Take a fresh look at your lifestyle.

అసెంబ్లీస్థానాల పెంపుపై మరోసారి చర్చ

ఏపి పునర్విభజన చట్టంలో పొందుపర్చిన మేరకు రెండు తెలుగురాష్ట్రాల్లో శాసనసభ స్థానాల సంఖ్య పెంపు విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయినప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ శాసనసభ స్థానాలను పెంపుచేస్తామని అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ‌నేతృత్వంలోని యుపిఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. దానికి ఆనాడు ప్రతిపక్షంలో, ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ కూడా అంగీకరించింది. విభజన నేపథ్యంలోనే ఈ విషయంలో అనేకానేక చర్చలు జరిపిన తర్వాతనే ఇరువర్గాలు అంగీకరించి చట్టంలో పొదుపర్చారు. కాంగ్రెస్‌ ‌నేతృత్వంలోని యుపిఏ మంత్రులతోపాటు, బీజేపీ అగ్ర నేతలైన అద్వానీ, వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జైట్లీ వంటి నేతలు పలు దఫాలుగా చర్చలు జరిపిన తర్వాతే దీనిపై ఏకాభిప్రాయానికి వచ్చారు. అయితే విభజన జరిగి నేటికి ఆరేళ్ళు గడచినా కేంద్రంలో అధికారంలోఉన్న బిజేపి నేతృత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం దీనిపై ఏమాత్రం శ్రద్ధ చూపించడంలేదు. 2014లో తీసుకున్న ఈ నిర్ణయంపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాయి, అయినా రెండవసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం మాత్రం దాన్ని పెండింగ్‌లోనే పెడుతూనే ఉంది. కొత్తగా ఏర్పడిన రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలను ఏర్పరుచుకున్న నాటి టిఆర్‌ఎస్‌, ‌టిడిపి ప్రభుత్వాలు వివిధ పార్టీల్లోని పలువురు నాయకులను ఆకర్ష్ ‌పథకం కింద తమ పార్టీల్లోకి ఆహ్వానించాయి. వారికి తమ పార్టీల తరఫున ఎంఎల్‌ఏ ‌టికట్లను ఇస్తామని హామీలిచ్చాయి. కేంద్రం అసెంబ్లీ స్తానాలు పెంచితే తెలంగాణ అసెంబ్లీలో ఉన్న 119 శాసనసభ స్థానాలకుతోడు మరో 34 స్థానాలు అదనంగా వస్తాయని, అప్పుడు ఇతర పార్టీల్లోనుండి వచ్చినవారికి టికట్లు కేటాయించవచ్చని టిఆర్‌ఎస్‌ ఆశించింది. అలాగే ఏపి అసెంబ్లీలో కూడా ప్రస్తుతమున్న 175 స్థానాలు 225కు పెరుగుతాయని, అక్కడ కూడా మరో యాభై మందికి అదనంగా అవకాశం ఏర్పడుతుందని ఆశించారు.

