Take a fresh look at your lifestyle.

లాక్‌డౌన్‌ ‌కొనసాగిస్తారా ? ఎత్తివేస్తారా ?

  • సీఎం కేసీఆర్‌ ‌నిర్ణయంపై సర్వత్రా  ఉత్కం ఠ 
  • కొనసాగింపుతో ప్రభుత్వ ఖజానాపై పెనుభారం
  • ఆదాయ వనరులపై దృష్టి.. దశలవారీగా ఎత్తివేసే యోచనలో సీఎం ?

తెలంగాణ రాష్ట్రంలో మే 7 తరువాత లాక్‌డౌన్‌ ‌కొనసాగిస్తారా ? ఎత్తివేస్తారా ? ప్రస్తుతం రాష్ట్ర ప్రజలందరిలోనూ ఇదే చర్చ. కొరోనా వైరస్‌ ‌కట్టడికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ ‌మే 3తో ముగియనుంది. ఈ నేపథ్యంలో దీనిని కొనసాగించాలా ? వద్దా ? అనే అంశంపై నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఒడిషా, అసోం, మేఘాలయ, గోవా రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రమే తమ రాష్ట్రాలలో లాక్‌డౌన్‌ను మరో నెల రోజుల పాటు పొడిగించాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. అయితే, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ‌మాత్రం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ‌కొనసాగించాలా ? ఎత్తివేయాలా ? అనే దానిపై ఎలాంటి అభిప్రాయమూ వ్యక్తం చేయలేదని తెలిసింది. దీంతో కేసీఆర్‌ ‌లాక్‌డౌన్‌ ‌పొడిగింపుకు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ‌మే 3 వరకు కొనసాగుతుందని ప్రధాని ప్రకటించినప్పటికీ సీఎం కేసీఆర్‌ ‌మాత్రం ఆ గడువును మే 7 వరకు పొడిగించారు. అయితే, తాజాగా రాష్ట్రంలో కరోనా వైరస్‌ ‌కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. శని, ఆదివారాలలో కేవలం 18 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో రానున్న రోజుల్లోనూ పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య ఇదే మోస్తరులో కొనసాగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం లాక్‌డౌన్‌కు కచ్చితంగా అమలు చేయడం, కంటైన్మెంట్‌ ‌జోన్లలో ప్రజలను ఎక్కడికక్కడ కట్టడి చేయడం వంటి చర్యలు సత్పలితాలనిస్తున్నాయి. ఆదివారం రాత్రి నాటికి రాష్ట్రంలో కొరోనా కేసుల సంఖ్య 1001కి చేరినప్పటికీ క్రమక్రమంగా వైద్య చికిత్సలతో కోలుకుని డిశ్చార్జి అవుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ‌గడువు ముగిసే మే 7 నాటికి కొరోనా కేసులు అతి తక్కువ సంఖ్యలో ఉంటాయనీ, అప్పుడు లాక్‌డౌన్‌ ‌కొనసాగించాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్‌ ‌భావిస్తున్నారని సమాచారం. అందుకే పీఎంతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్‌ ‌తెలంగాణలో మరోమారు లాక్‌డౌన్‌ను కొనసాగించా)ని విజ్ఞప్తి చేయలేదని తెలిసింది.

- Advertisement -

మరోవైపు, రాష్ట్రంలో దాదాపు 40 రోజులుగా కొరోనా కారణంగా లాక్‌డౌన్‌ ‌కొనసాగుతోంది. దీంతో ప్రభుత్వ ఖజానాపై పెను భారం పడింది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాకపోగా, రాష్ట్రంలోని నిరుపేదలను, వలస కార్మికులను ఆదుకునేందుకు తీసుకుంటున్న చర్యలలో భాగంగా షెల్టర్‌ ‌జోన్ల ఏర్పాటు, నగదు పంపిణితో మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా తయారైంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. మిగతా రాష్ట్రాలు ప్రధాని మోదీని కోరిన విధంగా మరో నెల పాటు లాక్‌డౌన్‌ను కొనసాగిస్తే ఆ ప్రభావం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపిస్తుంది. కాగా, లాక్‌డౌన్‌ ‌కారణంగా రాష్ట్రం భారీ స్థాయిలో ఆదాయాన్ని కోల్పోగా కేంద్రం ఆ నష్టాన్ని పూడుస్తుందన్న ఆశ ఏమాత్రం కూడా లేదు. లాక్‌డౌన్‌ ‌కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ కేంద్రానికి ఇప్పటి వరకు సీఎం కేసీఆర్‌ ‌రెండుమూడు లేఖలు రాసినప్పటికీ ఆశించిన స్పందన రాలేదు. దీంతో కేంద్రాన్ని ఆదుకోవాలని కోరి నిరాశ చెందే బడులు రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దుకుని క్రమంగా ఆర్థిక వ్యవస్థను గాడిన పడేసేలా చర్యలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ ‌యోచిస్తున్నట్లు సమాచారం. ఎలాగూ రాష్ట్రంలో మరో పది రోజుల పాటు లాక్‌డౌన్‌ ‌కొనసాగుతుంది కాబట్టి అప్పటి వరకు కొరోనా నియంత్రణలోకి వచ్చి పరిస్థితులు అనుకూలించిన పక్షంలో మే 7 తరువాత రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తి వేయడమే మంచిదన్న అభిప్రాయంతో సీఎం కేసీఆర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా లాక్‌డౌన్‌ను ఒకేసారి ఎత్తివేయకుండా పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపాదించిన విధంగా 25:50:25 ప్రాతిపదికన ఎత్తి వేస్తే ఎలా ఉంటుందనే విషయంపై కూడా సీఎం కేసీఆర్‌ ఆలోచిన్తున్నట్లు సమాచారం. అంటే ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని సమకూర్చి పెట్టే శాఖలలో పరిమిత స్థాయిలో నిబంధనలు విధించడం, ఆ తరువాత రాష్ట్రంలో పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత రంగాలపై ఆంక్షలు ఎత్తివేయడం, చివరగా సినిమా థియేటర్లు, మాల్స్‌పై కొద్ది రోజుల పాటు పరిమితులపై కూడా ఆంక్షల సడలింపు అమలు చేస్తే ఎలా ఉంటుందని సీఎం కేసీఆర్‌ ఆలోచిస్తున్నట్లు తెలిసింది.

Leave a Reply