Take a fresh look at your lifestyle.

గాంధీ భవన్‌లో ఉన్న వారిని నిద్ర మేల్కొలిపేవారున్నారా?

2014లో పార్లమెంటులో తీవ్ర గందరగోళం మధ్య  మూజువాణీ వోటుతో ఆంధప్రదేశ్‌ ‌పునర్వ్యవస్థీకరణ బిల్లును ఆమోదించినప్పుడు  కాంగ్రెస్‌ ‌పార్టీకి తెలుగు రాష్ట్రాల్లో మరణశాసనమంటూ నినాదాలు వినిపించాయి. తెలంగాణలో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు డిపాజిట్‌ ‌రాకపోవడం చూస్తే అది నిజమేననిపిస్తోంది. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌ ‌సమైక్య రాష్ట్రంలో పీసీసీ ప్రధాన కార్యాలయంగా ఉండేది. ఇప్పుడు తెలంగాణ పీసీసీకి ప్రధాన కార్యాలయం అక్కడే పని చేస్తోంది. ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఆ కార్యాలయం  దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం వెలువడిన తర్వాత నిర్మానుష్యంగా కనిపించింది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ ‌పార్టీకి ఆ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలో  డిపాజిట్‌ ‌దక్కలేదంటే ఆ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతోంది. దుబ్బాక  తెలంగాణలో అత్యంత వెనకబడిన ప్రాంతం.  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వడం ద్వారా  ఆ ప్రాంత ప్రజల చిరకాల కోర్కెను కాంగ్రెస్‌ ‌తీర్చినప్పటికీ అక్కడ కనీసం ఆ పార్టీకి డిపాజిట్‌  ‌రాకపోవడం కాంగ్రెస్‌ ‌పార్టీని మేల్కొలిపే హెచ్చరికే. ఈ ఫలితాన్ని కాంగ్రెస్‌ ‌నాయకులు సమీక్షించుకుని ఆత్మపరిశీలన చేసుకోవల్సిన అవసరం ఉంది.

పీసీసీ నాయకత్వం, పార్టీ నాయకులు ఏనాడూ ఆత్మవిమర్శ చేసుకున్నట్టు లేదు. తెలంగాణ ఇచ్చిన పార్టీ పట్ల ప్రజలు ఎందుకంత నిరాసక్తంగా ఉన్నారని పార్టీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకున్న దాఖలాలు లేవు. సర్పంచ్‌, ఎం‌పీటీసీ, జెడ్‌పీటీసీ, మునిసిపల్‌  ‌వంటి చిన్న ఎన్నికల్లో సైతం గెలుపొందలేని స్థితిలో కాంగ్రెస్‌ ఉం‌ది. దీనిని బట్టి తెలంగాణ వోటరుకు ఇంతకన్నా వేరే ప్రాథమ్యాలు, ఆశిస్తున్న అంశాలు ఉన్నాయన్న మాట. తెలంగాణ వోటర్లు ఎందుకింత ఎడముఖంగా ఉన్నారని పీసీసీ ఎన్నడూ ఆత్మవిమర్శ చేసుకోలేదు. తన వైఖరిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయలేదు. పార్టీని పునర్వ్యవస్థీకరించే సామర్థ్యం టీపీసీసీకి లేదనే విషయంపై రాష్ట్రంలో చర్చ తీవ్రంగా జరుగుతోంది. అయితే, టీపీసీసీ సామర్థ్యాన్ని మాత్రమే వేలెత్తి చూపడం సరైనది కాదు. ఇది వాస్తవాన్ని వక్రీకరించడమే. పార్టీలో వందమాదిగల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదనే వాస్తవాన్ని ఇప్పటికైనా గుర్తించాలి, పార్టీని అట్టడుగు స్థాయి నుంచి నిర్మాణం చేయాలి. క్షేత్ర స్థాయిలో ప్రజలను ఆకర్షించే రీతిలో కార్యక్రమాలను చేపట్టాలి. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ ‌పార్టీయేనని ప్రజలకు తెలియజేయడంలో నాయకత్వం విఫలమైంది. తెలంగాణ ఉద్యమం సందర్భంగా వివిధ వర్గాలను కూడగట్టుకున్న పార్టీ ఇప్పుడు ఆ వర్గాలకు దూరం అయింది. పార్టీ కార్యక్రమాల్లో సమన్వయం లేకపోవడం, వివిధ వర్గాల మధ్య ఐక్యత లేకపోవడం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న లోపం. ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు ఇచ్చిన వాగ్దానాలను అమలు జరపకపోవడంపై ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేసే కార్యక్రమాన్ని పీసీసీ చేపట్టలేకపోతోంది.

గడిచిన ఆరేళ్ళుగా కాంగ్రెస్‌ ‌చేస్తున్న నినాదం ఏమిటంటే, సోనియా త్యాగం గురించే. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ, ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ ఓటమి వల్ల తేలిందేమిటంటే, ప్రజలకు ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేయడంలో కాంగ్రెస్‌ ‌విఫలమైందని. ఇలాంటి పరిస్థితుల్లో అదే పనిగా పాత పద్ధతిలో ప్రచారం చేయడం వల్ల ప్రయోజనం లేదని తేలుతోంది. మరో వంక బీజేపీ దుబ్బాక ఉప ఎన్నికలో పార్టీ యంత్రాంగాన్ని రంగంలోకి దింపి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో కృతకృత్యురాలైంది. దుబ్బాకలో సాధించిన విజయంతో గ్రేటర్‌ ‌మునిసిపల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్త పర్చేందుకు సిద్ధమవుతోంది. బీజేపీ తన అజెండాలో అతి ముఖ్యమైన హిందూ అజెండాపైన కాకుండా ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను అస్త్రాలుగా చేసుకుని ప్రచారాన్ని నిర్వహిస్తోంది. కాంగ్రెస్‌ ‌బీజేపీ నుంచి తెలుసుకోవల్సింది ఇది. ఒక్కొక్క రౌండ్‌లో  800 వోట్లను కూడా కాంగ్రెస్‌ ‌సాధించలేకపోవడం ఆ పార్టీ యంత్రాంగం బలహీనతను చాటుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం నేపథ్యంలో బీజేపీ తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు సర్వశక్తులను ఒడ్డుతోందన్న విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు ప్రథమ స్థానంలో ఉన్న కాంగ్రెస్‌ ‌మూడో స్థానంలోకి నెట్టివేయబడింది. కాంగ్రెస్‌ ‌ప్రజలకు చేరువ కావడానికి ప్రయత్నించకపోతే తెలంగాణలో తెరాసకు బీజేపీనే ప్రత్యామ్నాయంగా ప్రజలు పరిగణించే అవకాశం ఉంది. ఆ పరిస్థితి రాకుండా కాంగ్రెస్‌ ఆత్మావలోకనం చేసుకోవడం ఎంతైనా అవసరం. కాంగ్రెస్‌ ‌శ్రేణులు గాఢనిద్రలో ఉన్నట్టు కనిపిస్తోంది. గాంధీ భవన్‌లో ఉన్న వారిని లేపేవారెవరైనా ఉన్నారా?.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply