Take a fresh look at your lifestyle.

కౌలు రైతులపై వివక్ష తగదు

ఏలూరు,జూలై 16 : వ్యవసాయంలో మార్కెట్‌ ‌శక్తుల ఆధిపత్యం పెరగడం, భూసంస్కరణలు జరగకపోవడం వలన ఏపీలో కౌలు రైతుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. అంచనా వేసిన మేరకైనా సర్కారు కౌలు రైతులను గుర్తించి బ్యాంకు రుణాలిప్పించిందా అంటే అదీ లేదు. కౌలు రైతులు తమ హక్కుల కోసం దశాబ్దాల తరబడి పోరాడుతున్నారు. తమకు కనీసం సంస్థాగత పరపతి, ప్రభుత్వ పథకాలను వర్తింపజేయాలని కోరుతున్నారు. ప్రభుత్వాల చిన్నచూపునకు బ్యాంకుల సహాయ నిరాకరణ తోడవడంతో వ్యవసాయ పెట్టుబడుల కోసం కౌలు రైతులు పడుతున్న అగచాట్లు పడుతున్నారని కౌలురైతుల సంఘం నాయకుడు శ్రీనివాస్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని చట్టాలు తీసుకుని వచ్చినా తమకు అండగా ఉండడం లేదన్నారు.

రైతుల స్థితిగతులపై అధ్యయనం చేసిన జయతిఘోష్‌, ‌కోనేరు రంగారావు కమిటీలు కౌల్దార్లకు బ్యాంక్‌ ‌రుణాలిప్పించాలని సిఫారసు చేసినా పెద్దగా ఫలితం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కౌల్దార్లకు రుణ అర్హత కార్డు జారీకి చట్టం తెచ్చింది. భూయజమానితో సంబంధం లేకుండా రెవెన్యూ అధికారులు గ్రామ సభలు నిర్వహించి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. నేటికీ గ్రామాల్లో భూస్వాములు, పెత్తందార్ల ఆధిపత్యం కొనసాగుతున్నందున కౌల్దార్లుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేదలకు కార్డులు రావట్లేదన్నారు. బ్యాంకులు కౌలు రైతుల రుణాలే ఎన్‌పిఏలుగా పేర్కొంటే ప్రభుత్వం కూడా దానిని అంగీకరించడం సరికాదని శ్రీనివాస్‌ అన్నారు.

రుణమాఫీకి సవాలక్ష కొర్రీలు పెట్టింది. వడ్డీ మాఫీ, వడ్డీ రాయితీ పథకాల గురించి చెప్పనవసరం లేదు. ఎల్‌ఇసి లేని వారికి సాగు ధృవీకరణ పత్రాలన్నా పెద్దగా ఉపయోగం లేదు. వ్యవసాయం గిట్టుబాటుకాక, ప్రైవేటు అప్పులతో రుణగ్రస్తులై విధిలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న కౌల్దార్లను అసలు రైతులుగానే గుర్తించట్లేదన్నారు. పంటల ఉత్పత్తిలో, ఏపీలో 16 లక్షల మంది కౌలు రైతులుంటారని ప్రభుత్వమే లెక్కలేసింది. 20 లక్షలకు పైమాటేనని రైతుసంఘాలు చెబుతున్నాయి.

Leave a Reply