Take a fresh look at your lifestyle.

అపెక్స్ ‌కౌన్సిల్‌ అనుమతి లేకుండా..కొత్త ప్రాజెక్టులు నిర్మించొద్దు

కేసీఆర్‌ ‌రాకపోవడం వల్లే అపెక్స్ ‌కౌన్సిల్‌ ‌సమావేశం వాయిదా
తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ ‌లేఖ

అపెక్స్ ‌కౌన్సిల్‌ అనుమతి లేకుండా ఎలాంటి కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టవద్దని తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ ‌షెకావత్‌ ‌లేఖ రాశారు. ముఖ్యంగా రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నదీ జలాల వాటాల విషయంలో వివాదాలు తలెత్తిన నేపథ్యంలో ఈ నదుల మీద కొత్త ప్రాజెక్టులు నిర్మించవద్దని స్పష్టం చేశారు. ఈమేరకు కేంద్ర మంత్రి షెకావత్‌ ‌తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం జగన్‌కు శనివారం లేఖ రాశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ‌హాజరు కాలేనని లేఖ రాసిన కారణంగానే అపెక్స్ ‌కౌన్సిల్‌ ‌సమావేశాన్ని వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారానికి సంబంధించి చర్చించడానికి వీలైనంత త్వరగా భేటీ కావాలని లేఖలో కోరారు. 2016లో మినహా ఇప్పటి వరకూ అపెక్స్ ‌కౌన్సిల్‌ ‌సమావేశం జరగలేదనీ, విభజన చట్టం సెక్షన్‌ 84(3) ‌ప్రకారం అపెక్స్ ‌కౌన్సిల్‌ ‌గోదావరి, కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డులపై పర్యవేక్షణ అధికారాలు కలిగి ఉందని స్పష్టం చేశారు.

2020 మే 14న గోదావరి బోర్డుకు ఏడు తెలంగాణ ప్రాజెక్టులపై తీవ్ర అభ్యంతరాలు చెబుతూ ఏపీ ప్రభుత్వం లేఖ రాసిందనీ, ఏపీ సర్కారు అభ్యంతరం చెప్పిన ప్రాజెక్టులకు అపెక్స్ ‌కౌన్సిల్‌ అనుమతులు లేవని స్పష్టం చేశారు. అలాగే, ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలపై జూన్‌ 5‌న జరిగిన గోదావరి బోర్డు సమావేశంలో లోతుగా చర్చ జరిగిందనీ, వాటి డీపీఆర్‌లను జూన్‌ 10‌లోగా సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని గోదావరి బోర్డు ఆదేశించిందని పేర్కొన్నారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకూ సంబంధిత డీపీఆర్‌లను బోర్డుకు అందజేయకపోవడంతో అపెక్స్ ‌కౌన్సిల్‌ అనుమతులు పొందకుండా నిర్మాణం జరపవద్దని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర జల్‌శక్తి శాఖ స్పష్టం చేసిందన్నారు. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపిన 2 ఏపీ ప్రాజెక్టులకు సైతం అపెక్స్ ‌కౌన్సిల్‌ అనుమతి లేదనీ, దీనిపై కూడా కృష్ణా బోర్డు ఏపీ ప్రభుత్వానికి మే 20న లేఖ రాసిందన్నారు. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్‌లు సమర్పించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినప్పటికీ ఎలాంటి స్పందన లేదనీ, రాయలసీమ లిఫ్ట్ ‌పథకం కోసం ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచినట్లు తమ దృష్టికి వచ్చిందనీ, ఈ పరిస్థితుల్లో అపెక్స్ ‌కౌన్సిల్‌ అనుమతి లేకుండా ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని పేర్కొన్నారు.  వీలైనంత త్వరగా అపెక్స్ ‌కౌన్సిల్‌ ‌సమావేశం జరపాలని కోరుకుంటున్నట్లు కేంద్ర మంత్రి షెకావత్‌ ‌రెండు రాష్ట్రాల సీఎంలకు రాసిన లేఖలో తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!