Take a fresh look at your lifestyle.

ఈసారైనా ఉద్యోగాలొస్తాయా?

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఖాలీ  ఉద్యోగాలను భర్తీ చేయనుందని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చెప్పడంతో నిరుద్యోగుల్లో మళ్ళీ ఆశలు చిగురిస్తున్నాయి. ఈ శుభవార్త కోసం ఎంతో కాలంగా  కొన్ని వేలాది మంది ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ అంశాన్ని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ రావడం, నిరుద్యోగుల్లో నిరాశ ఏర్పడడమన్నది సహజమైపోయింది. గత సంవత్సరాల్లో  ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం అన్ని సిద్దం చేసి ఆఖరి నిముషంలో వాయిదా వేసినట్లు గానే ఈసారి కూడా ఉంటుందా అన్న అనుమానాలు కూడా లేక పోలేదు. గత సంవత్సరం సమగ్ర శిక్ష అభియాన్‌ ‌విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేషన్‌, ‌సిస్టమ్‌ అనలిస్ట్ , అసిస్టెంట్‌ ‌పోగ్రామర్‌ ‌లాంటి 704 పోస్టులను భర్తీ చేసేందుకు  2019 జూన్‌ 11‌న నోటిఫికేషన్‌ ఇచ్చింది. డిసెంబర్‌ 23‌న పరీక్షలు నిర్వహించి, 2020 జనవరి 7న ఫలితాలు ప్రకటించింది. మెరిట్‌ అవార్డులను కూడా జారీచేసింది. అయినా నియామకాలు జరుగలేదు. ఇదే విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న పది వేల మంది తీసుకువచ్చారు. గత ఏడాది ఎమ్మెల్సీ  ఎన్నిక సమయంలో రాష్ట్ర ప్రభుత్వం యాభై వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. కాని దానికి సంబందించి నోటిఫికేషన్‌ ఇచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తున్నది. ఒక వేళ నోటిఫికేషన్‌ ఇచ్చినా అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయని, ఏదో ఒక ఆటంకం తో రోజుల తరబడి నియామకాలు జరుగకుండా పోతున్నాయని నిరుద్యోగులు వాపోతున్నారు.

ఏమైతేనేమి ప్రభుత్వం ఉద్యోగ ఖాలీ ల భర్తీ విషయాన్ని మరోసారి ప్రకటించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ దీనిపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇందుకు హుజురాబాద్‌ ఎన్నికల ప్రభావమే ఉండి ఉంటుందన్న వాదన వినిపిస్తున్నది. హుజురాబాద్‌లో అధికార పార్టీకి ఊహించని గట్టి దెబ్బ తాకింది. ఆ పరాభవాన్ని జీర్ణించుకోలేక పోతున్నది. దాని నుండి ప్రజల దృష్టి మళ్ళించేందుకు తెరాస అనేక కార్యక్రమాల కార్యాచరణను చేపట్టింది. సభలు సమావేశాలతో పాటు ఉద్యోగ నియామకాలను చేపట్టే ప్రక్రియను ప్రారంభిస్తున్నది. ముఖ్యమంత్రి నోటి వెంట అరవయ్యో, డెబ్బయ్యో అని చెప్పినప్పటికీ, చివరకు ఎన్ని పోస్టులను భర్తీ చేస్తారన్నది ప్రశ్నే. ఎందుకంటే నూతన జోనల్‌ ‌వ్యవస్థలో ఉద్యోగాల సర్దుబాటు తర్వాత ఏర్పడే ఖాలీ లను కలుపుకుని భారీ స్థాయిలో నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు కెసిఆర్‌ ‌పేర్కొన్న విషయం తెలియంది కాదు. దానివల్ల ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాల భర్తీ జరుగుతాయన్నది ఇంకా తేలాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఉద్యోగాల భర్తీ విషయంలో గత కొంత కాలంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఉపాధి అవకాశాలను కోల్పోతున్న నిరుద్యోగ యువకులకోసం గత కొంతకాలంగా తెలంగాణ వైఎస్‌ఆర్‌ ‌పార్టీ దీక్షలు చేపట్టిన విషయం తెలిసిందే. అనేక ఖాలీ లున్న రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భర్తీ చేయడంలేదని, ఆ పార్టీ అధినేత వైఎస్‌ ‌షర్మిల తరచూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ దీక్ష శిబిరాలను కొనసాగిస్తున్నది. అలాగే ప్రధాన ప్రతిపక్ష పార్టీలు బిజెపి, కాంగ్రెస్‌కూడా ఈ విషయంలో టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం వెంట బడుతున్నాయి. వాస్తవంగా తెలంగాణ వొచ్చిన తర్వాత తమకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా  ఉంటాయని యువత ఎంతో ఆశించింది. కాని, వారి ఆశలకు తగినట్లుగా ప్రభుత్వం స్పందించకపోవడం వారిలో తీవ్ర నిరాశ, నిస్పృహ ఏర్పడింది. వారి వయస్సు దాటి పోతున్నా ప్రభుత్వ ఉద్యోగాలు లభ్యం కాకపోవడంతో  వందల సంఖ్యలో యువకులు  ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు అనేకం. అసలే నిరుద్యోగం వెన్నాడుతుంటే కొరోనా కారణంగా ప్రైవేటు రంగంలో కూడా ఉపాధి లేకుండా పోయింది. దాదాపు రెండు సంవత్సరాలకు పైగా లాక్‌డౌన్‌ ‌తదితర కారణాలతో ఉన్న ఉపాధి కూడా కొందరు కోల్పోవాల్సి వచ్చింది.

ఏదో ఒక ఉపాధి పొందుతున్న చిరు వ్యాపారులపై కూడా ఇది తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ముఖ్యంగా విద్యారంగం బాగా దెబ్బతిన్నది. పూర్తిగా తొలగిపోని కొరోనా భయం వెన్నంటుండడంతో ప్రైవేటు స్కూళ్ళలో చదువుతున్న విద్యార్దులు ఇప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రభుత్వ పాఠశాలల పైపు మొగ్గు చూపుతున్నారు. దీని వల్ల ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చేరే వారి సంఖ్య పెరిగిపోతున్నది. వాస్తవంగా గతంలోనే ఉపాధ్యాయుల కొరత ఉంది. దాదాపు 20 వేల ఉపాధ్యాయులు అవసరమన్నది ఒక అంచనా. కాని, ప్రభుత్వం తాజాగా భర్తీ చేయనున్న ఉద్యోగాల్లో వారి సంఖ్య ఎంత ఉంటుందో తెలియదు. కావాల్సిన సంఖ్యలో ఉపాధ్యాయులను భర్తీ చేయని పక్షంలో విద్యారంగం మళ్ళీ ఒంటికాలిపై నడిచే ప్రమాదం ఏర్పడుతుంది. అలాగే ప్రభుత్వ కళాశాలల్లో కూడా బోధన సిబ్బంది కొరత ఉంది. వీటిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడితే గాని ఈ రంగాలు కుదుటపడవు.

Leave a Reply