Take a fresh look at your lifestyle.

ఆత్మహత్యలు వద్దు ! పోరాటాలతో సాధిద్దాం..

తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి యావత్తు సమాజాన్ని ఆలోచింపజేసేలా ఒక సంఘటన పునరావృతం అయిందని చెప్పవచ్చు. మహబూబాబాద్‌ ‌జిల్లా, గూడూరు మండలంలోని రాంసింగ్‌ ‌తండాకు చెందిన బోడ సునీల్‌ ‌నాయక్‌ ఆత్మహత్య ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురిచేస్తుంది. అతని వాంగ్మూలం ప్రకారం ఐఏఎస్‌ ‌కావాలనే లక్ష్యం ఎలా మారిపోయిందో నిరుద్యోగులను ఆలోచింపజేసిందని చెప్పవచ్చు. దీనిని ఆత్మహత్య అనాలా ? రాజ్యంచేసిన హత్యా అనాలా ? ప్రస్తుతం నిరుద్యోగుల పాలిట శాపం అనాలా ? పాలకుల అసమర్థత కారణమా ? ఏకోణంలో చూడాలో తెలియని పరిస్థితి. ఈ సంఘటన కొత్తది కాకపోయినా భవిష్యత్తు తలుచుకుంటే భయమేయక మానని పరిస్థితి. ఇది ఒక దురదృష్టకరమైన పరిణామం, ఇలాంటి సంఘటనలకు పాల్పడకూడదు. ముమ్మాటికీ ఇది తప్పే! అని అందరికీ తెలుసు కానీ నిరుద్యోగ నిర్మూలనకు పాటుపడనంత కాలం ఇలాంటి పరిణామాలే చోటుచేసుకుంటాయి. ఒక్కసారి క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఒకనిరుద్యోగి పడే కష్టాలను ప్రత్యక్షంగా చవిచూసినప్పుడే పరిస్థితి అవగతమవుతుంది. జరగరానిది జరిగినప్పుడు అందరూ ఏకమై ప్రగల్భాలు పలుకుతున్నారు కాని శాశ్వత పరిష్కారం చూపేదేన్నడు? ఏదిఏమైనా మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఇలాంటి నిర్ణయాలు తీసుకొని కనిపెంచిన వారి కడుపుకోతకు గురై కుటుంబాలను బజారున పడవేయకూడదు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవిస్తే అందరికీ కొలువులు వస్తాయని, ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి దాదాపు 1200 మందికిపైగా ఆత్మబలిదానాలు చేసుకుంటేగానీ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించలేదు. దాదాపు ఏడు సంవత్సరాలకాలం గడిచినా కనీసం అమరవీరుల గురించి పట్టించుకునే నాథుడే లేనప్పుడు నిరుద్యోగుల గురించి ఇంకెవ్వరు పట్టించుకుంటారు? ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇటీవల పిఆర్సి రిపోర్టు ప్రకారం 1.92 లక్షల ఉద్యోగాలు ఖాళీలున్నాయి. 2014 ఎన్నికలయ్యాక జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాలలో సీఎం కేసీఆర్‌ ఉద్యోగాలపైన ప్రకటనచేస్తూ, రాష్ట్రంలో 1.7 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలున్నాయని ప్రకటించి, త్వరలో ఉద్యోగనియామకాలు ప్రకటిస్తామని హామీఇచ్చారు. ఈ ఏడు సంవత్సరాలలో ఉద్యోగవిరమణ పొందిన ఉద్యోగులు ఎందరు? నూతన జిల్లాలు, గ్రామపంచాయతీలు ఏర్పడ్డాక అందులో ఖాళీగా ఉన్నా ఉద్యోగాలు ఎన్ని? వేటికీ లెక్కలు ఉండవు. కానీ, ఉద్యోగుల జీతాల పెంపు, వయోపరిమితి పెంపుకు పూనుకుంటారు. ఈ విషయంలో కోపంలేదు కానీ ప్రస్తుతం అన్ని శాఖలలో అన్నిరకాల ఉద్యోగ ఖాళీలను అంచనావేస్తే ఉన్న దాదాపు ఆరులక్షలకు పైగానే ఖాళీల నింపడంలో ఎందుకు ఆ సాహసం చేయలేకపోతున్నారో అర్థం కావడంలేదు. దీనికితోడు నిరుద్యోగభృతి ఇసాకతమని హామీ ఇచ్చి కూడా 3 ఏళ్లు గడిచినా ఆ ఊసేలేదు. ఉద్యోగ నియామకాలు చేపడితే భృతికూడా అవసరం లేదు. విద్యార్థులు, నిరుద్యోగులులేని తెలంగాణ ఉద్యమాన్ని ఊహించగలరా? అంటే జవాబులేని ప్రశ్నగానే మిగిలిపోతుంది.

