Take a fresh look at your lifestyle.

హోం ఐసోలేషన్‌లో రెమ్‌డెసివర్‌ ‌తీసుకోరాదు

  • వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకోవాలి
  • ఎయిమ్స్ ‌చీఫ్‌ ‌రణ్‌దీప్‌ ‌గులేరియా స్పష్టీకరణ
  • విదేశాల నుంచి డ్రగ్‌ ‌దిగుమతికి కేంద్రం నిర్ణయం

కొరోనాకు ఇంట్లో ఉండి చికిత్స తీసుకుంటున్న వారు యాంటీవైరల్‌ ఇం‌జక్షన్‌ ‌రెమ్‌డెసివిర్‌ను తీసుకోవద్దని ఎయిమ్స్ ‌చీఫ్‌ ‌డాక్టర్‌ ‌రణ్‌దీప్‌ ‌గులేరియా సూచించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రెమ్‌డెసివిర్‌ను తీవ్రంగా ఉన్న కేసుల్లో మాత్రమే ఇస్తామని, కాబట్టి ఇంటి వద్ద ఉండి చికిత్స తీసుకుంటున్న వారు దానిని తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రెమ్‌డెసివిర్‌ను వైద్య నిపుణుడి సమక్షంలో ఆసుపత్రిలో మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కొరోనా సోకి హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు దాని నుంచి ఎప్పుడు బయటకు రావాలన్న ప్రశ్నకు డాక్టర్‌ ‌గులేరియా స్పందిస్తూ.. లక్షణాలు లేకుండా కనీసం పది రోజులు గడిచిన తర్వాత, మూడు రోజులపాటు ఎలాంటి జ్వరం లేకుంటేనే హోం ఐసోలేషన్‌ను విడిచిపెట్టాలన్నారు.

హోం ఐసోలేషన్‌ ‌గడువు ముగిసిన తర్వాత మళ్లీ పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదన్నారు. డాక్టర్‌ ‌సలహా మేరకే సిస్టమాటిక్‌ ‌స్టెరాయిడ్స్‌ను వేసుకోవాలని డాక్టర్‌ ‌గులేరియా వివరించారు. ఇదిలావుంటే ప్రస్తుతం రోజురోజుకూ దేశవ్యాప్తంగా కొరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యాంటీ వైరల్‌ ‌డ్రగ్‌ ‌రెమిడెసివిర్‌కు తీవ్ర డిమాండ్‌ ఏర్పడింది. కొరోనా చికిత్సలో ఈ రెమిడెసివిర్‌ ‌కీలకంగా పనిచేస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా దీని కొరత పెరిగిపోతోంది. ఈ కొరతను నివారించేందుకు కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ డ్రగ్‌ను విదేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకోవాలని నిర్ణయించుకుంది. 4.5 లక్షల డోసుల రెమిడెసివిర్‌ను పలు కంపెనీల నుంచి దిగుమతి చేసుకుంటోంది. మొదటి విడతగా 75 వేల రెమిడెసివిర్‌ ‌వయల్స్‌ను ఈ రోజు (శుక్రవారం) దిగుమతి చేసుకోనుంది. దేశీయ హెచ్‌ఎల్‌ఎల్‌ ‌లైఫ్‌కేర్‌ ‌లిమిటెడ్‌, అమెరికాకు చెందిన గిలియడ్‌ ‌సైన్సెస్‌, ఈజిప్టుకు చెందిన ఇవా ఫార్మా సంస్థల నుంచి వీటిని కొనుగోలు చేయనుంది. అలాగే దేశీయంగా కూడా దీని ఉత్పత్తిని పెంచనుంది. ఇప్పటికే ఏడు దేశీయ కంపెనీలు తమ ఉత్పత్తిని నెలకు 38 లక్షల వయల్స్ ‌నుంచి 1.03 కోట్ల వయల్స్‌కు పెంచాయి.

Leave a Reply