Take a fresh look at your lifestyle.

కాశ్మీర్‌లో జిల్లా మండళ్ళ ఎన్నికల తతంగం… బీజేపీకి రాజకీయ లబ్ధి కోసమే

జమ్ము, కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని మోడీ ప్రభుత్వం రద్దు చేసి రాష్ట్రాన్ని విభజించిన తర్వాత తొలిసారిగా జరిగిన జిల్లా అభివృద్ధి మండళ్ళ ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరగడం ప్రజాస్వామ్య విజయంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే, ఇవి ఓ తతంగంలా జరిగాయన్నది విమర్శకుల అభిప్రాయం. బీజేపీ లబ్ది కోసమే వీటిని జరిపించారని వారంటున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ అధినేత డాక్టర్‌ ‌ఫరూక్‌ అబ్దుల్లా నేతృత్వంలోని ఏడు పార్టీల కూటమి పీపుల్స్ అలయెన్స్ ‌ఫర్‌ ‌గోప్‌ ‌కార్‌ ‌డిక్లరేషన్‌ ‌రెండు ప్రాంతాల్లోనూ ఎక్కువ స్థానాలు సాధించింది. అయితే, కాశ్మీర్‌లో తొలిసారి బీజేపీ మూడు సీట్లు గెల్చుకుని తన ప్రత్యేకతను చాటుకుంది. రాష్ట్ర విభజనను కాశ్మీరీలు వ్యతిరేకించారని గోప్‌ ‌కార్‌ అలయెన్స్ ‌పేర్కొంటుండగా, ప్రజలు ఆమోదించారని బీజేపీ పేర్కొంటోంది. బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడటం వల్ల కాశ్మీర్‌లో మూడు సీట్లను గెల్చుకోగలిగిందని మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా ఆరోపించారు. 370వ అధికరణను ప్రజలు వ్యతిరేకిస్తున్నారనీ, అందుకు ఈ ఫలితాలే నిదర్శనమని ఆయన అన్నారు. అయితే, ఎన్నికలు సజావుగా జరగడం ప్రజాస్వామిక విజయమని కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా అభివర్ణిస్తున్నారు. పోలీసుల పహరా మధ్య జరిగిన ఈ ఎన్నికల్లో వోటు హక్కు వినియోగించుకునేందుకు చాలా మంది పోలింగ్‌ ‌కేంద్రాలకు రాలేదని నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ ‌నాయకులు ఆరోపించారు. బీజేపీకి సీట్లు, అధికారం తప్ప ప్రజల మనోభావాలతో నిమిత్తం లేదని నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ ‌చేసిన ఆరోపణలో అసత్యం లేదనిపిస్తోంది.

బీహార్‌లో జనతాదళ్‌ ‌యుతో అధికారాన్ని పంచుకుంటూ, అరుణాచల్‌ ‌ప్రదేశ్‌లో ఆ పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపును ప్రోత్సహించడం ఆ పార్టీ అనైతికతకు నిదర్శనం. అరుణాచల్‌ ‌ప్రదేశ్‌ ‌జేడీయు ఎమ్మెల్యేల్లో ముగ్గురిని ఇంతకుముందే బీజేపీలో చేర్చుకున్నారు. కమలనాథులు తమ ఉపన్యాసాల్లో కాశ్మీర్‌ ‌నుంచి కన్యాకుమారి వరకూ అసోం, అరుణాచల్‌ ‌ప్రదేశ్‌ ‌వరకూ తమ పార్టీ జెండా ఎగురుతుందని తరచూ చెబుతూ ఉంటారు. దానిని రుజువు చేయడం కోసం అధికార దుర్వినియోగానికీ, పార్టీ ఫిరాయింపులకూ పాల్పడుతున్నారు. ఇందుకు అరుణాచల్‌ ‌ప్రదేశ్‌లో తాజా పరిణామాలు ఉదాహరణ. కాశ్మీర్‌లో అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకుని కాశ్మీర్‌ ‌లోయలో వోట్లు వేయించుకున్నారనీ, కాశ్మీర్‌ ‌లోయలో బోణీ కొట్టామని గొప్పలు చెప్పుకుంటున్నారనీ, లోయలో స్వేచ్ఛగా ఎన్నికలు జరగలేదని ఒమర్‌ అబ్దుల్లా ఆరోపించారు. అంతేకాకుండా, పీపుల్స్ ‌డెమోక్రటిక్‌ ‌పార్టీ(పీడీపీ) మాజీ మంత్రి అల్తాఫ్‌ ‌బుఖారీని ప్రోత్సహించి అప్నీ పార్టీని పెట్టించారనీ, ఆ పార్టీ లోయలో నేషనల్‌ ‌కాన్ఫరెన్స్, ‌పీడీపీ వోట్లను బాగా చీల్చిందని నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ ‌నాయకులు ఆరోపించారు. కాశ్మీర్‌లో ఖాతా తెరిచామని గొప్పలు చెప్పుకుంటున్న కమలనాథులు స్వేచ్ఛగా ఎన్నికలు జరిపిస్తే వారి బలం ఏమిటో తెలుస్తుందని నేషనల్‌ ‌కాన్ఫరెన్స్, ‌పీడీపీ నాయకులు సవాల్‌ ‌విసురుతున్నారు. కాశ్మీర్‌లో జిల్లా అభివృద్ధి మండలి ఎన్నికలు 370వ అధికరణం రద్దుపై రిఫరెండం లాంటివని ఈ రెండు పార్టీలు పరిగణిస్తున్నాయి.

