కోవిడ్ వ్యాక్సినేషన్‌కు కేంద్రం మార్గదర్శకాలు
నేటి నుంచి దేశవ్యాప్తంగా కొరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం మార్గదర్శకాలను జారీ చేసింది. ఈమేరకు వ్యాక్సినేషన్ సమయంలో చేయాల్సినవి, చేయకూడనివి చెబుతూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. కచ్చితంగా 18 ఏళ్లకు పైబడిన వారికి మాత్రమే టీకా ఇవ్వాలనీ, కోవిడ్ 19 వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్‌లో గర్భవతులు, బాలింతలను భాగం చేయలేదని పేర్కొంది. కోవిడ్ టీకాలను మార్చుకునేందుకు అనుమతి ఉండదనీ, లబ్దిదారులు రెండు రకాల టీకాలు వేసుకోవద్దని స్పష్టం చేసింది. ఏ కంపెనీ టీకా అయితే మొదటి డోసు వేసుకుంటారో అదే టీకా రెండో డోసులో తీసుకోవాలని తెలిపింది.
అత్యవసర పరిస్థితుల్లో వ్యాక్సిన్ ఉపయోగం గురించి లేఖలో వివరించింది.యాంటీబాడీలు లేదా ప్లాస్మా చికిత్స తీసుకున్న రోగులకు, ఇతర జబ్బుల కారణంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు, హాస్పిటల్స్‌లో చికిత్స పొందే రోగులకు, వారు కోలుకున్న నాలుగు నుంచి ఎనిమిది వారాల తరువాత మాత్రమే కోవిడ్ టీకా ఇవ్వాలని పేర్కొంది. ఒకవేళ ఇతర టీకాలు తీసుకోవాల్సి వస్తే కోవిడ్ టీకాలు, వాటికి కనీసం 14 రోజుల వ్యవధి ఉండాలని తెలిపింది. టీకా తీసుకునే వ్యక్తులకు మందులు, టీకా, ఆహార పదార్థాల అలర్జీ ఉందేమో తెలుసుకోవాలనీ, అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. టీకా తీసుకున్న తరువాత ఏదైనా నొప్పి లేదా బాధగా అనిపిస్తే పారాసెటమాల్ తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన మార్గదర్శకాలలో స్పష్టం చేసింది.