికారంలోకి వొచ్చిన తర్వాత మరింత పెరింగిందన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఇప్పుడు అధికారానికి దూరమైన రెడ్డి వర్గం షర్మిల పెట్టబోయే పార్టీకి సంపూర్ణ మద్దతుగా నిలిచే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఈ రాజకీయ ఆధిపత్యం పోరులో స్థానిక నాయకులు స్థానికతకు తిలోదకాలు ఇస్తే, మరోసారి తెలంగాణ సీమాంధ్రపాలన కిందికి మారకపోదు. ఉద్యమకాలంలో సీమాంధ్రుల వెక్కిరింపులకు ఉక్రోషపడిన నాయకులు ఇప్పటికైనా ఇంటిపార్టీలకే పాలనా అవకాశాన్ని కలిగిస్తాయో… పరాయి పాలకులకు దాసోహం అంటారో ఆలోచించుకోవాల్సిన తరుణమిది.

Leave a Reply