Take a fresh look at your lifestyle.

కంది రైతుల గోస పట్టదా? సీఎం కేసీఆర్‌కు ఎంపీ రేవంత్‌ ‌బహిరంగ లేఖ

peerzaguda, trs party leader, congress party, revanth reddy 

టీఆర్‌ఎస్‌ ‌నాయకుల అండదండలతో కందుల కొనుగోళ్ల విషయంలో బ్లాక్‌ ‌మార్కెట్‌ ‌మాఫియా రంగ ప్రవేశం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయని మల్కాజ్‌గిరి ఎంపి ఎ.రేవంత్‌ ‌రెడ్డి ఆరోపించారు. రైతులు దిక్కులేని పరిస్థితుల్లో ప్రైవేటు వ్యాపారులకు ఐనకాడికి అమ్ముకునే నిస్సహాయతను ప్రభుత్వమే కల్పిస్తోందని విమర్శించారు. ఈమేరకు గురువారం రేవంత్‌ ‌రెడ్డి రాష్ట్రంలో కంది రైతుల దుస్థితిపై సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో కంది రైతులు రోడ్డెక్కారనీ, పండించిన పంట కొనకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల వద్ద కందులు కొనుగోలు చేయడానికి అధికారులు చెబుతున్న నిబంధనలు విచిత్రంగా ఉన్నాయనీ, నువ్వు రైతువేనా ? నువ్వే పండించావని గ్యారంటీ ఏమిటి ? ఆ కందులు నీ పొలంలోనే పండాయని రెవెన్యూ అధికారుల వద్ద సర్టిఫికెట్‌ ‌తీసుకురా..నీ పేరు ఆన్‌లైన్‌లో లేదు కనుక నీ కందులు కొనేది లేదని యక్ష ప్రశ్నలతో చిత్రవిచిత్ర ప్రశ్నలతో రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారని పేర్కొన్నారు. చరిత్రలో ఏనాడూ ఒక రైతుకు తాను రైతునే అని రుజువు చేసుకోవాల్సిన ఆగత్యం పట్టి ఉండదనీ, ఆ ఘనత మీ పాలనకే దక్కిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కంది పంట విస్తీర్ణం, దిగుబడిపై ప్రభుత్వం వద్ద సరైన అంచనాలు లేవన్న విషయం పరిస్థితి చూస్తే అర్థమవుతున్నదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం తప్పుడు అంచనాలు పంపడం వల్లనే వాళ్లు కేవలం 47,500 టన్నులు మాత్రమే కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. దీంతో ఒక్కో రైతు నుంచి పది క్వింటాళ్లకు మించి కొనేది లేదని రైతులు తేల్చి చెబుతున్నారని తెలిపారు. తేమ ఉందని మరికొందరు రైతుల పంటను కొనడం లేదని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పలు కొనుగోలు కేంద్రాలు, మార్కెట్‌ ‌యార్డులులో రైతులు పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదని విమర్శించారు.

క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందోనన్న స్ప•హ లేదనీ, వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడున్నారో తెలియదని ఎద్దేవా చేశారు. మీరు ఘనంగా చెప్పుకునే రైతు సమన్వయ సమితులు అడ్రస్‌ ‌లేవు…దీంతో దిక్కుతోచని స్థితిలో రైతులు రోడ్డెక్కారని పేర్కొన్నారు. ఓవైపు రైతులకు గట్టిగా క్వింటాల్‌కు రూ. 4000 ధర దక్కడం లేదనీ, మరోవైపు మార్కెట్‌లో వినియోగదారుడికి కిలో కందిపప్పు రూ. 150 ధర పలుకుతోందని ఇది ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని చెప్పారు. వికారాబాద్‌, ‌మెదక్‌, ‌సిద్దిపేట, కామారెడ్డి వంటి చోట్ల జిల్లాల్లో రైతులు ఆందోళన చేస్తున్నారని తెలిపారు. సిద్దిపేట లాంటి చోట్ల ముందస్తు సమాచారం లేకుండానే కొనుగోలు కేంద్రాలను మూసివేసినట్లు వార్తలు వచ్చాయన్నారు. ఈనేపథ్యంలో మీరు తక్షణం పరిస్థితిని గమనించండి ట్రంప్‌ ‌విందుకు హాజరై ఆయన కుమార్తె ఇవాంక యోగక్షేమాలు తెలుసుకోవడం కాదు కంది రైతుల పరిస్థితిపై క్షేత్ర స్థాయిలో సమాచారం తెప్పించుకుని సివిల్‌ ‌సప్లై ద్వారా చివరి గింజ వరకు కందులు కొనుగోలు చేయించాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్‌ ‌సారథ్యంలో కార్యాచరణను ప్రకటిస్తామని ఈ లేఖలో రేవంత్‌ ‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply