Take a fresh look at your lifestyle.

టీఆర్‌ఎస్‌లో రగులుతున్న అసంతృప్తి

Suspensions Start in TRS Party

  • పార్టీ వ్యవహారాలకు దూరంగా ఎమ్మెల్యే మైనంపల్లి
  • ఇదివరకే అలిగిన మాజీమంత్రి జూపల్లి

అధికార టీఆర్‌ఎస్‌ ‌పార్టీలో అసమ్మతి నివురు గప్పిన నిప్పులా ఉందా ? సీఎం కేసీఆర్‌ ‌మంత్రి పదవి ఇస్తానని ఆశ పెట్టిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, రెండో దఫా మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కని మాజీ మంత్రులు పార్టీ అధినేత వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారా ? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది.ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కడంపై కొందరు సీనియర్లు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అధికార పార్టీలో అధినేత తీరుపై ఉన్న అసంతృప్త జ్వాలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఒకప్పడు సీఎం కేసీఆర్‌కు సన్నిహితంగా మెలిగిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు టీఆర్‌ఎస్‌పై బహిరంగంగానే తిరుగుబాటు జెండా ఎగురవేశారు. తాజాగా జరిగిన మున్సిపల్‌ ఎన్నికలలో ఆయన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులపై తన అనుచరులను తిరుగుబాటు అభ్యర్థులుగా నిలిపి గెలిపించుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో కొల్లాపూర్‌లో జూపల్లిపై కాంగ్రెస్‌ అభ్యర్థి హర్షవర్ధన్‌రెడ్డి విజయం సాధించారు. అయితే, కేసీఆర్‌ అమలు చేసిన ఆపరేషన్‌ ‌గులాబీ కార్యక్రమంలో భాగంగా ఆయన టీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి పార్టీలో మాజీ మంత్రి జూపల్లికి ప్రాధాన్యత తగ్గిపోయింది. అంతేకాకుండా ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికలలో స్థానిక ఎమ్మెల్యే హోదాలో సీఎం కేసీఆర్‌ ‌హర్షవర్ధన్‌రెడ్డికే అభ్యర్థుల ఎంపిక బాధ్యతను అప్పగించారు. దీంతో ఆయన జూపల్లిని ఏమాత్రం సంప్రదించకుండా తన అనుచరులకు టికెట్లు ఇచ్చారు. దీంతో జూపల్లి అధికార పార్టీ అభ్యర్థులపై తన అనుచరులను నిలిపిన విషయాన్ని హర్షవర్ధన్‌రెడ్డి పార్టీ వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కేటీఆర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ వెనక్కి తగ్గలేదు. చివరికి తన అనుచరులను మున్సిపల్‌ ఎన్నికలలో గెలిపించుకుని జూపల్లి తన సత్తా చాటారు.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సస్పెండ్‌ ‌చేస్తామనీ, తిరిగి పార్టీలోకి తీసుకునేది లేదని హెచ్చరించిన కేటీఆర్‌ ‌టీఆర్‌ఎస్‌పై బహిరంగంగా తిరుగుబాటు ప్రకటించినప్పటికీ జూపల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరోవైపు, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో గెలిస్తే తనకు మంత్రి పదవి ఇస్తానన్న హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్‌ ఆ ‌తరువాత దానిని విస్మరించారన్న అసంతృప్తితో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఉన్నట్లు పార్టీ వర్గలలో జోరుగా ప్రచారం సాగుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి సీఎంగా కేసీఆర్‌ ‌రెండో సారి అధికారం చేపట్టిన వెంటనే మైనంపల్లికి మంత్రి పదవి దక్కబోతున్నదని ప్రచారం జరిగింది. మల్కాజ్‌గిరిలో గెలుపుతో మైనంపల్లికి మంత్రి పదవి ఖాయమని ఆయన అనుచరులు నియోజకవర్గంలో సంబరాలు కూడా చేసుకున్నారు. టీఆర్‌ఎస్‌ ‌తొలి ప్రభుత్వంలో మంత్రి గా ఉన్న పద్మారావును డిప్యూటీ స్పీకర్‌గా నియమించడంతో మైనంపల్లికి అడ్డు తొలగినట్లేనని అంతా భావించారు. అయితే, అందుకు విరుద్ధంగా ఆయనకు రెండో దఫా మంత్రివర్గ విస్తరణలోనూ చోటు దక్కలేదు.కానీ, తొలిసారిగా మేడ్చల్‌ ‌నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మల్లారెడ్డిని మంత్రి పదవి వరించింది. దీంతో మైనంపల్లి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అప్పటి నుంచి సీఎం కేసీఆర్‌తో పాటు మైనంపల్లి పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వస్తున్నారు. చాలా కాలం నుంచి ఆయన అసలు టీఆర్‌ఎస్‌ ‌రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌కు రావడమే లేదని పార్టీ నేతలు చెబుతున్నారు. తాజాగా హైదరాబాద్‌ ‌మెట్రో రైల్‌ ‌కారిడార్‌ 2‌ను సీఎం ప్రారంభించారు. స్వయంగా సీఎం కేసీఆర్‌, ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌సైతం పాల్గొన్న ఈ కార్యక్రమానికి మైనంపల్లి దూరంగా ఉన్నారు.

గత జీహెచ్‌ఎం‌సి ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌ ‌గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ అధ్యక్షునిగా ఉన్న మైనంపల్లి పార్టీ ఘన విజయం సాధించడంలో కీలకపాత్ర వహించారు. ప్రస్తుతం జీహెచ్‌ఎం‌సి ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మైనంపల్లి పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండటం వచ్చే ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన వర్గీయులు భావిస్తున్నారు. కాగా, మంత్రి పదవుల విషయంలో ఆదిలాబాద్‌ ‌జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి కూడా పార్టీ అధినేతపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. నిజామాబాద్‌ ‌జిల్లాకు చెందిన ఎమ్మెల్యే షకీల్‌ ‌కూడా మైనార్టీ కోటాలో తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించినప్పటికీ తన ఆశ నెరవేరకపోవడంతో అక్కడి బీజేపీ ఎంపీ అర్వింద్‌తో సమావేశమయ్యారు. దీనిపై రాజకీయంగా పెద్ద దుమారం చెలరేగింది. పార్టీ అధిష్టానం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో ఆయన తిరిగి టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నారు. కాగా, మంత్రి పదవులు ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులంతా సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారనీ, పరిస్థితిని బట్టి అధిష్టానానికి షాక్‌ ఇచ్చే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారన్న ప్రచారం టీఆర్‌ఎస్‌ ‌పార్టీలో జోరుగా సాగుతోంది.

Leave A Reply

Your email address will not be published.