Take a fresh look at your lifestyle.

గృహిణి ఇంటి చాకిరీకి విలువ కట్టారా?

‘‘‌గృహిణులు అయిన మహిళలు ఇంటివద్ద చేసే పని కూడా ఆర్థిక కార్యకలాపమే. కానీ అది లెక్కింపుకు నోచుకోవడం లేదు. గృహిణులు ఇంటి వద్ద చేసే పనిని బయట వాళ్ళతో చేయించుకుంటే డబ్బు చెల్లించాలి…అయినా గృహిణి పని ద్వారా వచ్చే నాణ్యతను బైటివారి పనితో పోల్చలేము… అంతే కాదు భర్త సంపాదించే ఆస్తిలో ఖచ్చితంగా గృహిణి పాత్ర ఉంటుంది .. ఆ సంపాదనలో గృహిణి కూడా భాగస్వామురాలే..’’

సాధారణంగా గృహిణులను చేస్తుంటారని అడిగిన ప్పుడల్లా అత్యధికులు ఏమీ చేయడం లేదని చెబుతుంటారు. అదే భర్తను భార్య ఏం చేస్తారు అని అడిగితే.. ఏం చేయరు ఖాళీ.. హౌస్‌ ‌వైఫ్‌ అనే సమాధానం లభిస్తుంది. బయటకు వెళ్లి చేసేదే పని… ఇంట్లో చేసేది పని కాదు అనేది మనందరిలో జీర్ణించుకుపోయిన ఒక అభిప్రాయం. అదే ఉద్యోగిని అయిన మహిళకు మాత్రం గృహిణి అనే బాధ్యతలు అదనం.. అయితే వీరు కుటుంబాల కోసం చేస్తున్న పనికి విలువను మాత్రం లెక్కలోనికి తీసుకోవడం లేదు. దీనిని బట్టి సామాజిక సాధికారితా గుర్తింపు మహిళలకు లేదని తెలుస్తుంది. గృహిణులు అయిన మహిళలు ఇంటివద్ద చేసే పని కూడా ఆర్థిక కార్యకలాపమే. కానీ అది లెక్కింపుకు నోచుకోవడం లేదు. గృహిణులు ఇంటి వద్ద చేసే పనిని బయట వాళ్ళతో చేయించుకుంటే డబ్బు చెల్లించాలి…అయినా గృహిణి పని ద్వారా వచ్చే నాణ్యతను బైటివారి పనితో పోల్చలేము… అంతే కాదు భర్త సంపాదించే ఆస్తిలో ఖచ్చితంగా గృహిణి పాత్ర ఉంటుంది .. ఆ సంపాదనలో గృహిణి కూడా భాగస్వామురాలే.. గృహిణికి ఆర్థిక స్వాతంత్య్రం రావాలంటే ఆమె చేసే పనికి కచ్చితంగా ఆర్ధిక విలువ ఉండాలి. అయితే దాదాపుగా ప్రతి ఇంట్లో ఆస్తులన్నీ పురుషుల పేరున పెట్టుకుని.. పరువు ప్రతిష్టలను మోసే బాధ్యత మహిళలపైనే నెట్టేసీ వ్యవస్థలో మనం ఉన్నాం.

 

ఈ వ్యవస్థ ఉన్నంతకాలం పరిస్థితులు మారవు. స్త్రీల పేరిట ఆస్తులు ఉండేవారు బహు అరుదు. వారిలోనూ  ప్రభుత్వ పథకాల్లో లబ్ది పొందాలనే ఆలోచనతో పెట్టేవారే ఎక్కువని చెప్పవచ్చు. గృహిణి యొక్క ఇంటిపని కూడా ఆర్థిక కార్యక్రమమని గుర్తించిన నాడు దేశ జి.డి.పి యొక్క అసలు మొత్తం ఎంతో తెలుస్తుంది. దేశంలో నిరుద్యోగం నిజంగా ఎంతుందో కూడా దీని ద్వారా తెలుస్తుంది. ఏమీ చేయడంలేదని చెప్పే గృహీణులు కూడా వాస్తవంగా శ్రమ చేస్తున్నారనీ, వారి శ్రమ కూడా దేశ ఆర్థిక కార్యకలాపాల్లో భాగమేననీ, కానీ ఆ శ్రమకు చెల్లింపులు లేవనీ గుర్తించాలి. స్త్రీల శ్రమవల్ల కూడా ఉత్పత్తి జరుగుతుంది.. అయితే అది దేశ జి.డి.పి లో లెక్కించబడడం లేదు. స్త్రీల ఉత్పత్తిని కూడా లెక్కిస్తే దేశ జి.డి.పి ఇంకా పెద్దమొత్తంలో నమోదవుతుంది. భారత దేశంలో పురుషుడు తన పని గంటల్లో 80 శాతం మేరకు వేతన శ్రమకు వినియోగిస్తుండగా, మహిళలు 84 శాతం పని గంటలను జీతం బత్యం లేని ఇంటి పనులకు పెడుతున్నారని రూఢీ అయిన గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మహిళల గృహ శ్రమ వాటా 13 శాతంగా లెక్కించగా, భారత దేశంలో మాత్రం స్థూల దేశీయోత్పత్తిలో అది 40 శాతంగా రికార్డయింది.

