Take a fresh look at your lifestyle.

బీహార్ లో మూడో ఫ్రంట్ … సెక్యులర్ వోట్లు చీల్చడానికేనా..?

“ప్రధానమంత్రి నరేంద్రమోడీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలను వ్యతిరేకిస్తూనే నితీశ్ కుమార్ బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కూడా లౌకిక వాద పార్టీలను ఓడించేందుకు ఆయన బీజేపీ అనుకూల వర్గాలతో చేతులు కలుపుతున్నారు. మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ, బీహార్ తప్ప అన్నింట్లోనూ బీజేపీ విజయం సాధించింది. బీహార్ లో కూడా ఎలాగైనా అధికారంలోకి రావడం కోసం నితీశ్ కమార్ కి వల వేసింది. ఇప్పుడు నితీశ్ కమార్ ని పక్కకు తప్పించి ముఖ్యమంత్రి పదవిని సొంతం చేసుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది.అయితే, రాజకీయాల్లో ఆరితేరిన నితీశ్ కుమార్ బీజేపీ ఎత్తుగడల ను ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాల్సిందే. ఎంఐఎం మూడో ఫ్రంట్ లో చేరడం వల్ల ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమికి పడాల్సిన సెక్యులర్ వోట్లు చీలే ప్రమాదం ఉంది.”

బీహార్ లో ఈ సారి సందడి లేని ఎన్నికలు జరుగుతాయన్న వార్తలు వొచ్చాయి. కొరోనా నిబంధనల సడలింపుల్లో భాగంగా ఆన్ లాక్ నిబంధనల ప్రకారం ఎన్నికల ర్యాలీలను నిర్వహించుకునేందుకు పార్టీలకు కేంద్ర హోం శాఖ అనుమతి ఇచ్చింది.బీహార్ తో పాటు ఎన్నికలు జరిగే ఇతర రాష్ట్రాలకు కూడా ఈ సడలింపులు వర్తిస్తాయి. ఎన్నికల ముందు పార్టీలు, కూటములు ఏర్పడటం సహజమే. బీహార్ లో రాష్ట్రీయ జనతా దళ్, కాంగ్రెస్ , ఇతర సెక్యులర్ పార్టీలు ఒక కూటమిగానూ, జనతాదళ్ (యు), బీజేపీ, కేంద్ర మంత్రి రామవిలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి ఒక కూటమిగానూ ఉండేవి. అయితే, గత ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ (యు) నేత , ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ల మధ్య కుదిరిన సయోధ్య కారణంగా మహాఘట్ బంధన్ కూటమి పోటీ చేసింది. బీజేపీ చిన్న పార్టీలతో పొత్తు కుదుర్చుకుంది. గత ఎన్నికల్లో మహాఘట్ బంధన్ విజయాన్ని సాధించడం , ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా, లాలూ కుమారుడు తేజస్వి ముఖ్యమంత్రిగానూ మంత్రివర్గం ఏర్పడింది. అయితే, లాలూ బయట ఉన్నా మంత్రివర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ నితీశ్ కుమార్ బయటికి వొచ్చారు. బీజేపీ పన్నిన వలలో ఆయన పడ్డారన్నది విశ్లేషకుల అభిప్రాయం, బీహార్ లో ముస్లిం ల జనాభా అధికం, వారి సాయంతోనే లాలూ ప్రగతి శీల కూటమిని నడుపుకుని వొస్తున్నారు.ఇప్పుడు ఆర్జెడి , కాంగ్రెస్ కూటమి వోట్లు చీల్చేందుకు లోక్ సమతా పార్టీ (ఆర్ ఎల్ ఎస్ పి), మజ్లిస్ (ఎంఐఎం), బీఎస్పీ, సుహల్దేవ్ భారతీయ సమాజ్, సమాజ్ వాదీ జనతాదళ్ (ప్రజాస్వామ్య) , జనతాంత్రిక్ పార్టీ లతో మూడో కూటమి ఏర్పడింది. ఈ కూటమికి గ్రాండ్ డెమోక్రటిక్ సెక్యులర్ ఫ్రంట్ అనే పేరు పెట్టారు. గతంలో హైదరాబాద్,తెలంగాణలకే పరిమితం అయిన ఎంఐఎం మహారాష్ట్రలోనూ, బీహార్ లోనూ, ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో పోటీ చేస్తూ ఉత్తరాదిన తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. మహారాష్ట్రలో కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఎంఐఎం సీట్లు సంపాదిస్తోంది.

