Take a fresh look at your lifestyle.

‌మున్సిపోల్స్ ‌ఫలితాలతో బిజెపి నమ్మకం పెరిగిందా ?

Does BJP believe in municipal results

మున్సిపల్‌ ఎన్నికలతో భారతీయ జనతాపార్టీకి తెలంగాణలో నిలదొక్కుకుంటామన్న నమ్మకం ఏర్పడింది. తెలంగాణలో అధికార తెరాసకు ప్రత్యమ్నాయం తామేనని మొదటి నుండీ చెబుతూవస్తున్న ఈ పార్టీ మాటలు ఈ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు నిజమేనని చెబుతున్నాయి. గతంతో పోలిస్తే ఆ పార్టీకి ఈ ఎన్నికల్లో క్రమేణ వోటింగ్‌ ‌శాతం పెరగడమే ఇందుకు కారణమంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల నుండీ బేరీజు వేసుకుంటే ఒకదాని తర్వాత ఒకటిగా జరిగిన పార్లమెంటు ఎన్నికలు, మున్సిపల్‌ ఎన్నికలు ఆ పార్టీకీ మరింత స్త్థైర్యాన్నిస్తున్నాయి. ఒక్క ఏడాదిలోనే ఆ పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగినట్లుగా కనిపిస్తున్నది. 2018 చివరిలో శాసనసభ ఎన్నిక)కు ముందు తెలంగాణ రాష్ట్రంపై తమదే జంఢా అని గొప్పలు చెప్పిన ఆ పార్టీ తీరా ఫలితాలు వొచ్చేసరికి చతికిలపడింది. ప్రత్యామ్నాయం కాదుకదా కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది. ఆ ఎన్నికల్లో కేవలం ఎనమిది శాతం వోట్లను మాత్రమే సాధించి ఒకే ఒక శాసనసభ స్థానాన్ని గెలుచుకుంది. అయితే కొద్ది నెలల తేడాలోనే వొచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ అనూహ్య విజయాన్ని సాధించింది. ఎవ్వరూ ఊహించని విధంగా అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి చెందిన దిగ్గజాలను ఓడించి విజయపరంపరలోకి దూసుకువెళ్ళింది. తెలంగాణ ఏర్పడడానికి ముందు నుండీ ఉద్యమంలో మమేకమై, గత పార్లమెంటు ఎన్నికల్లో గెలిచిన కెసిఆర్‌ ‌కూతురు కల్వకుంట్ల కవిత, వినోద్‌కుమార్‌ ‌లాంటివారిని ఇంటికి పంపించిందా పార్టీ. మొత్తానికి ఈ ఎన్నికల్లో నాలుగు ఎంపి స్థానాలను దక్కించుకోగా, ఆ పార్టీ 21 శాతం వోట్లతో ముందుకు దూసుకుపోయింది. తాజాగా జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో మున్సిపాలిటీలకు, కార్పొరేషన్‌లకు సంబంధించి అన్ని వార్డులకు పోటీచేయలేకపోయినా చాలాచోట్ల అధికారపార్టీని ధీటుగా ఎదుర్కోవడంతో నువ్వా, నేనా అన్నట్లుగా పోటీనివ్వగలిగింది. మొత్తంమీద మూడు మున్సిపాల్టీల్లో పూర్తి ఆధిక్యతతో కాషాయ జంఢాను ఎగురవేయగలిగింది కూడా. అలాగే కార్పొరేషన్‌లలో కూడా తనసత్తాచాటుకుంది.