కాశ్మీర్‌ ‌విభజనను ఈ రెండు పార్టీలు సరిపెట్టుకోలేకపోతున్నాయి. ప్రజల్లో అసంతృప్తిని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ఈ రెండు పార్టీలు గరిష్టంగా పని చేశాయి. అయితే, జమ్ములో ఆ మంత్రం పని చేయలేదు. జమ్ములో బీజేపీ బలం చెక్కు చెదరలేదని నిరూపితం అయింది. కాశ్మీర్‌ అభివృద్ది కోసం కేంద్రం ఖర్చు చేసిన వేల కోట్ల రూపాయిలు ఎవరి జేబుల్లోకి పోయాయో తెలియదని నేషనల్‌ ‌కాన్పరెన్స్ ‌నాయకులు అంటుండగా, రాష్ట్రంలో ఎక్కువ కాలం అధికారంలో ఉన్న ఆ పార్టీయే రాష్ట్రం వెనుకబడటానికి కారణమని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. రాజకీయ పార్టీల వాదోపవాదాల మాట ఎలా ఉన్నా, రాష్ట్రంలో శాంతిభద్రతలను ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా, ఉగ్రవాదులు ఏ సమయంలో దాడి చేస్తారోనన్న భయం వారిలో ఉండేది. ఇప్పుడు ఈ ఎన్నికల పేరు చెప్పి వీధుల్లోకి ధైర్యంగా రాగలిగారు. అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిపిస్తే ప్రజల్లో గూడుకట్టుకున్న భయాలు తొలగిపోతాయని పలువురు పేర్కొంటున్నారు. జిల్లా అభివృద్ధి మండళ్ళ ఎన్నికల్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించినందున అసెంబ్లీ ఎన్నికలు జరిపించేందుకు మొగ్గు చూపవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

రాష్ట్రంలో పోలీసుల నిర్బంధం తొలగితే ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వెల్లడించగలరనీ, ప్రతిపక్ష నాయకులను గృహ నిర్బంధంలో ఉంచి, భద్రతాదళాల పహరాలో ఎన్నికలు జరిపిస్తే ప్రభుత్వం కోరుకున్నట్టుగా ఫలితాలు వొస్తాయనీ, ఇప్పుడు అదే జరిగిందని విశ్లేషకులు అంటున్నారు. కాశ్మీర్‌లో ప్రదాని మోడీ అధికారంలోకి వొచ్చిన తర్వాత ఎన్నో ప్రయోగాలు చేశారు. పీడీపీ పొత్తుతో అధికారాన్ని పంచుకోవడం అటువంటిదే. అక్కడ బీజేపీ నాయకుల ఇష్టానికి వ్యతిరేకంగా కుదుర్చుకున్న ఈ పొత్తు వల్ల రాష్ట్రంలో పార్టీ బలహీనపడింది. ప్రజలు కోరుకున్న పార్టీ లేదా ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే అక్కడ స్వేచ్ఛగా ఎన్నికలు జరగాలని విశ్లేషకులు అంటున్నారు. మోడీ తన ప్రచారం కోసం కాశ్మీర్‌ ‌కార్డును ఉపయోగించుకుంటున్నారే తప్ప అక్కడ మామూలు పరిస్థితులను ఏర్పాటు చేయాలన్న చిత్తశుద్ధి లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. ప్రతి అంశంలో రాజకీయ ప్రయోజనాన్ని ఆశించినంత కాలం ప్రజలకు న్యాయం జరగదని కాంగ్రెస్‌ ‌నాయకులు స్పష్టం చేశారు. కాశ్మీర్‌లో 370వ అధికరణాన్ని పునరుద్ధరించాలని బీజేపీ మినహా అన్ని పార్టీలూ కోరుతున్నాయి. దానిపై రిఫరెండం జరిపించాలని డిమాండ్‌ ‌చేస్తున్నాయి.

Leave a Reply