మూడో కూటమి వల్ల బీహార్ లో సెక్యులర్ వోట్లు చీలే ప్రమాదం ఉందని విశ్లేషకుల అభిప్రాయం. సెక్యులర్ పార్టీలు ఒకే కూటమి గా ఏర్పడి పోటీ చేస్తే బీజేపీ ఎంత విస్తృత ప్రచారం చేసినా ఓటమి పాలవుతుందన్న విషయం కిందటి ఎన్నికల్లో రుజువైంది. గత ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి బీజేపీ అభ్యర్ధుల తరఫున ప్రచారం చేశారు. ఈసారి కూడా బీజేపీ, జనతాదళ్ యు పార్టీల కూటమి తరఫున ఆయన ప్రచారం జరిపే అవకాశం ఉంది. ర్యాలీలకు అనుమతి లభించింది కనుక ఆయన గత ఎన్నికల్లో మాదిరి ప్రచారం జరపవచ్చు.అయితే, నితీశ్ కుమార్ వయసు రీత్యా పెద్ద కావడం, కూటమి నేతృత్వం కోసం బీజేపీ ఆశపడటంతో ఈ సారి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమంటూ విశ్లేషణలు వెలువడ్డాయి. దీంతో ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి ఘనవిజయం ఖాయమని ఊహాగానాలూ వెలువడ్డాయి. మరో వంక బీజేపీ – జనతాదళ్ కూటమిలో జనతాదళ్ వోట్లకు ఎసరు పెట్టేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యూహం పన్నారనీ, రామవిలాస్ పాశ్వాన్ కుమారుడు , లోక్ జనశక్తి ప్రస్తుత అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ బీజేపీ, జనతాదళ్ కూటమిలో చేరకుండా విడిగా పోటీ చేస్తున్నట్టు చేసిన ప్రకటనలో అమిత్ షా మద్దతు ఉందన్న కథనం వెలువడింది. చిరాగ్ పాశ్వాన్ నితీశ్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. బీజేపీతో పొత్తుకు సిద్దమేనని ప్రకటించారు.అందువల్ల ప్రస్తుత అధికార కూటమిలో నితీశ్ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు అమిత్ షాయే చిరాగ్ పాశ్వాన్ ను ప్రోత్సహిస్తున్నారన్నది ఈ కథనం సారాంశం. ఉపేంద్ర ఖుష్వా కూడా నితీశ్ కుమార్ నేతృత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు మూడో కూటమికి నేతృత్వం వహిస్తున్నారు. కొత్త కూటమిలో తమ పార్టీ ఎందుకు చేరాల్సి వచ్చిందో ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వివరణ ఇచ్చారు. 15 ఏళ్ళ నీతీశ్- బీజేపీ కూటమి, అంతకుముందు 15 ఏళ్ళ ఆర్జేడీ , కాంగ్రెస్ కూటమి పాలనలో బీహార్ ఎలాంటి అభివృద్ది చెందలేదనీ, బీహార్ అభివృద్ధి కోసమే కొత్త కూటమి ఏర్పడిందని ఆయన చెప్పారు.సామాజిక, ఆర్థిక, విద్యా రంగాల్లో ఆ రాష్ట్రం వెనకబడి ఉందని విమర్శించారు. బీహార్‌ భవిష్యత్తు కోసం కొత్త కూటమి ఏర్పడిందని అసదుద్దీన్‌ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. మరోవైపు 42 మంది అభ్యర్థుల జాబితాను ఆర్‌ఎల్‌ఎస్పీ గురువారం విడుదల చేసింది. బీహార్ లో వెనకబడిన తరగతుల జనాభా ఎక్కువ.

ఒబీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమం మొదట బీహార్ లోనే ప్రారంభమైంది. బీహార్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కర్పూరీ ఠాకూర్ ఒబీసీ ఉద్యమానికి అంకురార్పణ చేశారు. అయితే, ఒబీసీ నాయకుల్లో కూడా నాయకత్వం కోసం పోటీ పడేవారి సంఖ్య పెరగడం, పరిస్థితిని బీజేపీ ఉపయోగించుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా సెక్యులర్,ఒబీసీ వోట్లను చీల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. నితీశ్ కుమార్ లాలూ పార్టీని (ఆర్ జేడీని) బలహీనపర్చేందుకు యత్నాలు సాగిస్తున్నారు. కిందటి సారి లాలూ పార్టీ సాయంతోనే జనతాదళ్ అత్యధిక స్థానాలు సాధించింది. ఇప్పుడు లాలూకి అతి దగ్గర బంధువు అయిన చంద్రికా రాయ్ కి టికెట్ ఇచ్చారు. ఎన్నికల ముందు కూడా కొంత మంది ఎమ్మెల్యేలకు ఎరవేశారు. ఇప్పుడు మూడో ఫ్రంట్ ను పెట్టించింది కూడా ఆయనేనన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలను వ్యతిరేకిస్తూనే నితీశ్ కుమార్ బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కూడా లౌకిక వాద పార్టీలను ఓడించేందుకు ఆయన బీజేపీ అనుకూల వర్గాలతో చేతులు కలుపుతున్నారు. మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ, బీహార్ తప్ప అన్నింట్లోనూ బీజేపీ విజయం సాధించింది. బీహార్ లో కూడా ఎలాగైనా అదికారంలోకి రావడం కోసం నితీశ్ కమార్ కి వల వేసింది. ఇప్పుడు నితీశ్ కమార్ ని పక్కకు తప్పించి ముఖ్యమంత్రి పదవిని సొంతం చేసుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది.అయితే, రాజకీయాల్లో ఆరితేరిన నితీశ్ కుమార్ బీజేపీ ఎత్తుగడల ను ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాల్సిందే. ఎంఐఎం మూడో ఫ్రంట్ లో చేరడం వల్ల ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమికి పడాల్సిన సెక్యులర్ వోట్లు చీలే ప్రమాదం ఉంది.

Leave a Reply