Take a fresh look at your lifestyle.

జిల్లా పోలీసు శాఖలో….. అవినీతి అధికారులపై వరుసగా ఛార్జ్ ‌మెమోలు

అక్రమార్కులపై కొరడా ఝుళిపిస్తున్న ఎస్‌పి రెమా రాజేశ్వరి

మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలో అవినీతికి పాల్పడుతున్న అధికారులపై ఎస్‌పి రెమా రాజేశ్వరి వరుసగా మెమోలు జారీ చేస్తూ చర్యలు తీసుకుంటున్నారు. పోలీస్‌ ‌స్టేషన్లకు వొచ్చే వారితో అవినీతికి పాల్పడుతున్న అధికారులపై ప్రత్యేక నిఘాతో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జిల్లా కేంద్రంలోని పోలీస్‌ ‌స్టేషన్‌ ఎస్‌ఐ ‌స్థాయి అధికారికి ఒకే దఫా 6 ఛార్జి మెమోలు జారీ చేశారు.
మరో పోలీస్‌ ‌స్టేషన్‌ ఎస్‌హెచ్‌వోకు అవినీతికి పాల్పడ్డారని చార్జి మెమో ఇచ్చినట్టు సమాచారం. రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రాష్ట్రంలో పోలీసు శాఖకు పెద్ద పీట వేసినా కొందరు పోలీసు అధికారులు అక్రమార్జనకు పాల్పడుతున్నారు. తులసీ వనంలో గంజాయి మొక్కల చందంగా అక్కడక్కడ కొంతమంది పోలీస్‌ అధికారులు పక్కదోవ పడుతూ యావత్‌ ‌పోలీసు శాఖకు చెడ్డ పేరు తెస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహబూబ్‌నగర్‌ ‌జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి అంకితభావంతో విధులు నిర్వహిస్తూ పాలనాపరంగా మంచి పేరు సంపాదిస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎస్‌ అధికారి జిల్లాలో పోలీస్‌ ‌స్టేషన్లకు వొచ్చే బాధితులకు న్యాయం చేకూరాలని అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -

ఈ క్రమంలో అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నా.. కొంతమంది అవినీతి అధికారులలో మార్పు కన్పించక పోవడంతో ఎస్‌పి ప్రత్యేక నిఘాతో పోలీస్‌ ‌స్టేషన్లలో జరిగే అవినీతి ఇ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఓ పోలీస్‌ ‌స్టేషన్‌ ‌సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ ‌స్థాయి అధికారికి అవినీతి ఆరోపణలతో ఛార్జ్ ‌మెమో జారీ చేయడంతో పాటు సస్పెన్షన్‌కు రాష్ట్రస్థాయి ఉన్నత అధికారులకు నివేదికను పంపిస్తే ఆ అధికారి రాష్ట్ర స్థాయి అధికారులతో కుమ్మక్కై సస్పెన్షన్‌ను రద్దు చేసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.
ఈ మేరకు స్థానికులు సర్కిల్‌ ‌స్థాయి అధికారి రాష్ట్ర స్థాయి అధికాలలతో లాలూచీతో తిరిగి వీధుల్లో కొనసాగుతున్నారని పలువురు వాపోతున్నారు. రాష్ట్ర స్థాయి అధికారులు ఇలాంటి అవినీతి అధికారులకు అండగా ఉండడంతో రక్షణ వ్యవస్థ ఎటు పోతుందో అగమ్యగోచరంగా తయారయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్‌ ‌స్టేషన్లలో అధికారుల అండదండలతో అక్రమ ఇసుక రవాణా, భూ కబ్జాదారుల వ్యవహారాలు నడుస్తున్నాయని, పోలీస్‌ ‌స్టేషన్ల పనితీరు సరిగాలేదని జిల్లా ఎస్పీ రాజేశ్వరి ఉన్నత అధికారులకు తెలిపినట్టుగా సమాచారం. అవినీతి అంతమే తన పంతంగా ఎస్పి పనిచేస్తున్నా ఉన్నతాధికారులే ఇలా అండగా ఉంటే విశ్వాసంతో, నిబద్ధతతో, పారదర్శకంగా విధులు నిర్వహించే వారు ఓర్పు కోల్పోతారని గ్రహించి, రాష్ట్ర స్థాయి అధికారులు ఇప్పటికైనా మార్పు తెచ్చుకొని రక్షణ వ్యవస్థను శక్తివంతంగా మారుస్తారని ఆశిద్దాం.

Leave a Reply