దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజల ఆకలి తీర్చేందుకు తెలంగాణ నుంచి బియ్యం రవాణా నిరంతరాయంగా కొనసాగుతుందని రామగుండం పోలీస్ కమీషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పెద్దపల్లి రైల్వే స్టేషన్‌లోని గూడ్స్ లోడింగ్ పాయింట్‌ను బుధవారం కమీషనర్ సందర్శించారు. అనంతరం సిపి మాట్లాడుతూ ఈనెల 4నుంచి లక్ష మెట్రిక్ టన్నుల బియ్యం 34వ్యాగిన్ల ద్వారా పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు తరలించినట్లు తెలిపారు. లోడింగ్‌కు హమాలీల కొరత, లారీలు అందుబాటులో లేకపోవడంతో పెద్దపల్లి పోలీస్ అధికారులు సమస్యను పరిష్కరించినట్లు సిపి సత్యనారాయణ వివరించారు.
హమాలీలకు బత్తాయిల పంపిణి…
కొరోనా వైరస్ నివారణకు రోగనిరోధకశక్తి పెంపుదలకు లోడింగ్ పాయింట్ వద్ద పని చేసే హమాలీలకు సిపి సత్యనారాయణ బత్తాయిలు పంపిణి చేశారు. అనంతరం సిపి మాట్లాడుతూ కొరోనా నివారణలో భాగంగా హమాలీలు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తునే, తరచుగా చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు. లోడింగ్ పాయింట్ వద్ద హమాలీలకు సబ్బు, శానిటైజర్లు, మంచినీరు అందుబాటులో ఉంచాలని అధికారులకు సిపి సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జోన్ డిసిపి రవీందర్, ఎసిపి హబీబ్ ఖాన్, సిఐ ప్రదీప్ కుమార్, ట్రాఫిక్ సిఐ బాబురావు, ఎస్ఐ ఉపేందర్‌తో, హమాలీ సంఘం గౌరవ అధ్యక్షుడు కొంతం శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.