సమాజంలో ఎవ్వరైనా అత్యున్నత చదువులు చదువుకోవడానికి పూనుకోని ఎన్నో అవరోధాలను అధిగమించి పూర్తిచేస్తున్నారంటే కారణం ఉపాధి అవకాశాలనుపొంది, గౌరవ ప్రదమైన జీవితం గడుపుతూ, పలువురికి ఆదర్శంగా నిలవాలనే కోరికతోనే. అంతే తప్ప మరొకటి కాదన్నది వాస్తవం. అలాంటిది గత ఏడాది మే18న మహబూబాబాద్‌ ‌జిల్లా, మర్రిపెడ మండలం, తాళ్ల ఉకల్‌ ‌గ్రామానికి చెందిన గుగులోత్‌ ‌రవీంద్ర నాయక్‌ 42 ఏళ్ళ వయస్సులో ఉస్మానియా యూనివర్సిటీలో ఆంగ్లంలో పిహెచ్‌ ‌డి పట్టాపొంది, ఉపాధిలేక, ఆర్థిక సమస్యలను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడటం యావత్తు విద్యావంతులను ఆలోచింపజేసింది. 2020 ఫిబ్రవరి 17న యాదాద్రి జిల్లా, మోత్కురు మండలం, కొంపల్లి గ్రామానికి చెందిన నరసయ్య 45ఏళ్ళ వయసులో భూగోళ శాస్త్రంలో పిహెచ్‌ ‌డి పూర్తిచేసి యూనివర్సిటీ వసతి గృహంలోనే ఆత్మహత్యకు పాల్పడటం, మార్చి 17న సమాజశాస్త్రంలో పిహెచ్‌డి చేసిన బోయ జంగయ్య, మే 3న బండి గంగాధర్‌ ‌లాంటివాళ్ళు ఉన్నతమైన విద్యనభ్యసించి ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే కారణాలను తెలుసుకుని, మరలా ఇలాంటి సంఘటనలు పునరావృతం గాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రబుత్వాలపైన లేదా ? ఆత్మహత్యలు చేసుకోవడం ముమ్మాటికీ నేరం, అది శుభపరిణామం కాదు. గతంలో అక్కడక్కడ అవగాహన రాహిత్యంతో, మిడిమిడి జ్ఞానంతో, క్షణికావేశంలో ఇలాంటి సంఘటనలకు పాల్పడేవారు.

కానీ ప్రస్తుత పరిస్థితిలో ఫిలాసఫీలు చదివి ఎంతో విశ్లేషణాత్మకమైన జ్ఞానాన్ని కలిగి, పాలక ఆలోచన సరళిని అర్థం చేసుకోగలిగే సామర్థ్యం ఉండి, సమాజంలోని ప్రతి అంశం పట్ల అవగాహన కలిగి, ఎన్నో సమస్యలపట్ల పరిష్కార మార్గాలను సూచించే అపారమైన జ్ఞానాన్ని కలిగి, ఆత్మహత్యలకు పాల్పడితే తర్వాత తమ కుటుంబ ఆర్థికపరిస్థితులు, మనుగడ ఎలాగుంటుందో అంచనావేసే వివేకం కలిగి కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారంటే ప్రతి ఒక్కరు ఆలోచించక తప్పదు. నీళ్ళు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి లోకానికి ఉపాధి విషయంలో నిరాశే మిగిలిందనడంలో సందేహం లేదు. ఈ దశాబ్దపు కాలంలో విద్యనభ్యసించి ఉద్యోగవేటలో ఉన్న యువత ఎంతమంది? ప్రభుత్వం కల్పించిన కొలువులెన్ని ? అనే విషయాలను పోలిస్తే అర్థమవుతుంది. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగ యువత ఇప్పటికీ పట్టణాలలో వివిధ శిక్షణా కేంద్రాలలో శిక్షణ తీసుకుంటూ, వసతి గృహాలలో నివాసముంటూ వారి తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తూ, పెళ్ళీడొచ్చిన పెళ్ళిచేసుకోకుండా ఘజినీ మహ్మద్‌ ‌లా దండయాత్రలు చేస్తూనే ఉన్నారు.

