Take a fresh look at your lifestyle.

ఇర్విన్‌ ‌రిజర్వాయర్‌ ‌వద్దు.. కెనాలే ముద్దు

  • ప్రతిపాదనను విరమించుకోవాలని రైతుల వేడుకోలు
  • రిజర్వాయర్‌ ‌నిర్మిస్తే ఆందోళన చేస్తామంటున్న అన్నదాతలు
  • తమ భూములు లాక్కుంటే..తగిన శాస్త్రి తప్పదని హెచ్చరిక

ఆమనగల్లు, మే 30(ప్రజాతంత్ర విలేఖరి) : బీడు భూములను సాగులోకి తీసుకొరావాలనే సదుద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రాజేక్టులను నిర్మించి కెనాల్‌ ( ‌కాల్వల) ద్వారా సాగు నీరు అందించేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా అవి ఆశించిన ఫలితాలు ఇవ్వడంలేదు. దీనిలో భాగంగానే డిండి ప్రాజేక్టు ద్వారా కాల్వలను తవ్విన ప్రభుత్వం పనులను మధ్యలోనే నిలిపి వేశారు. వెల్దండ, మాడ్గుల మండలంలోని అజిలాపురం, ఇర్విన్‌, ‌నల్లచెర్వు గ్రామాల పరిసర ప్రాంతాల పోలాలను రైతుల వద్ద కొనుగోలు చేసి పెద్ద ఎత్తున కాల్వలు తవ్వారు. నల్లగొండ జిల్లా శివన్నగూడేం వరకు సాగు నీరు తీసుకెళ్లేందుకోసం ఇర్విన్‌ ‌శివారు ప్రాంతంలో సుమారు 11 వందల ఎకరాలలో రిజర్వాయర్‌ ‌నిర్మించేందుకు కొత్తగా ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం, విషయం తెలుసుకున్న  రైతులు తమ భూములు కోల్పోతామనే ఆందోళనతో ఉన్నారు.

రిజర్వాయర్‌కు భూములు లాక్కుంటే తమ బతుకులు, పిల్లల బతుకులు రోడ్డున పడే అవకాశం ఉన్నదని, ప్రభుత్వం రిజర్వయర్‌ ‌ప్రతిపాదనను విరమించుకోవాలని రైతులు వేడుకుటున్నారు. ఈ ప్రాంతానికి చెందిన కొంత మంది అధికార పార్టీ నాయకులు కావాలని రిజర్వయర్‌ ‌నిర్మాణం చేపటేందుకు సన్నాహాలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఒక వేళ రిజర్వాయర్‌ ‌నిర్మించాలనుకుంటే పక్కనే ఉన్న రెండు కొత్త చెర్వులలో నిర్మించుకోవచ్చని అన్నారు. ఈ ప్రాంతంలో సన్న చిన్నకారు రైతులే అధికంగా ఉన్నారని, వీరందరు బడుగుబలహీన వర్గాలకు చెందిన రైతులేనని, ఈ వ్యవసాయ భూములలో 25వేల తాటి, ఈత వనాలు ఉన్నాయని, దాదాపుగా 3వందల గీత కార్మికుల కుటుంబాలు నష్టపోతారని, వారికి ఉపాధి దూరమవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం గుడ్డిగా ప్రతిపాదనలు అమలు చేస్తే తాము ఆందోళన బాట పట్టాల్సివస్తుందని రైతులు హెచ్చరించారు. ఇటీవల మాజీ ఐపీఎస్‌ అధికారి బీఎస్‌పీ అధినేత డా. ప్రవీణ్‌కుమార్‌ అజిలాపురం, ఇర్విన్‌ ‌ప్రాంతాలలో నిర్మించిన కాల్వలను పరిశీలించారు. రిజర్వాయర్‌ ‌ప్రతిపాదన విరమించుకోవాలని వెంటనే డిండి ప్రాజేక్టు ద్వారా రైతుల పంటపొలాలకు సాగు నీరు అందించాలని కోరారు. రైతుల పక్షాన బీఎస్‌పీ పోరాటానికి సిద్దమౌతుందని హెచ్చరించారు.

రిజర్వయర్‌ ‌ప్రతిపాదనను విరమించాలి
ఇర్విన్‌ ‌గ్రామ సమీపంలోని సన్న చిన్న కార రైతుల పంటపొలాల్లో రిజర్వయర్‌ ‌నిర్మించే ప్రతిపాదనను విరమించుకోవాలని అజిలాపురం గ్రామానికి చెందిన గీతాకార్మికుడు బారిమగౌడ్‌ అన్నారు. ఈ పొలాల్లో 25వేల ఈత, తాటీ వనాలు ఉన్నాయని, ఈ భూములు తీసుకుంటే  దాదాపు 6వందల గీతా కార్మికుల కుటుంబాలు రోడ్డున పడతాయని అన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రిజర్వాయర్‌ ‌ప్రతిపాదన విరమించుకోవాలని కోరారు.
– బారిమ గౌడ్‌
‌గీతా కార్మికుడు

కాల్వల ద్వారానే సాగు నీరు అందించాలి
డిండి ప్రాజేక్టు ద్వారా కాల్వల ద్వారానే సాగు నీరు అందించాలని, ప్రభుత్వం కొత్తగా ఇర్విన్‌లో రిజర్వాయర్‌ ‌నిర్మాణానికి చేస్తున్న ప్రతిపాదనలను విరమించుకోవాలని ఇర్విన్‌ ‌గ్రామానికి చెందిన రైతు భూపేష్‌ అన్నారు. తాత ముత్తాతల కాలం నుంచి సన్న, చిన్న కార రైతులు ఈ భూములలో పండిన పంటలపైనే ఆధారపడి జీవిస్తున్నారని, తాము భూములు ఇవ్వటానికి సిద్ధంగా లేమని అన్నారు. రిజర్వాయర్‌ ‌నిర్మిస్తే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
– భూపేష్‌,  ‌రైతు

Leave a Reply