Take a fresh look at your lifestyle.

న్యాయస్థానాల ఉత్తర్వులను గౌరవించరా?

  • మా సహనాన్ని పరీక్షిస్తున్నారు
  • ట్రైబ్యునళ్లను బలహీన పర్చాలనుకోవడం సరికాదు
  • ఖాళీల వ్యవహారంపై సిజెఐ ఎన్‌వి రమణ ఘాటు వ్యాఖ్యలు
  • కేంద్రం తీరుపై సుప్రీమ్‌ ‌కోర్టు ఆగ్రహం
  • రెండు నెలల్లోగా నియామకాలు చేపడతామని తెలిపిన కేంద్రం
  • వారం గడువు ఇస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం వెల్లడి

ట్రైబ్యునళ్లపై సీజేఐ ఎన్వీ రమణ ట్రైబ్యునళ్లపై కేంద్రం చేసిన కొత్త చట్టంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీమ్‌ ‌కోర్టు తీర్పులంటే కేంద్రానికి గౌరవం లేదన్నారు. తమ సహనాన్ని పరీక్షిస్తున్నారని అన్నారు. కేంద్రం చేసిన కొత్త చట్టం గతంలో తాము రద్దు చేసిన చట్టం లాంటిదేనని ఆయన అభిప్రాయపడ్డారు. కొత్తగా మరొకటి చేయాల్సిన అవసరం ఏముందని ఎన్వీ రమణ ప్రశ్నించారు. ట్రైబ్యునళ్లలో ఖాళీలు, నియామకాల వ్యవహారంలో కేంద్రం తీరుపై సుప్రీమ్‌ ‌కోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది. న్యాయస్థానం తీర్పులు, ఉత్తర్వులను కేంద్రం గౌరవించడం లేదని ఆగ్రహించింది. ప్రభుత్వం తమ సహనాన్ని పరీక్షిస్తుందని మండిపడింది. ఇక తమ వద్ద కొన్ని ఆప్షన్లు మాత్రమే ఉన్నాయని, వారంలోగా కేంద్రం తమ తీరు మార్చుకోవాలని స్పష్టం చేసింది. ట్రైబ్యునళ్లలో నియామకాలకు సంబంధించిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.‌వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. నేషనల్‌ ‌కంపెనీ లా ట్రైబ్యునల్‌ ‌నేషనల్‌ ‌కంపెనీ లా అప్పీలేట్‌ ‌ట్రైబ్యునల్‌ ‌వంటి కీలక ట్రైబ్యునళ్లలో ఖాళీలున్నాయి.

ఇవి దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా కీలకమైనవి. వీటితో పాటు సాయుధ బలగాలు, వినియోగదారులకు సంబంధించిన ట్రైబ్యునళ్లలోనూ చాలా ఖాళీలు ఉన్నాయి. దీని వల్ల అనేక కేసుల్లో పరిష్కారం లభించక వాయిదాలు వేయాల్సిన పరిస్థితి వొస్తుందని ధర్మాసనం పేర్కొంది. దీనికి కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్‌ ‌జనరల్‌ ‌తుషార్‌ ‌మెహతా స్పందిస్తూ..రెండు నెలల్లోగా నియామకాలు చేపడతామని తెలిపారు. దీంతో ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. గత రెండేళ్ల నుంచి ట్రైబ్యునళ్లలో ఖాళీలు ఉన్నాయి. ఇప్పటివరకు ఒక్క నియామకం కూడా చేపట్టలేదు. నియమాకాలు చేపట్టకుండా మిరు ట్రైబ్యునళ్లను బలహీనపరుస్తున్నారు. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలు, ఉత్తర్వులను కేంద్రం గౌరవించట్లేదు. ఇది చాలా విచారకరం. మేం కేంద్రంతో ఘర్షణకు దిగాలనుకోవడం లేదు. కానీ మిరు మా సహనాన్ని పరీక్షిస్తున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో తమ వద్ద కేవలం మూడు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయని చీఫ్‌ ‌జస్టిస్‌ ఎన్‌.‌వి. రమణ.. సొలిసిటర్‌ ‌జనరల్‌ ‌తుషార్‌ ‌మెహతాకు తెలిపారు.

కేంద్రం తెచ్చిన ట్రైబ్యునళ్ల సంస్కరణల చట్టంపై స్టే ఇవ్వడం, ట్రైబ్యునళ్లను రద్దు చేసి హైకోర్టులకు అధికారాలివ్వడం, కోర్టు స్వయంగా ట్రైబ్యునళ్లలో నియామకాలు చేపట్టడం.. వీటితో పాటు కేంద్రంపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టే ఆప్షన్‌ను కూడా పరిగణించాల్సి వొస్తుందని సీజేఐ హెచ్చరించారు. ట్రైబ్యునళ్లలో నియామకాలు చేపట్టేందుకు వారం గడువు కల్పిస్తున్నట్లు సుప్రీమ్‌ ‌కోర్టు వెల్లడించింది. కేంద్రం అనుసరిస్తున్న విధానాన్ని ఆయన నేరుగా తప్పుబట్టారు. సుప్రీమ్‌ ‌కోర్టు తీర్పులంటే కేంద్రానికి గౌరవం లేదా అని తీవ్రంగా మందలించారు. తమ సహనాన్ని పరీక్షిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనే ట్రైబ్యునల్స్‌కు సంబంధించిన చట్టాన్ని తాము కొట్టివేయగా. మరో చట్టం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కేంద్రాన్ని సీజేఐ ప్రశ్నించారు. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. అప్పటికైనా కేంద్రం తమ తీరు మార్చుకుంటుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది.

Leave a Reply