ఆర్థిక నిపుణులు, మేధావి వర్గపు విశ్లేషణ ప్రకారం ఇప్పుడున్న నిరుద్యోగులందరికి ఉద్యోగవకాశాలు కల్పించడం కుదరదని చెబుతున్నప్పుడు… ప్రభుత్వం దానికనుగుణంగా మేధావులతో సంప్రదింపులు చేస్తూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా ఆలస్యం చేస్తే తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశముది. వివిధ కారణాల దృష్ట్యా దశాబ్దం క్రితం మధ్యలో చదువు ఆపేసి వివిధరకాల పనులు చేస్తూ ఆర్థికంగా స్థిరపడ్డ యువత ముందు, చదువు కొనసాగించి ఉద్యోగవేటలో ఉన్న యువత తలవంచకతప్పని పరిస్థితులు నెలకొంటున్నాయి. సమాజంలో ఇంకా అనేక విచిత్రకరమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఒక అమ్మాయికి పెళ్ళి చేయాలంటే వారు అబ్బాయికి ప్రభుత్వ కొలువుందా ? ఉద్యోగ భద్రత ఉందా ? ఆస్తిపాస్తులెన్ని ఉన్నాయి ? ఇలా పలురకాల అంశాలను పరీక్షించి వరుడిని ఎన్నుకుంటున్నారు. దానివల్ల పెళ్ళికాని బ్రహ్మచారులలో ఎక్కువగా నిరుద్యోగ యువతనే ఉందనడం అబద్ధం కాదు.

ఇదిలా ఉంటే విభిన్న రంగాలలోని సంస్థలు వ్యాపారంలో లాభాలను గడించాలనే తపనతో ఉద్యోగులపై చేసే ఒత్తిడి అంతా ఇంతా కాదు. అయినా ఆర్థిక వెసులుబాటుకు మరొకమార్గం లేక ఆత్మాభిమానాన్ని చంపుకోని కుక్కిన పేనులా పనిచేసే ఉద్యోగులెందరో ఉన్నారు. సరైన జీతాలులేక, వాటిని సరైన సమయంలో ఇవ్వకపోయిన వారిగురించి పట్టించుకునే నాథుడే లేడు. ప్రైవేటు ఉద్యోగులకు భద్రత కల్పించి ప్రభుత్వం వారిపట్ల ఆలోచిస్తే కొంతమేరనైనా మేలుజరిగేది. ఇప్పటికే సరైన ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగ• యువత అష్టకష్టాలు పడుతుంటే, మహమ్మారి కరోనా వైరస్‌ ‌మూలంగా ఉన్న ఉద్యోగాలు ఊడిపోయి రోడ్డున పడే పరిస్థితులు దాపురిస్తున్నాయి. నిపుణుల అంచనా ప్రకారం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి రెండు మూడు సంవత్సరాల కాలం పడుతుందంటుంటే, ప్రభుత్వం కొలువులు కల్పిస్తుందనుకోవడం అందని ద్రాక్షలాగే మిగిలిపోనుందా ? అనే అనుమానం కలుగకమానదు. ఇప్పటికైనా యావత్తు మేథావి వర్గం ఒక్క తాటిపైకి వచ్చి, సమాజ శ్రేయస్సును కాంక్షించి, ప్రభుత్వాలతో చర్చిస్తూ, నిరుద్యోగ నిర్మూలనకై ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి ఆచరణలో అమలయ్యే విధంగా ఒత్తిడి తేవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. నిరుద్యోగులకు భరోసా కల్పిండానికి ఆదిశగా అడుగులువేసి ఆత్మహత్యలులేని సమాజంకోసం పాటుపడాలని ఆశిద్దాం.

Leave a Reply