కాని, ఆరేళ్ళుగా బిజెపి ప్రభుత్వం ఈ విషయాన్ని పెండింగ్‌లో పెడుతూనే ఉంది. అంతేకాదు ఈ ఆరెళ్ళకాలంలో కేంద్రం అనేకసార్లు అయోమయానికి గురిచేసే ప్రకటనలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచేదిలేదని ఒకసారి, ఆ విషయాన్ని ఇంకా కేంద్రం ఆలోచించడంలేదని మరోసారి, ఇప్పట్లో ఆ ప్రస్తావనేలేదని ఇంకోసారి, కేంద్ర న్యాయశాఖ వద్ద ఆ ఫైల్‌ ‌పెండింగ్‌లో ఉందని.. ఇలా కేంద్ర బిజెపి నాయకులు ఎవరికి తోచినట్లు వారు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. 2018లో ఆనాటి టిడిపి ఎంపి (ప్రస్తుతం ఆయన బిజెపిలో ఉన్నారు)గా ఉన్న సుజనాచౌదరి ఇదే విషయాన్ని ప్రశ్నించినప్పుడు కూడా కేంద్రం ఇప్పట్లో పెంచే ప్రశ్నేలేదని ఖచ్చితంగా చెప్పేసింది. ఆర్టికల్‌ 170(3) ‌ప్రకారం 2026 తర్వాత సేకరించే తొలి జనాభా లెక్కల ప్రకారమే రెండు తెలుగురాష్ట్రాల్లో శాసనసభ స్థానాలను పెంచడం జరుగుతుందని ఆనాటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సమాధానమిచ్చాడు. నేటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికూడా ఇంచుమించు అదే విషయాన్ని వెల్లడించారు. అయితే జమ్ముకాశ్మీర్‌లో మాత్రం అసెంబ్లీ స్థానాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నట్లు వార్తలు రావడంతో ఇప్పుడీ అంశం వివాదగ్రస్తమయింది. శాంతి భద్రతలు ఒక కొలిక్కి రావడంతో జమ్మూకాశ్మీర్‌లో త్వరలో ఎన్నికలు జరుపాలని కేంద్రం నిర్ణయించింది. ఎలాగూ ఎన్నికల సన్నాహాలు చేస్తుండడంతో పనిలోపనిగా అక్కడ శాసనసభ స్థానాలను కూడా పెంచాలని కేంద్రం నిశ్చయించినట్లు తెలుస్తున్నది. ఈ మేరకు ఢిల్లీలో జమ్మూకాశ్మీర్‌ ‌బ్లాక్‌ ‌లెవల్‌ ‌ప్రజాప్రతినిధులతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయిన కిషన్‌రెడ్డి చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. విభజన చట్టంలో పొందుపర్చినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచకుండా కేవలం జమ్మూ కాశ్మీర్‌లో పెంచడమేంటని ఇప్పుడు తెలంగాణ నాయకత్వం కేంద్రాన్ని నిలదీస్తున్నది.

రాష్ట్ర ప్రణాళికాసంఘం వైస్‌చై•ర్మన్‌ ‌బోయినపల్లి వినోద్‌కుమార్‌ ఇదే అంశాన్ని లేవనెత్తుతూ కేంద్రం మొదటి నుండి ద్వంద్వ వైఖరిని అవలబంబిస్తున్నదని తీవ్రంగా విమర్శించా. దేశమంతటికీ ఒకే చట్టం, ఒకే న్యాయమంటున్న కేంద్రం ఆరేళ్ళుగా అడుగుతున్న తమను పక్కనపెట్టి ఒక్క జమ్ముకాశ్మీర్‌లో అసెంబ్లీ స్థానాలను పెంచాలని నిర్ణయం తీసుకోవడమేంటన్నారు. రెండు తెలుగురాష్ట్రాలతో ఇప్పట్లో బిజెపికి పెద్దగా వచ్చే లాభమేమీలేకపోవడంవల్లే ఈ రెండు రాష్ట్రాల డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడంలేదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తంచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇలానే వ్యవహరిస్తే న్యాయస్థానం తలుపులు తట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆయన ఘాటుగానే హెచ్చరించడం గమనార్హం. ఇదిలాఉంటే వాస్తవంగా జమ్మూకాశ్మీర్‌లోని 107 అసెంబ్లీ స్థానాలకు తోడు మరో ఏడు స్థానాలను అదనంగా పెంచాలన్న నిర్ణయాన్ని ఇంకా కేంద్ర ప్రభుత్వం తీసుకోనేలేదని, ఆ విషయం ఇంకా పరిశీలనస్థాయిలోనే ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వేడిని చల్లార్చే ప్రయత్నంచేస్తూనే, మరో వివాదస్పదమైన వ్యాఖ్య చేశారు. నాటి కేంద్ర ప్రభుత్వం విభజన చట్టాన్ని అడ్డగోలుగా రూపొందించిందని, అప్పటిదాకాలేని సీట్ల పెంపు అంశాన్ని రాత్రికి రాత్రే చేర్చారని అన్నారు. ఈ వ్యాఖ్యను తెలంగాణ నాయకత్వం తీవ్రంగా పరిగణిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.