సుమారు ఆరవై అయిదు డివిజన్‌లను గెలుచుకుని రెండవస్థానంలో నిలిచిందంటే, అధికార పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని ఇంతకాలంగా చెబుతూ వొస్తున్న ఆపార్టీ వర్గాల మాటలు నిజమవుతున్నాయన్న భావన కలుగుతోంది.ఈ ఫలితాలను బట్టి దీనివెనుక ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన కె. లక్ష్మణ్‌ ‌కృషి బాగానే ఉందని చెప్పకనే చెప్పవచ్చు. రాష్ట్రంలో ఇటీవల కాలంలో జరుగుతూ వొస్తున్న అన్ని ఎన్నికల్లో అధికార పార్టీ బాణంలా ముందుకు దూసుకుపోతున్న తరుణంలో జాతీయ పార్టీ అయిన బిజెపి ఉనికిని సృష్టించగలిగాడన్న నమ్మకం ఇప్పుడా పార్టీ వర్గాలకు లక్ష్మణ్‌పై ఏర్పడింది. ఇలాంటి తరుణంలో ఆయన్ను మార్చి కొత్త•వారికి ఆ పదవిని కట్టబెట్టినంత మాత్రాన అదనంగా ఆ పార్టీకి జరిగే లాభమేమీ ఉండదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి లక్ష్మణ్‌ ఈ ‌పదవిని చేపట్టి మూడేళ్ళకాలం పూర్తవుతోంది. దేశ వ్యాప్తంగా ఆ పార్టీ సంస్థాగత ఎన్నికలను నిర్వహిస్తున్న తరుణంలో ఇక్కడ అధ్యక్షుడి మార్పుపై చాలాకాలంగా చర్చ జరుగుతున్నది. అయితే లక్ష్మణ్‌ను కాదంటే ఈ పదవిని చేపట్టేందుకు చాలామంది ఇప్పటికే ముందుకు వొచ్చారు. వారిలో పార్టీని చాలాకాలంగా అంటిపెట్టుకుని ఉన్నవాళ్ళతోపాటు, ఇతర పార్టీ) నుండి వొచ్చి చేరినవారు కూడా పార్టీ పగ్గాలను తమకప్పగించాలంటూ అధిష్టానం వద్ద చాలాకాలంగా మంతనాలు చేస్తున్నవారూ ఉన్నారు.

- Advertisement -

గతంలో ఈపదవిలో కొనసాగిన చింతల రాంచంద్రారెడ్డితో పాటు యెండల లక్ష్మీనారాయణ, రాంచందర్‌రావు, ఎంపి బండి సంజయ్‌తోపాటు కాంగ్రెస్‌ ‌నుండి వచ్చిన డీకే అరుణ కూడా ఈ పదవిని ఆశిస్తున్నవారిలో ఉన్నారు. కరుడుగట్టిన పార్టీనేతగా పేరున్న బిజెపి ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావుకు కూడా అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. కాగా, అనూహ్యంగా నాలుగు ఎంపీ స్థానాలనతోపాటు, తాజాగా మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ ఉనికిని చాటడంలో లక్ష్మణ్‌ ‌పాత్ర గణనీయం కావడంతో ఆయనకే మరో అవకాశం ఇవ్వొచ్చన్న ప్రచారం కూడా జరుగుతున్నది. ఇటీవలకాలంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శిస్తూ ఆయన పలు కార్యక్రమాలు చేపట్టడం, ఆర్టీసి సమ్మె తదితర ఉద్రిక్త పరిస్థితుల్లో ఆయన స్వయంగా బాధితుల పక్షాన నిలబడడం లాంటి చర్యలతో ఆయనకు ప్రజల కష్టాల్లో పాలుపంచుకునే నేతగా పేరు రావడం కూడా ఆయన్నే కొనసాగిస్తారనడానికి బలం చేకూరుస్తున్నాయి. ఇదిలాఉంటే 2023 ఎన్నికల నాటికి పవన్‌కళ్యాణ్‌ ‘‌జనసేన’ బిజెపితో కలిసి పనిచేయనున్నట్లు వార్తలు వొస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పుంజుకుంటున్న బిజెపికి తోడుగా జనసేన కూడా కలిస్తే రాష్ట్ర రాజధానిపై కాషాయజంఢా ఎగరడం ఖాయమంటున్నారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఇక మూడవస్థానానికే పరిమితం అవనుందనిపిస్తోంది. కాంగ్రెస్‌లో కూడా రాష్ట్ర పగ్గాలు ఎవరికివ్వాలన్న మీమాంస చాలాకాలంగా కొనసాగుతున్నది. అక్కడ ఎవరి పేరు ప్రకటించినా మిగతావారి పరిస్థితేమిటీ, అలిగినవారు పార్టీలో ఉంటారా అన్నది కూడా సంశయమే. ఇలాంటి అంతర్ఘత కుమ్ములాటలే ఆ పార్టీని మూడవస్థానానికి బలవంతంగా నెట్టివేస్తున్నాయి.

Tags: telangana bjp, yedela lakshmirao,municipal elections, trs party

Leave a Reply