Take a fresh look at your lifestyle.

విలక్షణ వ్యక్తిత్వం… ఎం ఎస్‌ ఆర్‌ ‌కే సొంతం

విచిత్ర మనస్తత్వం….నిక్కచ్చిగా వ్యవహరించే నైజం. కుండలు బద్దలు కొట్టినట్లు మాట్లాడే  ముక్కుసూటి తనం, నిండైన  అమాయకత్వం, మచ్చలేని రాజకీయ జీవితం… వెరసి ఎం.సత్యనారాయణ రావు వ్యక్తిత్వం. మానేని సత్యనారాయణ రావు అంటే వెంటనే స్ఫురణకు రాక పోవచ్చు. ఎం ఎస్‌ ఆర్‌ అం‌టే తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎం. ఎస్‌. ఆర్‌ ‌మృతితో రాష్ట్రం ఒక నిబద్దత కలిగిన పాతతరం నాయకుని కోల్పోయింది.కరీంనగర్‌ ‌జిల్లాలోని రామడుగు మండలం వెదిర గ్రామంలో ఎంఎస్‌ఆర్‌ ‌జనవరి 14, 1934న   జన్మించారు. విద్యార్థి దశ నుండే  తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై స్పందించే వారు. హైదరాబాద్‌ ‌లో  వి.వి. కళాశాలలో చదువు తున్నపుడు తన గొంతు వినిపించే వారు. 1969 తొలి తెలంగాణ ఉద్యమంలో ఆయన చెన్నారెడ్డి లాంటి నాయకులతో కలిసి చురుకుగా పాల్గొన్నారు. 1971లో తెలంగాణ ప్రజా సమితి ఎంపీగా ఎంఎస్‌ఆర్‌ ‌గెలుపొందారు. అనంతరం మరో రెండు పర్యాయాలు కాంగ్రెస్‌ ఎం‌పీగా గెలిచారు. 14 ఏళ్ల పాటు ఎంపీగా కొనసాగారు.1980 నుండి 1983 వరకు ఎఐసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన పార్టీ వ్యవహారాల్లో ఇందిరా గాంధీతో సన్నిహితంగా ఉన్నారు.

1990-94 వరకు ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2000 నుంచి 2004 వరకు రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడిగా ఎంఎస్‌ఆర్‌ ‌పనిచేశారు. 2004-07 వరకు దివంగత నేత మాజీ సీఎం వైఎస్‌ ‌రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో దేవాదాయ, క్రీడ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా పనిచేశారు. 2007 తర్వాత ఆర్టీసీ చైర్మన్‌గా ఎం.సత్యనారాయణ రావు తిరిగి సేవలందించారు. 77-79 లోక సభ  సభ్యుడుగా, హౌస్‌ ‌కమిటీ బాధ్యునిగా ఆస్ట్రేలియా మరియు ఇతర దేశాలకు పార్లమెంటరీ ప్రతినిధి సభ్యునిగా వెళ్లారు.ఇందిరాగాంధీతో పాటు నెహ్రూ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరుంది.చాలా సందర్భాల్లో ఆయన హైకమాండ్‌కి ఎదురు తిరిగేవారు కూడా. ఆయన ఎప్పుడు ఎలా స్పందిస్తారో అని హైకమాండ్‌ ఒక్కోసారి ఆందోళన చెందేది.తన పర భేదం లేకుండా వ్యాఖ్యానాలు చేసేవారు. అవి అప్పుడప్పుడు  సంచలనాలుగా మారేవి. రాజకీయాలు వేడెక్కేవి. అలా ముఖ్యమంత్రిగా వైఎస్‌ ఉన్న సమయంలో సహచర మంత్రిగా 2006 లో, టిఆర్‌ఎస్‌ ‌చీఫ్‌ ‌కెసిఆర్‌ ‌ను సవాలు విసిరి కరీంనగర్‌ ‌లోక్‌ ‌సభ ఉప ఎన్నికకు కారణమై, కేసిఆర్‌ ‌గెలుపుకు బాధ్యులుగా, రాజీనామా చేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌పిసిసి అధ్యక్షుడిగా ఎంఎస్‌ఆర్‌ ‌విసిరిన సవాలుకు ప్రతిస్పందనగా కెసిఆర్‌ 2006 ‌లో తెలంగాణకు ఎంపి పదవికి రాజీనామా చేశారు.తెలంగాణ వాదిగా, ఎంపీగా, మంత్రిగా ఎమ్మెస్సార్‌ ‌ప్రత్యేక శైలి కనబరిచారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం శానససభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు రాజీనామాలు చేసిన నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
కాంగ్రెస్‌ ‌పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగిన ఆయన అందరికీ పరిచయమే. ముఖ్యంగా ఢిల్లీ పెద్దలతో ఆయన బాగా సత్సంబంధాలు కొనసాగించేవారు. చాలా వ్యవహారాల్లో ఢిల్లీ పెద్దలు ఆయన అభిప్రాయాల్ని లెక్కలోకి తీసుకునేవారు. నాగర్జున సాగర్‌ ‌ప్రాజెక్ట్ ‌ప్రారంభోత్సవం సమయంలో రావు అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ ‌నెహ్రూను కలిశారు. తెలంగాణ రాజకీయాలపై చర్చించారు. తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌తో విలీనం చేయడాన్ని ఆయన వ్యతిరేకించారు. జహర్‌లాల్‌ ‌నెహ్రూతో నిజామాబాద్‌ను సందర్శించినప్పుడు ఆయన తన భావాలను వ్యక్తం చేసినట్లు చెప్పేవారు. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత… ఉమ్మడి రాష్ట్రం… ఆంధ్రప్రదేశ్‌, ‌తెలంగాణగా విభజించిన తర్వాత… ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరం అయ్యారు.

