Take a fresh look at your lifestyle.

దళితులకు భూమి పంపిణీ నత్తనడక

Distribution,land to Dalits, telangana govt, miryalaguda
ఆరేండ్లలో పంచింది 15వేల ఎకరాలు మాత్రమే

ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్‌:‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ దళిత కుటుంబానికి మూడెకరాల వ్యవసాయ భూమి ఇస్తామని చేసిన హామీ నత్తనడక నడుస్తున్నది. కొన్ని మండలాల్లో ఈ పథకం గురించి ఆలోచిస్తున్న దాఖలాలు కూడా లేవు. తెలంగాణలో ధనిక మండలాలుగా గుర్తింపు పొందిన మిర్యాలగూడ, నేరేడుచర్ల, హుజూర్‌నగర్‌, ‌మండలాల్లో ఈ పథకంలో లబ్దిదారుల గుర్తింపే జరగడంలేనది విమర్శలు వచ్చాయి.ఈ కార్యక్రమంలో భాగంగా 2019,2020 సంవత్సరాల్లో డిసెంబర్‌….2019 ‌నాటికి 595 ఎకరాల భూమిని దళిత కుటుంబాలకు పంచిపెట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన ఆదేశాల ప్రకారం మహిళల పేరుతోనే పట్టాదార్‌ ‌పాసుపుస్తకాలు అందిస్తున్నారు. మహిళలకు వ్యవసాయంపైన, అవగాహన ఉంటుందని, కుటుంబాన్ని దక్షతగా మహిళలే నడిపించగలుగుతారని సీఎం పలు సందర్భాలో అధికారులకు వివరించారు. ఈ ఆలోచనలతోనే మహిళల పేరుతో పాస్‌పుస్తకాలు ఇస్తున్నారు.అయితే 2019…20 ఆర్థిక సంవత్సరంలో మూడువేల ఎకరాలు కొని లబ్దిదారులకు భూములు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. మార్చి …2020 నాటికి మూడువేల ఎకరాల భూమిని కొనగలుగుతారా? దళితులకు పంపిణీ చేయగలుగుతారా? అంటూ దళిత సంక్షేమ సంస్థలు ప్రశ్నిస్తున్నాయి, .2014, 2015 సంవత్సరాల్లో స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సభలో దళితులకు భూముల పంపిణీ విషయాన్ని సీఎం ప్రస్తావించారు. ఈ పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో భూమిని కొనుగోలు చేసేందుకు డిసెంబర్‌….2019 ‌నాటికి రూ.29కోట్లు ఖర్చుచేశారు. 2014నుంచి ఇప్పటివరకు రూ. 675కోట్ల 65లక్షలు వ్యయం చేశారు.

కాగా 2014నుంచి 2019 వరకు 15వేల ఎకరాల భూమిని కొని లబ్దిదారులకు పంపిణీ చేశారు. అయితే ప్రతీ మండలంలో దళితులు భూములకోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రతీ సంవత్సరం ప్రకటిస్తున్నారు. గత డిసెంబర్‌ ‌చివరి నాటికి రాష్ట్రవ్యాప్తంగా భూమి కావాలని కోరుతూ 5లక్షల మంది దళితులు దరఖాస్తులు చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. భూములు ఇవ్వడమే కాకుండా భూమి సాగుచేసుకునేవిధంగా ఆర్థికసాయం అందిస్తామని కూడా హామీ ఇచ్చారు. దళితులు వ్యవసాయరంగంలో చాలా నిపుణులు రాష్ట్ర ముఖ్యమంతి్ర చాలా సందర్భాలో పేర్కొన్నారు. కానీ భూములు కోరుకుంటున్న దళితుల సంఖ్య లక్షల్లో ఉంటే వేలల్లో కూడా భూములు పంపిణీ చేయడానికి కనా కష్టాలు పడుతున్నారు. దీనికితోడు తెలంగాణ వ్యాప్తంగా భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. సాగునీరు సదుపాయం ఉన్న ప్రాంతంలో ఎకరం రూ.20లక్షల నుంచి 30లక్షల వరకు పలుకుతున్నది. భూములు విక్రయించేవారు తక్కువ సంఖ్యలో ఉంటున్నారు.ఈ కారణాలన్నింటితో ప్రతీ దళిత కుటుంబానికి మూడెకరాల భూమి పంపిణీ కార్యమ్రం ప్రభుత్వం నిర్ధేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడం లేదు. 2014-15 సంవత్సరాల్లో రూ.74కోట్ల 63లక్షలు ఖర్చు చేసి 774 మంది లబ్దిదారులకు 2044ఎకరాల భూమిని పంపిణీ చేశారు. 2015-16 సంవత్సరంలో రూ.199 కోట్లు ఖర్చు చేసి 4822 ఎకరాలభూమిని కొని 2వేల మంది లబ్దిదారులకు భూమి పట్టాలను ఇచ్చారు.2016-17లో రూ.104కోట్ల వ్యయం చేసి 2300 ఎకరాల భూమిని కొని 900 మంది దళితులకు పట్టాలు ఇచ్చారు.2017-18రూ.158కోట్లు వ్యయం చేసి 3500 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. దాదాపు 1500 మంది దళిత కుటుంబాలకు ఈ భూమిని పంపిణీ చేశారు. 2018-19 సంవత్సరాలల్లో 109 కోట్ల13లక్షలు ఖర్చు చేసి 913 మంది లబ్దిదారులకు 2255 ఎకరాల భూమి పంచిపెట్టారు. 2019-20 సంవత్సరాల్లో 29కోట్లతో 600 ఎకరాలు కొని ఇంతవరకు 260 మంది లబ్దిదారులకు భూమిని పంపిణీ చేసి పాసుపుస్తకాలు ఇచ్చారు. ఈ పంపిణీ కార్యక్రమం లక్ష్యాలను చేరడం లేదని, ఈ లెక్కల ఎన్ని సంవత్సరాలకు లక్షల సంఖ్యలో భూములకోసం దరఖాస్తులు చేసుకున్న దళితులకు భూములు ఎప్పుడు పంపిణీ చేస్తారని దళిత సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

Tags: Distribution,land to Dalits, telangana govt, miryalaguda

Leave A Reply

Your email address will not be published.