- వాళ్లు అధికారంలోకి వొస్తే ఎలా ఉంటుందో గమనించండి
- తమిళనాడు ప్రచారంలో ప్రధాని మోడీ
మహిళలను కించపరచడం కాంగ్రెస్, డీఎంకే సంస్కృతిగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తిరుపూర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, కొద్ది రోజుల క్రితమే డీఎంకే ఎమ్మెల్యే అభ్యర్థి దిండిగల్ లియోని మహిళలపై దారుణమైన వ్యాఖ్యలు చేశారని, ఆయనను డీఎంకే అడ్డుకోలేకపోయిందని అన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి కె.పళనిస్వామి తల్లిని కాంగ్రెస్, డీఎంకేలు అవమానించాయని, ఒకవేళ వాళ్లు (కాంగ్రెస్-డీఎంకే) అధికారంలోకి వస్తే తమిళనాడుకు చెందిన మరింత మంది తల్లులను అవమానిస్తారని అన్నారు.
తమిళనాడు ప్రజలు అన్నీ గుర్తుంచుకుంటారని, ఈ గడ్డపై పుట్టిన మహిళలను కించపరిస్తే ఎప్పుడూ సహించరనే విషయం తాను ఆ పార్టీలకు చెప్పదలచుకున్నానని అన్నారు. ఆనువంశిక పాలనే డీఎంకే ఎజెండా అని, డీఎంకే, కాంగ్రెస్‌లు మహిళా సాధికారతకు పూచీ పడతారనే హావి• లేదని పేర్కొన్నారు. కాగా, తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్ 6న ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. ప్రధాన పోటీ కాంగ్రెస్-డీఎంకే కూటమి, బీజేపీ-అన్నాడీఎంకే మధ్య ఉంది.