ఇందిరా గాంధీ తో సన్నిహితంగా మెలిగిన ఆయన… రాజకీయాలకు బహు దూరంగా పైలెట్‌ ‌గా ఉన్న రాజీవ్‌ ‌గాంధీని, ఇందిర కోరిక మేరకు తానే రాజీవ్‌ ‌ను మెప్పించి ఒప్పించి రాజకీయాల్లోకి తెచ్చానని చెపుతుండే వారు. పలు రాష్ట్రాల కాంగ్రెస్‌ ‌పార్టీ ఇంచార్జిగా ఉన్న సమయంలో ఒక సందర్భంలో ఉత్తర ప్రదేశ్‌ ‌వెళ్ళినపుడు, నాటి యు. పి. కాంగ్రెస్‌ అధ్యక్షులు శంకర్‌ ‌దయాళ్‌ ‌శర్మ, తనకోసం గంటల కొద్దీ వేచి ఉండి, స్వాగతం పలికి, దండ వేసిన అపూర్వ సంఘటనను గుర్తు చేసుకునే వారు.రాష్ట్ర రాజకీయాలలో చెరగని ముద్ర వేసుకున్న ఎం.ఎస్‌. ఆర్‌. ‌కొన్ని రోజుల కిందట కరోనా సోకి,   తీవ్రత అధికం కావడంతో,  ఆదివారం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించించబడి,  చికిత్స పొందుతూ, సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

మేనేని సత్యనారాయణ రావు  మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ ‌రావు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ వాదిగా, ఎంపీగా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, ఆర్టీసీ చైర్మన్‌ ‌గా ఎమ్మెస్సార్‌ ‌ప్రత్యేక శైలి కనబరిచారని, రాజకీయాల్లో ముక్కుసూటి మనిషిగా పేరొందారని, సీఎం కేసీఆర్‌ ‌గుర్తు చేసుకున్నారు.  అయన మృతి పట్లశాసన సభ స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాసరెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌పొన్నం ప్రభాకర్‌, ‌మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి లు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భాగవంతుడిని ప్రార్థించారు. ఎమ్‌.ఎస్‌.ఆర్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీలో క్రమశిక్షణ కలిగిన గొప్ప నాయకుడని కొనియాడారు.
–  రామ కిష్టయ్య సంగన భట్ల…
9449595494

Leave a Reply