- కేసులు నమోదైతే ప్రభుత్వమే చెబుతుంది
- ప్రజారోగ్య సంచాలకుడు డా.శ్రీనివాస్ రావు
కొరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్‌పై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని ప్రజారోగ్య శాఖ సంచాలకుడు డా.జి.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం డెల్లా వేరియంట్ కేసులు మాత్రమే ఉన్నాయనీ కొత్త కేసులు నమోదైతే ప్రభుత్వమే నేరుగా ప్రకటిస్తుందని తెలిపారు. మంగళవారం డీహెచ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగిందనీ, ఈ అంశంపై సీఎం కేసీఆర్ స్వయంగా వైద్యారోగ్య శాఖ అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారని చెప్పారు.
దేశంలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదనీ, దక్షిణాప్రికా, బోట్స్వానాలో మాత్రమే వెలుగు చూసినట్లు వెల్లడైందన్నారు. ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇప్పటికే 12 దేశాల నుంచి వొచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించిందన్నారు. విదేశాల నుంచి వొచ్చే వారికి మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీపిసిఆర్ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహిస్తామనీ, పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ అయితే వెంటనే హాస్పిటల్‌కు తరలిస్తామని చెప్పారు. గత వారం రోజులుగా మాత్రమే ఒమిక్రాన్ కేసులు వెలుగు చూస్తున్నాయనీ, అప్పటి నుంచి ఆయా దేశాల నుంచి రాష్ట్రానికి 12 దేశాల నుంచి 40 మందికి పైగా ప్రయాణికులు వొచ్చారని తెలిపారు.
వారందరికీ పరీక్షలు నిర్వహించామనీ, వాటిలో నెగటివ్ రావడతో హోమ్ క్వారంటైన్‌కు తరలించామని వివరించారు. అయితే, వారి ఆరోగ్యంపై 14 రోజుల పాటు నిఘా ఉంచుతున్నామనీ ఏదైనా అనుమానం వొస్తే వెంటనే హాస్పిటల్‌కు తరలిస్తామని చెప్పారు. ఒమిక్రాన్ .డెల్లా వైరస్ కంటే 6 శాతం ఎక్కువ వేగంగా వ్యాపిస్తున్నట్లు పరిశోధనల్లో వెల్లడైందన్నారు. అయితే, వ్యాధి తీవ్రత తక్కువ ఉన్నట్లు గుర్తించారని పేర్కొన్నారు. కొరోనాకు సంబంధించి ఎన్ని మ్యుటేషన్లు వొచ్చినా మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి ముందు జాగ్రత్తలను పాటిస్తే మనల్ని మనం కాపాడుకోవచ్చని డా.శ్రీనివాసరావు స్పష్టం చేశారు.