ఇంటిపనిలో గృహిణులు చూపే శ్రమ నైపుణ్యానికి సాటిలేదనీ, వారి ఉత్పత్తి చెల్లింపుకి నోచుకున్నట్లయితే కుటుంబాల జీవన ప్రమాణాల కూడా పెరుగుతాయి అని సామాజిక వేత్తలు పేర్కొంటున్నారు. తన కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఒక స్త్రీ తన ప్రేమను, సమయాన్ని పూర్తిగా వెచ్చిస్తుంది. దానికి ఎంత డబ్బు ఇచ్చినా కొనలేరు. ఒక తల్లి ఇచ్చే మానసిక భద్రత మరెవ్వరూ ఇవ్వలేరు. దాన్నీ ధర పెట్టి మార్కెట్‌లో తెచ్చుకోలేం. ఆమెది కఠోరమైన శ్రమ. అవసరమైన సందర్భాల్లో విలువ ఇవ్వడం కాదు. ఆమె శ్రమ సమాజాభివృద్ధికీ తోడ్పడేదే. ఆ విషయం మరిచిపోకూడదు ఒక ఇంట్లో మహిళ చేసే పని ఆగిపోతే ఇంటి చక్రం తిరగడమే ఆగిపోతుంది. ఇది ప్రతిఒక్కరూ నమ్మాల్సిన వాస్తవం. ఐక్యరాజ్యసమితిలో మహిళలపై జరుగుతున్న అన్ని రకాల వివక్షలను నిర్మూలించేందుకు 1993 సంలో ఒక సదస్సు జరిగింది. దీనిపై భారత్‌ ‌తో పాటు అనేక ప్రపంచ దేశాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం మహిళలు గృహిణులుగా చేస్తున్న ఇంటిపనులకు సరైన విలువ కట్టడానికి ప్రభుత్వాలు బాధ్యత తీసుకున్నాయి. దాదాపు 20 యేళ్ళ క్రితం ఈ ఒప్పందంపై సంతకం చేసినప్పటికీ, తీసుకున్న బాధ్యతను నిర్వర్తించడానికి మాత్రం చిత్త శుద్దితో ముందుకు వచ్చిన ప్రభుత్వాలు మాత్రం కానరాలేదు… 2010లో సుప్రీమ్‌ ‌కోర్ట్ ఒక కేసును విచారిస్తూ
(ఎ.కె. గంగూలీ, జి.ఎస్‌.‌సంఘ్‌ ‌కూడిన బెంచ్‌) ‌ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది ఈ కేసు సందర్భంగానే గృహిణుల శ్రమకు శాస్త్రీయ పద్ధతిలో విలువ కట్టే పనికి పూనుకుని తదనుగుణంగా వివిధ చట్టాలకు సవరణలు చేయాలని ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు కోరింది. ‘‘మహిళలు పిల్లలను సాకుతారు. గృహ సేవలు నిర్వహిస్తారు. తద్వారా కుటుంబస్థాయిలో వినియోగమయ్యే మార్కెట్లో అమ్ముడు కాని సరుకులను ఉత్పత్తి చేస్తారు’’ అని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. ఈ మధ్యనే ఒక వాహన ప్రమాదంలో నష్టపరిహారానికి సంబంధించిన కేసులో తీర్పు ఇస్తూ గృహిణుల శ్రమకు ఆర్థిక విలువ కట్టాల్సిందేనని చెప్పిన సుప్రీం ధర్మాసనం ఆ మేరకు పరిహార మొత్తాన్ని పెంచింది. ఇంటి ఇల్లాలు చేసే పనికి కూడా విలువ కట్టాలని ఈ తీర్పు సష్టం చేసింది. ఈ తీర్చుతో ఇంటి పనికి విలువ కట్టడం అనేది మరలా తెరపైకి వచ్చింది ఇదే సమయంలో  జస్టిస్‌ ఎన్వీ రమణ గారు అంతర్జాతీయ న్యాయ సూత్రాలను సామాజిక న్యాయ ధర్మాన్ని పాటించినట్టు అవ్వాలి అంటే మహిళల శ్రమకు విలువ కట్టాలని, దానికి కావలసిన మార్గదర్శక సూత్రాలు రూపొందించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అభిప్రాయ పడ్డారు. అంతే కాకుండా గృహిణులకు నష్టపరిహారం చెల్లించడం న్యాయశాస్త్ర పరంగా సమ్మతమైన చర్యగా పేర్కొన్నారు.
లత వాద్వా, స్టేట్‌ ఆఫ్‌ ‌బీహార్‌ ‌మధ్య జరిగిన కేసులో ఒక ఉత్సవంలో తలెత్తిన అగ్ని ప్రమాదంలో మరణించిన గృహిణులకూ పరిహారం ఇవ్వాలి. ఇందులో గృహిణులకు పరిహారం ఇవ్వడానికి ఏడాదికి రూ.10,000 – 12,000 వార్షిక ఆదాయాన్ని లెక్కించారు.
ఇటీవల మినిస్ట్రీ ఆఫ్‌ ‌స్టాటిస్టిక్స్ అం‌డ్‌ ‌ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్‌ ‌విడుదల చేసిన ‘’టైం యూజ్‌ ఇన్‌ ఇం‌డియా 2019’’ నివేదికలో ఇంటిపనుల కోసం మహిళలు సగటున రోజుకు 299 నిమిషాలు వెచ్చిస్తే, పురుషులు మాత్రం 97 నిమిషాలు మాత్రమే వెచ్చిస్తున్నట్లు వెల్లడైంది.

