- ప్రజలకు మంత్రి ఈటల విజ్ఞప్తి
- కొరోనాపై వైద్య, ఆరోగ్య శాఖ
- ఉన్నతాధికారులతో సమీక్ష
తెలంగాణలో కొరోనా తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. నేటి నుంచి గ్రామీణ ప్రాంతాల్లోనూ కొరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామనీ, నిర్ణీత సమయంలో వైద్యం అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో కొరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై శనివారం వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణకు పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలలో కేసులు భారీగా పెరుగుతున్నాయనీ, అందువల్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావొద్దనీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలను విధిగా పాటించాలని సూచించారు.
కొరోనా విపత్తు సమయంలో కీలకంగా పని చేస్తున్న ఫ్రంట్లైన్ వారియర్స్ అందరికీ ఇప్పటికే వ్యాక్నిసేషన్ చేశామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సూచలన మేరకు 45 ఏళ్లు పైబడిన అందరికీ టీకా ఇస్తున్నామని చెప్పారు. కొరోనా కేసులు తగ్గించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతున్నదనీ, ఎప్పుడూ అశ్రద్ధ వహించలేదని స్పష్టం చేశారు. ఒకప్పుడు గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్లో మాత్రమే కొరోనా నిర్ధారణ పరీక్షలు, చికిత్సలు జరిగేవనీ, ఇప్పుడు ఈ సౌకర్యం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించామని చెప్పారు.
వ్యాక్సిన్ వల్ల కొంత తగ్గిందనీ, కొరోనాను కట్టడి చేసేందుకు ఆరోగ్య శాఖ అన్ని విధాలుగా సిద్దంగా ఉందన్నారు. వైరష్పై వదంతులు నమ్మవద్దనీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు అర్హులంతా కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఈ సందర్భంగా మంత్రి ఈటల సూచించారు.