ఆఖరికి 2001 జనాభా లెక్కలలోనూ ఇంటిపని చేసే వారిని అడుక్కునేవారు, వేశ్యలు, ఖైదీలతో పోలుస్తూ వారి పనికి ఆర్థిక విలువ లేనట్లుగా పరిగణించడం పట్ల కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇలా దేశంలో 36 కోట్ల మంది మహిళల పనిని ఆర్థికంగా విలువ లేని పనిగా అంచనా వేసింది. గృహిణులు చేసే పనికి విలువ లేకపోవడం ఒక్క భారతదేశానికే పరిమితం కాదు. ఇదే పరిస్థితి జర్మనీ, ఇటలీ, అమెరికా, బ్రిటన్‌ ‌లాంటి దేశాలలోనూ ఉందని ఇందులో ప్రస్తావించారు.
2011 జనాభా లెక్కల సేకరణ సమయంలో దేశంలోని 15.98 కోట్ల మంది మహిళలు ఇంటి పని చేస్తున్నారని, పురుషుల్లో మాత్రం 57.9 లక్షల మంది మాత్రమే గృహ శ్రమ చేస్తున్నట్టు జస్టిస్‌ ‌రమణ గారు ఆ తీర్పులో ప్రస్తావించారు. అయితే చట్టాల్లో అభ్యుదయ దేశంగా చేతల్లో అభివృద్ధి నిరోధక జాతిగా నిరూపించుకుంటున్న మనకు ఈ తీర్పులు పెద్దగా ప్రభావం చూపవనే చెప్పవచ్చు అయితే పితృ స్వామ్య భావజాలం అనేది పురుషుల్లోనే కాదు మహిళల్లో కూడా ఉంటుందని కొందరి మహిళల అభిప్రాయాలను బట్టి తెలుస్తూ ఉంది. కారణం ఏమిటంటే గృహిణి ఇంటి పనికి విలువ కట్టాలి అనే ఈ ప్రతిపాదనను మహిళల్లో కూడా వ్యతిరేకించే వాళ్ళు లేకపోలేదు. ఇంట్లో మహిళలు ప్రేమతో ఆప్యాయతతో చేసే పనికి ఖరీదు కట్టవద్దు! అని ఖండించే మహిళలు కూడా ఉన్నారు. గృహిణుల పట్ల భర్తకు ప్రేమ, గౌరవం ఉంటే చాలు. అంత కన్నా భర్త పూర్తిగా ఆమెకే సొంతం అయితే చాలు. డబ్బు ప్రమాణం కాదు అని చెప్పి పితృస్వామ్య భావజాలాన్ని గౌరవించే మహిళలు కూడా భారత సమాజంలో ఇంకా ఉన్నారు.. అందులో భాగంగానే ‘ఇంట్లో మహిళలు ప్రేమతో ఆప్యాయతతో చేసే పనికి ఖరీదు కట్టొద్దు!’ అంటూ నటి కంగనా రనౌత్‌ ‌ట్వీట్‌ ‌చేశారు.

‘మా చిన్న సామ్రాజ్యానికి రాణులుగా ఉన్నందుకు, మా సొంత బిడ్డలను పెంచుతున్నందుకు మాకు డబ్బులు చెల్లించకండి. ప్రతి విషయాన్ని వ్యాపారంగా చూడటం ఆపేయండి. మీ నుంచి ఆమె కోరుకునేది ప్రేమ, గౌరవం, డబ్బు మాత్రమే కాదు. మీరు పూర్తిగా ఆమెకే సొంతం కావాలనుకుంటుంది!’ అని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు.ఇదంతా పితృస్వామ్య భావజాలమే. ఈ పితృ సమాజం గృహిణిని చూసే దృక్పథం మారాలి. మహిళలు ఎవరికి వారే తమకు ఆర్థిక లాభం అక్కరలేదు అనిపిస్తే దానికి ఏమి చెప్పలేం. కానీ, వారు చేసే పనులకు మాత్రం కొంత ఆర్థిక లాభం చేకూరితే వారికి ఆర్థిక స్థిరత్వం చేకూరినట్లే. వీరికి చట్టాలు.. తీర్పులు మాత్రం పరిష్కారం చూపజాలవు. వ్యక్తుల భావజాలంలో లింగ సమానత్వ భావన బలోపేతం అయిన రోజునే సాధ్యం అవుతుంది.

Rudraraju
రుద్రరాజు శ్రీనివాసరాజు
9441239578
లెక్చరర్‌.ఐ.‌పోలవరం

Leave a Reply